చిన్న హాబీయే, కానీ లక్షలు సంపాదించి పెడుతోంది

Social Media Influencer Masoom Minawala Mehta Get 1 Million Followers  - Sakshi

పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం, ఆటలంటే చాలా ఇష్టపడే అమ్మాయి మాసూమ్‌ మీనావాలా మెహతా. అనుకోకుండా ఫ్యాషన్‌పై మక్కువ ఏర్పడడంతో.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఫ్యాషన్‌ స్టైలిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్లతో కలసి పనిచేస్తూ ఫ్యాషన్‌ బ్లాగర్, ఎంట్రప్రెన్యూర్‌గానే గాక ఇండియన్‌ లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోంది. తన ఫ్యాషన్‌ స్టైల్స్‌తో సోషల్‌ మీడియాలో పదిలక్షలకు పైగా యూజర్లను ఆకట్టుకుంటోంది.

ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన మాసూమ్‌ మీనావాలా బాంబే స్కాటిష్‌ స్కూల్లో చదువుకుంది. స్కూల్లో ఆమెను అందరూ ‘టామ్‌బాయ్‌’ అని పిలిచేవారు. ఆటల్లో చురుకుగా ఉండే మాసూమ్‌ స్కూల్‌ పుట్‌బాల్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించేది. ఇంటర్మీడియట్లో ఉండగా ఫ్యాషన్‌పై ఆసక్తి కలిగింది. దీంతో తను రోజూ ఫ్యాషనబుల్‌గా రెడీ అయ్యి ఫోటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టుచేసేది, కానీ∙ఫ్యాషన్‌ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బీకామ్‌ అయ్యాక, ఆర్ట్స్‌ కోర్సులో డిప్లామా చేసేందుకు  చేరినప్పటికీ.. అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో తరువాత బ్రాండ్‌ మార్కెటింగ్‌ ఇండియాలో ఇంటర్న్‌షిప్‌ చేసింది. ఆ తరువాత లండన్‌లోని ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఫ్యాషన్‌ స్టైలింగ్‌లో డిప్లొమా చేసింది. ఈ సమయంలోనే ఫ్యాషన్‌ ప్రపంచం లో ఎదగాలని నిర్ణయించుకుంది. కోర్సు పూర్తయ్యాక ముంబై తిరిగి వచ్చి 2010లో ‘మిస్‌ స్టైల్‌ ఫియస్టా’ పేరుతో ఫ్యాషన్‌ బ్లాగ్‌ను ప్రారంభించి సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేసింది. ‘‘అంతర్జాతీయంగా ఉన్న ఫ్యాషన్‌ ఇండియా లో దొరకడంలేదు. అంతర్జాతీయ ఫ్యాషన్‌ను ఇక్కడ పరిచయం చేయాలనుకుని స్టైల్‌ ఫియస్టాలో ఎక్కువ గా అంతర్జాతీయంగా ట్రెండ్‌ అవుతోన్న ఫ్యాషన్‌ను పరిచయం చేసేది. దాంతో అంతర్జాతీయ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఇష్టపడేవారంతా ఫియస్టాను ఫాలో అయ్యేవారు. ఫాలోవర్స్‌తోపాటు ఆమె ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది.  

ఒకపక్క మిస్‌ స్టైల్‌ ఫియస్టా నడుపుతూనే మరోపక్క అంతర్జాతీయ ఫ్యాషన్, లగ్జరీ, బ్యూటీ, ట్రావెల్, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్లపై డిజిటల్‌ కంటెంట్‌ను రూపొందించేది. జిమ్మీచూ, యవెస్‌ సెయింట్‌ లారియెంట్, డియోర్, హక్కాసన్, గుస్సి, స్టెల్లా మెక్‌కార్ట్నీ, జో మలోని, ఈస్టీ లాడర్, రా ప్రెసరీ వంటి బ్రాండ్లతో కలసి పనిచేసేది. మాసూమ్‌ ఫ్యాషన్‌స్టైల్, పనితీరు నచ్చిన వోగ్, కాస్మోపాలిటన్, సీఎన్‌ఎస్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు అనేకసార్లు ఆమెను అభినందించాయి. సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎన్నో మ్యాగజీన్ల కవర్లపై మాసూమ్‌ ఫోటో రావడం విశేషం.
 
మోస్ట్‌ స్టైలిష్‌ బ్లాగర్‌గా...
ఇప్పటిదాకా డిజిటల్‌ ఎంట్రప్రెన్యూర్, కాస్మోపాలిటన్‌ ఈ–టెయిలర్‌ ఆఫ్‌ ద ఇయర్, హెచ్‌ఎస్‌బీసీ ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్, పల్లాడియం స్పాట్‌లైట్‌ ఎథినిక్‌ బ్లాగర్‌ ఆఫ్‌ ది ఇయర్, ఇండియాస్‌ బెస్ట్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్లాగర్, బెస్ట్‌ కంటెంట్‌ క్రియేటర్‌ ఫర్‌ సోషల్‌ సమోసా 30 అండ్‌ 30, ‘మోస్ట్‌ స్టైలిష్‌ బ్లాగర్‌’ వంటి అనేక అవార్డులను అందుకుంది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌లు మనీష్‌ మల్హోత్రా, అనామిక ఖన్నా, అబు జైన్‌ అండ్‌ సందీప్‌ ఖోస్లా, సబ్యసాచి వంటి వారితో కలిసి పనిచేసింది.
‘‘చిన్న హాబీగా ప్రారంభించిన నా ఫ్యాషన్‌ చాలామంది ఫాలోవర్స్‌కు నచ్చడం... వాళ్లనుంచి పాజిటివ్‌ కామెంట్లు రావడంతో నన్ను ఎంతో ప్రోత్సహించినట్లు అయింది. ఒక ఆర్టిస్ట్‌ తన భావోద్వేగాలు, ఆలోచనలను పెయింటింగ్స్‌ రూపంలో ఎలా వ్యక్తం చేస్తారో.. నేను ఆ విధంగానే ఫ్యాషన్‌ గురించిన ఐడియాలు, అభిప్రాయాలు, డ్రెస్సింగ్‌ గురించి చెప్పేదాన్ని. దీంతో నా బ్లాగ్‌ ఫాలో అయ్యేవారికి మరింత నాణ్యతతో కూడిన కంటెంట్‌ను ఇచ్చేందుకు ప్రయత్నించేదాన్ని. అదే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని మాసూమ్‌ చెప్పింది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top