మళ్లీ అవసరమా? | Flu vaccine is essential for pregnant women | Sakshi
Sakshi News home page

మళ్లీ అవసరమా?

Nov 16 2025 4:30 AM | Updated on Nov 16 2025 4:30 AM

Flu vaccine is essential for pregnant women

నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా? – రమ్య, చిత్తూరు. 
గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్‌ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. 

సాధారణంగా అక్టోబర్‌ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్‌ సమయానికి ఫ్లూ షాట్‌ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్‌ ఇవ్వడం సాధ్యమవదు. 

ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్‌ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. 

డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.

నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్‌ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్‌ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్‌గా ఉంటాయి? – బింధు, హైదరాబాద్‌. 
ఇప్పుడున్న ‘ఎల్‌ఏఆర్‌సీ’ అంటే (లాంగ్‌ యాక్టింగ్‌ రివర్సబుల్‌ కాంట్రాసెప్షన్‌) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్‌లోనే ఎల్‌ఏఆర్‌సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. 

నార్మల్‌ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్‌ డివైస్‌’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్‌ డాక్టర్లు డెలివరీ రూమ్‌లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్‌కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. 

డిశ్చార్జ్‌ అయ్యేలోపే చెక్‌ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్‌లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్‌కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. 

ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్‌ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్‌ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్‌ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్‌ చెకప్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. 

కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్‌ ఫాలోఅప్‌ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్‌ కంట్రోల్‌ ఇంప్లాంట్‌ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్‌ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్‌ ఛాన్్స 1% కన్నా తక్కువ. 

ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్‌గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్‌ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. 

-డా‘‘ భావన కాసు ,గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
-హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement