బుట్ట నిండింది

Special Story About Nagendram And Bharathi From Tenali guntur District - Sakshi

రహదారికి ఇరువైపులా ఉండే చింతచెట్లు అవి. ఎంతగా చల్లదనాన్ని ఇస్తున్నా, ఆ రోడ్డుపై ఉరుకులు పరుగులతో ప్రయాణించే ఎవరూ వాటికేసి చూడరు. వేసవి వచ్చిందనగానే కొందరు మహిళలు మహిళలు ఆ చెట్లకేసి చూస్తుంటారు. చెట్లు చిగురేస్తే చాలు.. వారి గుండెల్లో ఆశలు మోసులెత్తుతాయి. తెలతెలవారుతూనే చింతచెట్టు ఎక్కుతారు. చిగురుకోసం చిటారుకొమ్మకైనా వెళతారు. బుట్టనిండితే వారి కళ్లు ఆనందంతో మెరుస్తాయి. అవసరమైతే రెండు మూడేసి చెట్లు లంఘించేందుకు ఏమాత్రం వెనుదీయరు. ఎందుకంటే కొన్ని నెలలపాటు ఆ చిగురే వారికి జీవన వనరు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామానికి చెందిన చీరాల నాగేంద్రం, మోరబోయిన భారతిలకు ఇదే ఉపాధి. ఏడాది పొడవునా వరినాట్లు, కలుపు తీయటం సహా పొలం పనులు చేస్తుండే వీరు, చిగుర్ల కాలంలో చింతచెట్లపై ఆధారపడతారు. 

చెట్లు చిగురించటం ఆరంభించిన దగ్గర్నుంచి కాపు దిగేవరకు చింత చిగురు కోతలో ఉంటారు. ప్రతిరోజూ కనీసం మూడుగంటలపాటు ఆ కొమ్మా ఈ కొమ్మా తిరుగుతూ చిగురు కోసుకుంటారు. ‘ఒక్కోసారి ఒక్క చెట్టుకే బుట్ట సరిపడా వత్తాది... లేకుంటే రెండు మూడేసి చెట్లు ఎక్కాల్సిందే’ నని నాగేంద్రం చెప్పింది. బుట్టనిండా చింతచిగురుతో తెనాలికి బయలుదేరి వెళతారు. గిరాకీ ఉన్నరోజు రూ.300 లేకుంటే కనీసం రూ.200 గిట్టుబాటవుతుంది. ఆ డబ్బయినా వస్తుందనే ఆశతోనే వీరు ప్రాణాలను లెక్కజేయకుండా భారీ చింతచెట్లను అవలీలగా ఎక్కేస్తుంటారు. ప్రమాదం కదా? అంటే.. ‘చిన్నప్పట్నుంచీ ఎక్కుతూనే ఉన్నాం... ఏం కాదు’ అని తేలిగ్గా కొట్టేశారు. నాగేంద్రంకు కొడుకు, భారతికి కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాయకష్టంతోనే తమ కడుపులు నిండేవని, చింత చిగురు మరికొంత ఆధరువుగా ఉంటోందని చెప్పారు. ఏదేమైనా చిటారు కొమ్మల్లోంచి అటూ ఇటూ తిరుగుతూ చిగురు కోసం వారు పడుతున్న కష్టాన్ని చూసి, రోడ్డు వెంట వెళ్లేవారు ‘అమ్మో.!’ అనుకోకుండా ఉండలేరు.
– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top