Sleep Deprivation: Symptoms And How To Overcome Lack Of Sleep - Sakshi
Sakshi News home page

టైం 12 దాటినా నిద్రపట్టడం లేదా?.. అయితే ఇవి మానేయండి

Jun 26 2023 4:12 PM | Updated on Jul 14 2023 4:08 PM

Sleep Deprivation Symptoms And How To Overcome Lack Of Sleep - Sakshi

మారిన జీవన విధానాలు, చు­ట్టుముడుతున్న ఆర్థిక, కుటుంబ సమస్యల నడుమ మధ్య వయస్కులు, వృద్ధుల్లో కంటి నిండా నిద్ర కరవు అవుతోంది. ముఖ్యంగా మధ్య వయస్కులు పగలంతా కష్టం చేసి రాత్రి అయ్యాక కంటి నిండా నిద్రపోవడం ఒక కలగా మారుతోంది. ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

40 నుంచి 64 ఏళ్లు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇలా  రెండు వర్గాలుగా మే నెలలో దేశవ్యాప్తంగా 5 వేల మంది నుంచి ఫౌండేషన్‌ వివరాలుసేకరించింది. వీరిలో 40 నుంచి 64 ఏళ్ల వారు 2245 (పురుషులు 1102, మహిళలు 143)మంది, 65 ఏళ్లు పైబడిన వారు 2,755 (పురుషులు 1,336, మహిళలు 1,419) మంది ఉన్నారు. 

ఆరు గంటలు కూడా నిద్రపోలేకున్నాం 
70 శాతం మంది రోజులో కనీసం ఆరు గంటలు కూడా కంటి నిండా నిద్ర పోలేకపోతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 24 శాతం మంది మాత్రం 7 నుంచి 8 గంటలు, 6 శాతం మంది 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. మధ్య వయసుల్లో 60 శాతం ఆరు గంటలలోపు, 31 శాతం 7 నుంచి 8 గంటలు, 9 శాతం మంది 8 గంటలకుపైగా నిద్రపోతున్నామన్నారు. అదే వృద్ధుల్లో 78 శాతం మంది ఆరు గంటల్లోపు, 19 శాతం మంది 7 నుంచి 8 గంటలు, 3 శాతం మంది 8 గంటలకుపైగా నిద్ర పోతున్నట్టు వెల్లడైంది. 

ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణం 
నిద్ర లేమికి ప్రధాన కారణం ఆర్థిక పరమైన అంశాలేనని సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇతర కలహాలు కారణమని పేర్కొంది. యాంత్రిక జీవనం, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, మద్యం సేవించడం, ఇతర సమస్యలతో సరైన నిద్ర ఉండటంలేదని కూడా ఫౌండేషన్‌ తెలిపింది. వయోభారం రీత్యా చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు, ఒంటరి జీవనం నిద్రలేమికి కారణంగా వృద్ధులు పేర్కొన్నారు.

పురుషులే అధికం 
నిద్రలేమితో సతమతం అవుతున్న వారిలో పురుషులే అధికం. పురుషుల్లో 81 శాతం మంది కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని వెల్లడించారు. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది ఆరు గంటలలోపు నిద్రపోతున్నామని చెప్పారు. మరో 15 శాతం మంది పురుషులు, 32 శాతం మంది మహిళలు 7 నుంచి 8 గంటలు, 4 శాతం పురుషులు, 8 శాతం మహిళలు 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. సర్వేలో పాల్గొన్న మొత్తం వ్యక్తుల్లో 55.08 శాతం మంది ప్రస్తుతం నిద్ర విధానంతో అసంతృప్తిగా ఉన్నామని తెలిపారు.

ఇలా చేయండి.. నిద్ర పడుతుంది
సర్వేలో భాగంగా నిద్ర లేమి సమస్య నివారణకు పలు సలహాలు, సూచనలు కూడా ఫౌండేషన్‌ తెలియజేసింది. అవి.. 
♦ నిద్రకు ఉపక్రమించే 4 గంటల ముందు నుంచి కాఫీ, టీలు తాగకూడదు. ధూమపానం, మద్యపానం చేయకూడదు. వేడి పాలను తాగాలి 
♦ ఆందోళన, ఒత్తిడి, నిరాశ నిద్రకు పెద్ద అవరోధం. వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి  
♦ పగటిపూట నిద్ర మానుకోవాలి 
♦టీవీ, సెల్‌ఫోన్‌ చూడకూడదు 
♦ పడక గదిలో స్లీప్‌ ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా చూసుకోవాలి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement