
ఖాప్ పంచాయత్‌ల గురించి వినే ఉంటారు... వీటికి ఉత్తర భారత్ పెట్టింది పేరు! లాడో పంచాయత్‌ల గురించి విన్నారా? మహిళా హక్కులను కాపాడేందుకు గొంతెత్తుతున్న పంచాయత్‌లు! ఖాప్ పంచాయత్‌లకు వ్యతిరేకంగా ఓ ఉద్యమంలా సాగుతున్నాయి.
అయిదారేళ్ల కిందట...
హరియాణ , ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో.. పుట్టకుండానే ఆడపిల్లలను చంపేసేవారు. పొరపాటున పుడితే ఆ పిల్లలకు కాఫీ (ఇక చాలు), మాఫీ (క్షమాపణ) లాంటి పేర్లు పెట్టేవారు.
ఆడపిల్లల్ని కన్నందుకు సమాజానికి సంజాయిషీలా! అక్కడ అమ్మాయిలు ఐడెంటిఫై అయ్యేది వివక్షతోనే! ఆంక్షల మధ్యే వాళ్ల గమనం. అరుదుగా చదువుకునే చాన్స్ దొరికితే సర్కారు బడితోనే సరి. తర్వాత పెళ్లే! వాళ్లకు సోషల్ మీడియాలో అకౌంట్స్ నిషేధం! వరకట్నాలు, డొమెస్టిక్ వయొలెన్స్‌తోనే సహజీవనం.
ఇప్పుడు...
చాలా ప్రాంతాల్లో పరిస్థితి మారింది. భ్రూణ హత్యల మీద స్త్రీలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఆడపిల్ల పుట్టడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అబ్బాయిలతో సమంగా అమ్మాయిలను చదివిస్తున్నారు. మెన్‌స్ట్రువల్ రైట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. బాల్యవివాహాలను నిరోధిస్తున్నారు.
వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్నారు. గృహహింసను అడ్డుకుంటున్నారు. సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకోవడమే కాదు.. తమ పోరాటాలను పోస్ట్ చేస్తున్నారు. అమ్మాయిల పెళ్లి వయసును పద్దెనిమిది నుంచి 21 ఏళ్లకు పెంచాలని ఉద్యమిస్తున్నారు. ఆస్తి హక్కు కోసం నినదిస్తున్నారు.
ఈ ధైర్యానికి కారణం.. లాడో పంచాయత్‌లు...
దీని వ్యవస్థాపకుడు సునీల్ జగ్లాన్. హరియాణాలోని బీబీపూర్ మాజీ సర్పంచ్, సామాజిక కార్యకర్త. కూతురు పుట్టిందని సునీల్ సంబరాలు చేసుకుంటుండగా ఊళ్లోని పెద్దలంతా అతన్ని చూసి జాలిపడ్డారట. అప్పుడే అనుకున్నాడతను.. అమ్మాయి పుట్టినందుకు గర్వపడేలా, అమ్మాయిని గౌరవంగా చూసేలా జనాల్లో చైతన్యం తేవాలని, ఆ ప్రయాణంలో ముందుగా తమ హక్కుల పట్ల అమ్మాయిలకు అవగాహన కల్పించాలని! ఆ ఆలోచనే ‘లాడో పంచాయత్’గా మొదలైంది.
అందులో భాగంగానే చదువు నుంచి ఆస్తి దాకా ఆడపిల్లలకున్న హక్కుల గురించి వాళ్లకు అవగాహన కల్పించాడు. ప్రశ్నించడం, పోరాడటం నేర్పించాడు. దానికోసం దాదాపు అయిదేళ్లు శ్రమపడ్డాడు. వేలమంది అమ్మాయిలను ఏకం చేశాడు.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఇందులో 15 – 30 ఏళ్ల మధ్య అమ్మాయిలు సభ్యులుగా ఉంటారు. వీళ్లంతా ఊళ్లల్లోని అమ్మాయిలు, మహిళలను సమావేశపరుస్తారు. ప్రతి సెషన్‌లో ఒక అమ్మాయిని ప్రధాన్ లేదా హెడ్‌లా ఎంచుకుంటారు. ఆమె తలకు పాగా చుట్టుకుని మీటింగ్ నిర్వహిస్తుంది. సభ్యులంతా కలిసే మీటింగ్ ఎజెండాను నిర్ణయిస్తారు.
చర్చల్లో తీసుకున్న తీర్మానాలను అందరి సంతకాలతో సంబంధిత ప్రభుత్వాధికారులకు సబ్‌మిట్ చేస్తారు. అయితే ఈ పంచాయత్‌లోని ప్రధాన్ తలకు పాగా చుట్టుకోవడమన్నది సంప్రదాయ పంచాయతీలోని పురుషాధిపత్య వ్యతిరేకతను చాటడానికే అంటాడు సునీల్ జగ్లాన్.
దుర్భాషల మీద జరిమానా...
సునీల్ జగ్లాన్ సర్పంచ్‌గా ఉన్న టైమ్‌లో.. తన కూతురి నోటివెంట చెడ్డ మాట విని అవాక్కయ్యాడు. అలా ఎంతమంది పిల్లలు అలాంటి మాటలు నేర్చుకుంటున్నారోననే ఆందోళనతో తన ఇలాఖాలో దుర్భాషలాడిన వాళ్లకు జరిమానా విధించడం మొదలుపెట్టాడు.
ఆ స్ఫూర్తితోనే హరియాణా, హిసార్ జిల్లాలోని నల్వా గ్రామంలో లాడో పంచాయత్ సభ్యులు ‘ఆడవాళ్లను కించపరచే అసభ్య పదాలు, భాషను నేరంగా పరిగణించాలని, సామాజిక దుష్ప్రవర్తనలా చూడాలని, దాని మీద కఠిన చట్టాన్ని తీసుకురావాల’ని డిమాండ్ చేశారు. ఇలా.. అమ్మాయిలు నిర్వహిస్తున్న ఈ లాడో పంచాయత్‌లు గవర్నెన్స్, పంచాయత్‌లు ఎలా ఉండాలో చూపిస్తున్నాయి. వాళ్లకు రాజ్యసభ ఆహ్వానాన్నీ అందిస్తున్నాయి.
సెల్ఫీ విత్ డాటర్
సునీల్ జగ్లాన్ బీబీపూర్ సర్పంచ్ కాకమునుపు లెక్కల మాష్టారు. ప్రస్తుతం రోహతక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. లింగ వివక్షను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా 2015లో తండ్రులు తమ కూతుళ్లతో సెల్ఫీలు దిగి, పోస్ట్ చేసే ‘సెల్ఫీ విత్ డాటర్’ క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేశాడు. దీన్ని ప్రధాని మోదీ కూడా ప్రోత్సహించారు. ‘తరతరాల జాడ్యాలు పోవడానికి చాలా టైమ్ పడుతుంది. మార్పు వచ్చేదాకా ప్రయత్నం కొనసాగాలి’ అంటాడు సునీల్ జగ్లాన్.
చట్టబద్ధత ఉండదు.. కానీ..
ఖాప్ పంచాయత్స్‌లాగే లాడో పంచాయత్‌లకూ చట్టబద్ధత ఉండదు. కానీ సమాజాన్ని చైతన్య పరచడానికి ఉపయోగపడతాయి. మహిళల హక్కుల విషయంలో దీని తీర్మానాల ఆధారంగా కోర్టుల్లో రికమండేషన్స్, న్యాయం పొందే అవకాశం ఉంటుంది.
– ఇ. పార్వతి, హైకోర్ట్ అడ్వకేట్
(చదవండి: Independence Day: 107 ఏళ్ల నాటి షెర్బత్ దుకాణం..నాటి సమర యోధులు నేతాజీ, సత్యజిత్‌రే..)