లాకప్‌లో హత్య.. | Sunday Special Crime Story On A Custodial Killing Written By Srisudhamai | Sakshi
Sakshi News home page

లాకప్‌లో హత్య..

Jul 5 2026 8:05 AM | Updated on Jul 5 2026 8:05 AM

Sunday Special Crime Story On A Custodial Killing Written By Srisudhamai

క్లూషియల్‌

సెంట్రల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. మరికొద్ది రోజుల్లో రిటైర్‌ కాబోతున్న హెడ్‌ కానిస్టేబుల్‌ పరమశివం స్టేషన్‌ ముఖద్వారం వద్ద సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. లాకప్‌లో చైన్‌ స్నాచర్‌ తంగవేలు ఒక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, తెల్లవారేసరికి తంగవేలు లాకప్‌లోనే శవమై కనిపించాడు. స్టేషన్‌ లో కలకలం రేగింది..
∙∙ 
డీసీపీ... ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు వైపు చూసి చెప్పాడు.
‘మీరు ఎన్నో కేసులను అవలీలగా పరిశోధించారు. ఈ కేసు మన డిపార్ట్‌మెంట్‌కు సవాలు... పాపం సెంట్రీ పరమశివానికి రిటైర్‌ కాబోతున్న సమయంలో కోలుకోలేని దెబ్బ అవుతుంది. పరమశివాన్ని వెంటనే సస్పెండ్‌  చేయమని పైనుంచి ఒత్తిడి.. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే నెపంతో పరమశివాన్ని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్‌ చేస్తే అతనికి చివరి క్షణాల్లో బ్లాక్‌ మార్క్‌గా ఉంటుంది. దీన్ని లాకప్‌ డెత్‌గా మీడియా ప్రచారం చేస్తుంది. వీటన్నింటికి చెక్‌ పెట్టాలంటే మీరే వెంటనే ఈ కేసులోని నిజనిజాల నిగ్గు తేల్చాలి.’’

జీవితాంతం మచ్చలేని రికార్డుతో బతికిన పరమశివం, ‘‘సార్, నేను నిరపరాధిని. రాత్రి ఎవరు వచ్చారో, ఎలా చనిపోయాడో నాకు తెలియదు’’ అని ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు ముందు కన్నీటి పర్యంతం అయ్యాడు..
అభిమన్యు– తంగవేలు శవాన్ని పరిశీలించాడు. తంగవేలు శరీరం మీద ఎక్కడా గాయాలు లేవు. తంగవేలు నోటి లోపలి భాగంలో స్వల్పంగా రంగు మారడాన్ని గమనించి, శవాన్ని పోస్ట్‌మార్టంకు పంపాడు. రిపోర్ట్‌లో ఒక ఘోరమైన విషయం బయటపడింది. తంగవేలు సహజంగా చనిపోలేదు. అతడికి ‘పొటాషియం సైనైడ్‌’ ఇచ్చారు.

అభిమన్యు అర్ధరాత్రి స్టేషన్‌ కు వచ్చిన వారి వివరాలను సేకరించాడు. లాగ్‌ బుక్‌లో ఎవరి పేరూ లేదు. సెంట్రీ పరమశివాన్ని మళ్లీ ప్రశ్నించాడు. ‘రాత్రి ఎవరైనా వచ్చారా? కనీసం టీ అమ్మేవాడు కూడా రాలేదా?’ అని అడిగాడు. పరమశివం ఆలోచించి, ‘రాత్రి ఒంటిగంట సమయంలో స్టేషన్‌ కు రెగ్యులర్‌గా టీ ఇచ్చే సుబ్బు రాలేదు సార్‌! అతడి బదులు మంగళ్‌ అనే కొత్త అబ్బాయి వచ్చాడు. తంగవేలుకు కూడా ఒక కప్పు టీ ఇచ్చాడు. నేను గేటు దగ్గరే ఉన్నాను, లోపలికి ఎవరు వెళ్లలేదు’ అని చెప్పాడు. అభిమన్యు వెంటనే టీ దుకాణం యజమానిని పిలిపించాడు.‘నిజం చెప్పు... రాత్రి స్టేషన్‌లోకి వచ్చింది ఎవరు?’ అని అడిగాడు.

‘రాత్రి సుబ్బుకు ఒంట్లో బాగోలేదని, మంగళ్‌ అనే వ్యక్తి తానే స్వచ్ఛందంగా టీ డెలివరీ చేస్తానని వెళ్లాడని  టీ దుకాణం యజమాని మాటల ద్వారా తెలిసింది. అభిమన్యు తంగవేలు పాత నేరాల రికార్డులను తిరగేశాడు. ఒక పాత దొంగతనం కేసులో తంగవేలుతో పాటు ‘మంగళ్‌’ అనే పేరున్న వ్యక్తి నిందితుడిగా ఉన్నట్లు గమనించాడు. ఇద్దరూ తోడు దొంగలు అన్న నిజం అభిమన్యుకు అర్థమైంది. మరుసటి రోజు కోర్టులో తంగవేలు నోరు విప్పితే, తమ పాత నేరాలు, అందులో తన పాత్ర కూడా బయటకు వస్తుందని మంగళ్‌ భయపడ్డాడు. అందుకే తంగవేలును శాశ్వతంగా మౌనంగా ఉంచాలని ప్లాన్‌ చేశాడు.

మంగళ్‌ పక్కా ప్లాన్‌ తో టీలో సైనైడ్‌ కలిపాడు. రాత్రి స్టేషన్‌ కు వచ్చి సెంట్రీ పరమశివానికి ఒక కప్పు నార్మల్‌ టీ ఇచ్చాడు. ఆ తర్వాత లాకప్‌లో ఉన్న తంగవేలు దగ్గరకు వెళ్లాడు. పరమశివం దూరంగా ఉండటం, చీకటిగా ఉండటంతో లోపల ఏం జరుగుతోందో గమనించలేకపోయాడు. మంగళ్‌ సైనైడ్‌ కలిపిన టీ కప్పును తంగవేలుకు అందించాడు. తంగవేలు తన మిత్రుడిని చూసి నమ్మి ఆ టీ తాగాడు. తాగిన కొద్ది క్షణాల్లోనే నోరు విప్పకుండానే ప్రాణాలు విడిచాడు. మంగళ్‌ ఖాళీ గ్లాసును తీసుకుని ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి జారుకున్నాడు.
∙∙ 
మంగళ్‌ పాతబస్తీవైపు తప్పించుకున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు అతణ్ణి తేలికగానే పట్టుకున్నారు. కొద్ది గంటల్లోనే మంగళ్‌– అభిమన్యు ఎదురుగా నిలబడి వున్నాడు. పరమశివానికి సైగ చేశాడు అభిమన్యు, పరమశివం బయటకు వెళ్లి టీ తీసుకువచ్చాడు. మంగళ్‌కు ఇవ్వమన్నాడు అభిమన్యు. భయంగా చూశాడు మంగళ్‌.
‘తీసుకో మంగళ్‌... రాత్రి నువ్వు నీ ఫ్రెండ్‌ తంగవేలుకు ఇచ్చిన టీ లాంటిదే. తాగు... తాగేశాక నువ్వు వెళ్లిపోవచ్చు... శాశ్వతంగా’ నవ్వుతూ అన్నాడు. మంగళ్‌ వెన్నులో వణుకు మొదలైంది. అతనికి అభిమన్యు సంగతి తెలుసు. అభిమన్యు విచారించే పద్ధతీ తెలుసు.

‘మొత్తం చెప్పేస్తాను... నేను తంగవేలు తోడు దొంగలం. ఎక్కడ నా పేరు చెప్పి నన్ను కూడా ఈ కేసులో ఇరికిస్తాడనే భయంతో టీలో విషం కలిపి చంపాను. ఎవ్వరికీ ఏ అనుమానం రాదనుకున్నాను.’ పరమశివం చేతిలో వున్న టీ వంక, తన ఎదురుగా సింహంలా నిలబడి వున్న అభిమన్యు వంక చూసి చెప్పాడు. మంగళ్‌ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు అరెస్ట్‌ చేసి లాకప్‌కు తరలించారు. పరమశివం నీళ్లు నిండిన కళ్ళతో అభిమన్యుకు చేతులు జోడించాడు.
‘నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు... ఆ టీ మీ కోసమే తాగండి.’ అంటూ బయటకు నడిచాడు.
అభిమన్యు కేసును పన్నెండు గంటల్లోనే పరిష్కరించాడు. అమాయకుడైన పరమశివంపై పడిన నింద తొలగిపోయింది. అతను గౌరవంగా రిటైర్‌ అవ్వడానికి అభిమన్యు కారణమయ్యాడు. హంతకుడు మంగళ్‌ కటకటాలపాలయ్యాడు. - శ్రీసుధామయి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement