ఓవైపు అసిస్టెంట్‌ కమిషనర్‌గా..మరోవైపు కళాకారిణిగా.. | Telangana Officer Vani Bhavani Balances Duty and Dance with 160 km Journey for Passion | Sakshi
Sakshi News home page

ఓవైపు అసిస్టెంట్‌ కమిషనర్‌గా..మరోవైపు కళాకారిణిగా..

Sep 17 2025 11:02 AM | Updated on Sep 17 2025 12:09 PM

Telangana Consumer Affairs Asst Commissioner Vani Bhavani

నృత్యం ఓ తపస్సు.. ఇందులో రాణించాలంటే.. ఏదో నేర్చుకున్నామంటే సరిపోదు.. ఓ యజ్ఞంలా నిత్యం సాధన చేయాలి.. అలాంటి ఓ గొప్ప కళపై ఆమె ప్రాణం పెట్టేశారు. ఎంతలా అంటే.. ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించి అభ్యసించేంతలా. ఆమె ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇన్‌చార్జ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంట్రప్రగడ వాణి భవాని. ఓ వైపు అధికారిగా, మరోవైపు కళాకారిణిగా, గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తన అడుగుజాడలనే అనుసరిస్తూ చిన్న వయసులోనే నృత్యంలో ప్రతిభ చూపుతున్న తన కుమార్తెకు కూడా మార్గదర్శిగా నిలుస్తున్నారు.. 

వివిధ కళారూపాల సమాహారం నృత్యం. సంగీతం, సాహిత్యం, మానసిక శాస్త్రం ఇలా అనేక కళలు కలిస్తేనే నృత్యం. అలాంటి కళతో నాకు బాల్యంలోనే పరిచయం ఏర్పడింది. క్రమంగా నా జీవితంతో పెనవేసుకుపోయింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విద్యాభ్యాసం సమయంలో డాన్స్‌ క్లాస్‌ ఉండేది. టీచర్లు కూడా ప్రోత్సహించేవారు. అప్పటినుంచే నృత్యం పట్ల మక్కువ ఏర్పడింది. భక్తి శ్రద్ధలతో ఎలాగైనా ఈ కళలో మాస్టర్‌ కావాలని సంకల్పించా. దీనికి కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ‘స్వర్ణ కమలం’ మరింత స్ఫూర్తినిచ్చింది. చివరికి ఆయన సమక్షంలోనే అరంగేట్రం పూర్తిచేశా.

ఆరంభం ఇలా.. 
ఇంటర్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాం. నల్లకుంటలోని అమ్మమ్మ ఇంట్లో ఉండే వాళ్లం. అక్కడ సుప్రసిద్ధ నాట్య గురువు మద్దాలి ఉషా గాయత్రి దగ్గర చేరాను. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న నాన్నగారు హఠాత్తుగా మరణించారు. దీంతో కారుణ్య నియామకంలో ఆయన ఉద్యోగం ఇచ్చారు. కరీంనగర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 

దీంతో నృత్యాభ్యాసం ఆగిపోయే పరిస్థితి. ఎలాగైనా కొనసాగించాలన్న నా సంకల్పానికి అమ్మ, సోదరి అండగా నిలిచారు. నాట్య గురువు ప్రోత్సాహంతో వారంతాల్లో 160 కిలోమీటర్లు ప్రయాణించి అభ్యాసం పూర్తిచేశా. ఇప్పటి వరకూ 75 కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందా. నా భర్త భరణి, అత్తగారింటి సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. నా కుమార్తె అనన్య సైతం నాట్య గురువు మద్దాలి ఉషా గాయత్రి దగ్గరే శిక్షణ పొందుతోంది.

ఏకాగ్రత పెరుగుతుంది..
ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. పర్యావరణ పరిరక్షణ, నాట్యం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నా. నృత్యం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి.. ఇది కదలికల ద్వారా చేసే ధ్యానం లాంటిది. అర్థంతో, లయతో కదలికలను సమన్వయం చేసుకోవాలి. అదే సమయంలో భంగిమలను సరిగ్గా ప్రదర్శించగలగాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. సంప్రదాయ నృత్యం రూపకల్పనలో కుడివైపు, ఎడమవైపు కదలికలు ఉంటాయి. 

దీనివల్ల మెదడులోని ఇరు భాగాలనూ సమానంగా ఉపయోగించే సామర్థ్యం కలుగుతుంది. దుస్తులు, ఆభరణాలు, మేకప్, రంగాలంకరణతో సహా నృత్యంలో అనేక అంశాలుంటాయి. దీనికి ఎంతో ఓపిక అవకసం. నేటి తరం పిలల్లోని అసహనాన్ని నృత్యాభ్యాసం నివారిస్తుంది. గురువులకు ఇచ్చే గౌరవం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని, పక్షులను కాపాడటం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నా.  

(చదవండి: మాన్సున్‌ ఎండ్‌..ట్రెక్కింగ్‌ ట్రెండ్‌..! సై అంటున్న యువత..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement