
ధర్మ సందేహం
జులై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి
ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని, తొలి ఏకాదశి అనీ పిలుస్తారు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు.
ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.
మర్నాడు... అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలూ కలిగాయని పురాణోక్తి.