'ఆడ'నే చిదిమేసి..! | Trends in selective abortion of female foetuses in India | Sakshi
Sakshi News home page

'ఆడ'నే చిదిమేసి..! అడ్డూఅదుపు లేని లింగ నిర్ధారణ పరీక్షలు

Sep 23 2025 10:37 AM | Updated on Sep 23 2025 11:48 AM

Trends in selective abortion of female foetuses in India

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. రాజ్యాలు ఏలుతున్నా.. అంతరిక్షంలో అడుగిడుతున్నా.. ఇప్పటికీ ఆడపిల్ల పట్ల వివక్ష కొనసాగుతోంది. పెళ్లయిన ప్రతి మహిళ తన కడుపు పండాలని కోరుకుంటుంది. ఆ సంతోషం కడుపులో పడగానే తమ ప్రతిరూపాన్ని చూసుకునేందుకు నవమాసాలు నిరీక్షిస్తుంది. తల్లికి ఆడ, మగ అనే భేదం ఉండకపోయినా.. భర్త, అత్తమామలకు మాత్రం ఇప్పటికీ మగపిల్లాడిపైనే మనసు. 

గర్భం దాల్చడమే ఆలస్యం.. ఏ డాక్టర్‌ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుందోనని ఆరా తీయడం మొదలవుతోంది. ఆడపిల్ల కడుపులో ఉందని తెలిస్తే చాలు.. ఎప్పుడెప్పుడు చిదిమేయాలనే ఆలోచన పురుడుపోసుకుంటుంది. ఇలా ఎంతో మంది ఆడపిల్లలు భూమిపై పడకుండానే రక్తపు ముద్దలుగా గాల్లో కలిసిపోతున్నారు. ఈ తంతు నిత్యకృత్యమైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం గమనార్హం. 

ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో అధికారికంగా 246 స్కానింగ్‌ కేంద్రాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్టర్‌ అయ్యాయి. అనధికారికంగా పదుల సంఖ్యలో స్కానింగ్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్, కొత్తబస్టాండ్, ఎన్‌ఆర్‌ పేట ప్రాంతాల్లోని పలు స్కానింగ్‌ కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో యథేచ్ఛగా స్కానింగ్‌ ద్వారా లింగనిర్ధారణ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆడపిల్లగా నిర్ధారణ అయితే రూ.5వేలు, మగబిడ్డ అని తేలితే రూ.8వేలు వసూలు చేస్తున్నారు. 

గర్భంలో ఉన్నది ఆడబిడ్డ అని తేలితే వైద్యులను కలిసి అబార్షన్‌(భ్రూణహత్యలు) చేయించుకుంటున్నారు. ఇందుకోసం రూ.20వేల నుంచి రూ.30వేల దాకా వసూలు చేస్తున్నారు. స్కానింగ్‌ కేంద్రాల వద్ద మాత్రం ఇక్కడ ఎలాంటి లింగనిర్ధారణ చేయబడదని ప్రకటనలు మాత్రమే ఉంటాయి. కానీ కొన్ని కేంద్రాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ జరుగుతోంది. ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలులోని కొత్తబస్టాండ్‌ ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లో ఆర్‌ఎంపీలే స్కానింగ్‌ చేస్తుండటం గమనార్హం. 

ఆఇటీవల కొత్తబస్టాండ్‌ సమీపంలోని మార్కెట్‌ యార్డు వద్దనున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 9 నెలల గర్భిణికి అబార్షన్‌ చేయాలని ప్రయత్నించారు. చివరి నిమిషంలో ఆ గర్భవతి భయపడి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి ఆసుపత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురికి అబార్షన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినా అధికారులు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. 

అబార్షన్‌లతో తీవ్ర అనారోగ్యం 
మాకు మగబిడ్డే కావాలని, కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలియగానే కొందరు తరచూ అబార్షన్లు చేయిస్తుంటారు. ఇది ఆ తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తరచూ గర్భం దాల్చడం వల్ల బీపీ, రక్తహీనత, షుగర్‌ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జని్మంచే పిల్లలు సైతం నెలలు నిండకముందే జని్మస్తారు. ఇది శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పుట్టబోయే బిడ్డ సరిగ్గా ఎదగనప్పుడు, తల్లికి నియంత్రించలేని బీపీ ఉన్నప్పుడు, 3, 4వ స్టేజిలో తల్లికి క్యాన్సర్‌ ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో అబార్షన్‌ చేయాల్సి ఉంటుంది. 

అది కోడుమూరులోని బాషా నర్సింగ్‌ హోం. ఆదివారమైనా ఎంతో రద్దీగా ఉంది. ఆసుపత్రిలోని స్కానింగ్‌ కేంద్రం వద్ద గర్భవతులు పదుల సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. ఓ గర్భవతికి లింగనిర్ధారణ చేయించాలని ఓ బృందం వచ్చింది. వారు అనుకున్నట్లే వైద్యులకు విషయం చెప్పారు. వారు చెప్పినట్లే అక్కడి వైద్యులు స్కానింగ్‌ చేసి కడుపులో ఉన్నది ఏ బిడ్డో చెప్పేశారు. అంతే రెడ్‌ హ్యాండెడ్‌గా ఆ వైద్యురాలిని అధికారులు పట్టుకున్నారు. కర్ణాటక స్టేట్‌ పీసీ పీఎన్‌డీటీ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వివేక్‌ దొరై సమాచారం ఇవ్వడంతో ఏపీ స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి.శాంతికళ సంయుక్తంగా ఈ దాడులు చేశారు. ఈ మేరకు హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు. 

ఇదే విషయంలో పదేళ్ల క్రితం ఓ ట్రైనీ కలెక్టర్‌ నేతృత్వంలో ఈ ఆసుపత్రిపై డెకాయిట్‌ ఆపరేషన్‌ చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆసుపత్రిని సీజ్‌ చేశారు. రెండురోజుల్లోనే ఆసుపత్రిలో మరో ద్వారం తెరిచి మరో స్కానింగ్‌ మిషన ద్వారా తమ కార్యకలాపాలను యథేచ్ఛగా మొదలుపెట్టడం గమనార్హం. అధికారులు విధి నిర్వహణలో ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారో ఈ ఆసుపత్రిని చూస్తే అర్థమవుతుంది.

ఇటీవల నందికొట్కూరులో గడివేముల మండలం గని గ్రామానికి చెందిన గర్భిణికి అక్కడి ఆర్‌ఎంపీ అబార్షన్‌ చేయడంతో ఆమె మరణించింది. వివరాలు ఆరా తీయగా ఆమెకు కర్నూలులోని కొత్తబస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్‌ చేయగా లింగనిర్ధారణ చేశారని తేలింది. ఈ ఘటన జరిగి రెండు నెలలవుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.

కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌  బృందం ఏడాది కాలంగా జిల్లాలో 36 డెకాయిట్‌ ఆపరేషన్లు(దాడులు) నిర్వహించినట్లు లెక్కలు రాసుకున్నారు. అందులో అన్ని స్కానింగ్‌ సెంటర్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబునిచ్చారు. మరి కర్ణాటక అధికారుల డెకాయిట్‌ ఆపరేషన్‌లో కోడుమూరు ఘటన వెలుగులోకి రావడం చూస్తే ఇక్కడి అధికారుల పనితీరు ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.

దాడులు ముమ్మరం చేస్తాం 
పీసీ పీఎన్‌డీటీ చట్టం ప్రకారం లింగనిర్ధారణ చేయడం నేరం. లింగనిర్ధారణ, గర్భస్రావాలు చేసిన, చేయించిన ఇద్దరికీ శిక్షలు తప్పవు. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50వేల జరిమానా ఉంటుంది. స్కానింగ్, అబార్షన్‌ చేసిన సదరు వైద్యుల పేరును భారత వైద్యవిధాన మండలి నుంచి తాత్కాలికంగా, కొన్నిసార్లు శాశ్వతంగా తొలగిస్తారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డెకాయిట్‌ ఆపరేషన్లు చేస్తున్నాం. ఇకపై మరింత ముమ్మరం చేస్తాం. 
–డాక్టర్‌ పి.శాంతికళ, డీఎంహెచ్‌ఓ, కర్నూలు 

తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య 
జిల్లాలో ఆడ, మగపిల్లల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. వెయ్యి మంది మగపిల్లలు ఉంటే ఐదేళ్ల క్రితం 920 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఇప్పుడు     ఆ సంఖ్య 900లోపు చేరుకుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అక్షరాస్యత తక్కువగా ఉండే ఆదోని, కర్నూలు డివిజన్‌లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది. కోసిగి, నందవరం, సి.బెళగల్, గూడూరు, కల్లూరు,  జూపాడుబంగ్లా, హోళగుంద, హాలహరి్వ, ఆలూరు, ఆస్పరి, కోడుమూరు, గోనెగండ్ల, వెల్దుర్తి, తుగ్గలి మండలాల్లో మగవారి కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement