మాన్సున్‌ ఎండ్‌..ట్రెక్కింగ్‌ ట్రెండ్‌..! సై అంటున్న యువత.. | Youth going trekking to remote areas For mix of fun, adventure and learning | Sakshi
Sakshi News home page

మాన్సున్‌ ఎండ్‌..ట్రెక్కింగ్‌ ట్రెండ్‌..! సై అంటున్న యువత..

Sep 17 2025 10:39 AM | Updated on Sep 17 2025 10:52 AM

Youth going trekking to remote areas For mix of fun, adventure and learning

ఓ మైపు మాన్సూన్‌ సీజన్‌ ముగింపు దశకు చేరుకొంది. దీంతో పాటు ట్రెక్కింగ్‌ సీజన్‌ మొదలవుతోంది.. ప్రస్తుత వాతావరణం ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉండడంతో నగరంలోని ఔత్సాహికుల్లో జోష్‌ నెలకొంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో యువత ట్రెక్‌ పాయింట్లలో, పలు పర్యాటక ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో కనువిందు చేసే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్వతాలు, లోయలు, జలపాతాలకు బ్యాక్‌ప్యాక్‌తో పయనమవుతున్నారు. రుతుపవనాలు ముగింపు సీజన్‌లో ట్రెక్కింగ్‌ ట్రెండ్‌ పీక్స్‌కు చేరుతుంది. దీంతో నగరం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని ట్రెక్‌ పాయింట్లకు నగర పర్యాటకుల సందడి మొదలైంది. 

వర్షాలు పర్వతాలపై అద్భుతమైన పచ్చదనాన్ని పరుస్తాయి. మరోవైపు పర్వతాలపై నుంచి ఎగసిపడే జలపాతాలు ప్రకృతి సోయగాన్ని రెట్టింపు చేస్తాయి. పచ్చని లోయలు, కొండ ఉపరితలాలపై పొగమంచు దృశ్యాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయి. పచి్చకబయళ్ళు, పూలతో నిండిన గుట్టలు ట్రెక్కింగ్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. వీటన్నింటి మధ్య నడుస్తూ చిరు చినుకుల్లో తడుస్తూ మధురానుభూతులను పోగు చేసుకోడానికి ట్రెక్కర్స్‌ ఉత్సాహం చూపుతుంటారు. 

మన సిటీకి.. ‘మహా’ ఇష్టం.. 
మహారాష్ట్రలోని పలు ట్రెక్‌ పాయింట్స్‌ నగరవాసులకు ఇష్టమైన జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా లోనావాలాలోని రాజ్మాచీ ట్రెక్‌ ఒకటి. మబ్బులు, లోయలు, జలపాతాలతో ఈ ట్రెక్‌ ఆద్యంతం అలరిస్తుంది.  అలాగే అహ్మద్‌నగర్‌ జిల్లాలోని హరిశ్చంద్ర ఘడ్‌ ట్రెక్‌ కూడా నగర ట్రెక్‌ కమ్యూనిటీలో బాగా పాపులర్‌. పశ్చిమ కనుమల్లోని పురాతన కొండపై కోటకు నడకమార్గం ప్రకృతి ప్రేమికులతో పాటు సాహసికులకు కూడా ఇష్టమైన రూట్‌. గుహలు, కోట అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యం కూడా దీని సొంతం.  ప్రారంభకులకు అనుకూలమైనది. 

అదే విధంగా టోర్నా.. ఫోర్ట్‌ ట్రెక్‌ కూడా మరో క్రేజీ ట్రెక్‌. టోర్నా ఫోర్ట్‌ ట్రెక్‌ లేదా ప్రచండగడ్, పుణె సమీపంలో ఒక రోజు ట్రెక్, ఇది 4,603 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరానికి 2–3 కి.మీ (ఒక వైపు) ట్రైల్‌తో సవాలుతో కూడుకున్న ట్రెక్‌. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ మొదటి కోటగా చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకూ సీజన్‌లో ఫ్లవర్‌ బెడ్స్‌తో చక్కని దృశ్యాలను అందిస్తుంది. 

ట్రెక్‌ చకచకా..గో కర్ణాటక.. 
ట్రెక్కర్స్‌కు కలల ప్రదేశం కర్నాటకలోని చిక్‌ మగళూరులోని కుద్రేముఖ్‌ ట్రెక్‌. సుమారుగా 19–21 కి.మీ (రౌండ్‌ ట్రిప్‌) దూరం ఉండే ఈ ట్రెక్, కాస్తంత అనుభవం ఉన్న ట్రెక్కర్స్‌కు బెస్ట్‌. ఈ ట్రెక్‌ 1,892 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతం దట్టమైన గడ్డి భూములు, షోలా అడవులకు ప్రసిద్ధి. 

ఈ ట్రెక్‌లో ప్రవాహాలను దాటుతూ, ‘ఒంటరి చెట్టు‘ (ఒంటిమార) వంటి ప్రదేశాల గుండా ప్రయాణించి, శిఖరాన్ని చేరుకోవాలి. ఈ ట్రెక్‌కు రోజూ పరిమిత సంఖ్యలో మాత్రమే ట్రెక్కర్స్‌కు అనుమతిస్తారు. సాధారణంగా జూలై నుంచి నవంబర్‌ వరకు సీజన్‌. దీనికి సమీపంలోనే నేత్రావతి ట్రెక్‌ కూడా ఉంది. 

స్కందగిరి హిల్స్‌ : బెంగళూరు నుంచి 60–65 కి.మీ దూరంలో ఉన్న స్కందగిరి హిల్స్‌ కూడా కాసింత కఠినమైన సవాలుతో కూడిన ట్రెక్‌ పాయింట్‌. కర్ణాటక అటవీ శాఖ పోర్టల్‌ ద్వారా ట్రెక్‌ను ముందస్తు బుక్‌ చేసుకోవాలి. ముల్లయనగిరి ట్రెక్‌ కర్ణాటకలోని ఎత్తయిన శిఖరం వరకూ హైకింగ్‌. ఇది కూడా కాస్తంత కఠినమైనదే. 

ఈ కాలిబాట సర్పధారి నుంచి ప్రారంభమవుతుంది. ఒక వైపు ట్రెక్‌కి దాదాపు గంటన్నర నుంచి రెండున్నర గంటలు పడుతుంది. ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు, చిన్న గుహలను కలిగి ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం సందర్శకులు సెపె్టంబర్‌ నుంచి మార్చి వరకు ఎంచుకోవచ్చు. ఇవే కాక మిగతా రాష్ట్రాల్లోని ప్రాంతాలైన కూర్గ్, మున్నార్, వాయనాడ్‌ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా ట్రెక్స్‌ నిర్వహిస్తున్నారు. 

తమిళనాట.. ట్రెక్‌ బాట.. 
అందరికీ తెలిసిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన కోడైకెనాల్, ఊటీ ట్రెక్కింగ్‌కు పేరొందాయి. ముఖ్యంగా ఊటీలోని దొడ్డబెట్ట పీక్స్‌ ట్రెక్‌ బాగా ఫేమస్‌. అలాగే యెలగిరి హిల్స్‌లోని స్వామి మలాయ్‌ హిల్స్‌ ట్రెక్‌ సైతం మాన్సూన్‌లో సిటీ ట్రెక్కర్స్‌ను ఆకట్టుకుంటోంది.

మార్గదర్శకాలు తప్పనిసరి.. 
మాన్సూన్‌ ట్రెక్కింగ్‌ అనేది సాహసాలను ఇష్టపడుతూ.. ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించే అరుదైన అవకాశం. వర్షపు వాతావరణంలో ఇది మరిచిపోలేని అనుభవంగా నిలుస్తుంది. ట్రెక్కింగ్‌లో సాధారణంగా రాత్రిపూట బసలు ఉంటాయి. స్థానిక నిర్వాహకుల ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. లేదా స్వతంత్రంగానూ నిర్వహించవచ్చు. నగరం నుంచి అనేక సంస్థలు ఈ ట్రెక్స్‌ నిర్వహిస్తున్నాయి. రూ.3వేల నుంచి మొదలుకుని ట్రెక్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. సరైన సంస్థను, పర్యవేక్షణలో నిపుణులైన ట్రెక్కర్స్‌ మార్గదర్శకత్వంలో మాత్రమే ట్రెక్కింగ్‌ సురక్షితం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement