
చేపకళ్ల బుజ్జీ.. బజ్జోవమ్మా!అమ్మ నిన్ను పతంగుల ప్రపంచానికి తీసుకెళ్తుంది.. అక్కడవి మబ్బుల్లా తేలుతుంటాయి.. గాలి తరగల మీద ఎగురుతుంటాయి.. ఎరుపు, ఆకుపచ్చ.. బులుగు.. పసుపు రకరకాల వర్ణాలతో ఆకాశానికి రంగులద్దుతాయి..నీకూ నింగిలో ఎగరాలనుందా.. మబ్బుల్లా.. పతంగుల్లా.. గాలి తెమ్మెరలా.. అయితే చిట్టి చిలకమ్మా.. నిద్దురపో హాయిగా.. సూరీడూ సద్దు మణిగినిద్దరోయాడు.. నువ్వూ బజ్జో.. పతంగుల లోకాన్ని చూసొద్దాం!
ఇలాంటి పోయమ్స్, రైమ్స్ మీ పాపాయి బెడ్ షీట్స్ మీదో.. బ్లాంకెట్ల మీదో ఉంటే..! హాయిగా బజ్జోవడమే కాదు.. కంటికి ఇంపైన రంగుల్లోని ఆ అక్షరాలకు ఆకర్షితులై వేవేల వర్ణాల ఊహలను పోగేసుకుంటారు.. పెద్దయ్యాక దాన్నో అద్భుత జ్ఞాపకంలా చదువుకుంటారు. అలాంటి బాల్యాన్ని స్వచ్ఛమైన నూలు గుడ్డలో అంతే స్వచ్ఛమైన రంగుల్లో ముంచి మెత్తగా అందిస్తోంది ‘వైట్‌వాటర్’ అనే కిడ్స్ వేర్ బ్రాండ్! ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ మీద అజ్రక్, కాంతా, కచ్, ఇక్కత్.. ఇలా దేశం నలుమూలల నైపుణ్యాలను డిజైన్ చేస్తున్నారు. వీటికి దేశంలో సరే పశ్చిమాసియా, సింగపూర్, అమెరికా, ఇటలీ దేశాల్లోనూ డిమాండ్ ఉంది. ‘వైట్ వాటర్’ ఇద్దరు అక్కాచెల్లెళ్ల బ్రెయిన్ చైల్డ్.. వాళ్ల అవిరామ కృషి.
వివరాల్లోకి.. శ్వేత, అంకిత ధరీవాల్ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీళ్ల స్వస్థలం అహ్మదాబాద్. శ్వేత స్పెషల్లీ చాలెంజ్డ్. సరిగ్గా నడవలేదు. అంకితకు విటిలిగో! వీళ్ల ప్రయాణం కేవలం పిల్లల కోసం స్కిన్ ఫ్రెండ్లీ దుస్తులను తయారుచేసే సంస్థను నెలకొల్పడమే కాదు.. గుర్తింపు, గౌరవాన్ని పొందడం కూడా! ఆ ప్రయాణం దాదాపు పద్దెనిమిదేళ్ల కిందట ఓ వేసవిలో మొదలైంది.
అప్పటికి శ్వేత టెక్స్‌టైల్ డిజైనర్. రచయిత కూడా. తన పిల్లల కోసం ఆర్గానిక్ కలర్స్‌తో హాయిగా స్కిన్‌ఫ్రెండ్లీగా ఉండే కాటన్ దుస్తుల కోసం వెదుకుతోంది. ఎక్కడా దొరకలేదు. అప్పడనిపించింది వాటిని తనే తయారు చేస్తే..? అని! అంతే! సోదరి అంకిత సహాయంతో దేశమంతా తిరిగి నాణ్యమైన నేత, నైపుణ్యం గల మహిళా చేనేత కళాకారులను కలుసుకుంది. వాళ్లందరినీ తన ప్రాజెక్ట్‌లో భాగం చేసి 2017లో ‘వైట్‌వాటర్’ను ప్రారంభించింది.
వైట్.. స్వచ్ఛతకు, వాటర్.. పారదర్శకమైన జీవన ప్రవాహానికి చిహ్నం. అందుకే ఆ బ్రాండ్‌లోగోలో సముద్రంలో చేప ఈదుతున్నట్టుగా ఉంటుంది. ‘ఇది పిల్లలు తాము సృష్టించాలనుకుంటున్న ప్రపంచంలోని భద్రత’ను సూచిస్తుంది అంటారు ఈ అక్కాచెల్లెళ్లు. దీన్ని అంకిత డిజైన్ చేసింది. ఆమె లండన్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ విద్యార్థి. దుస్తులనేమో శ్వేత డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్స్‌తో పిల్లలకు స్టోరీస్ కూడా చెప్పాలనుకుంటుంది.
అందుకే పిల్లల కోసం తాము తయారు చేసే టవల్స్, బెడ్ షీట్స్, దుప్పట్లు, పిల్లో కవర్స్ మీద పోయెమ్స్, జోలపాటలు, రైమ్స్‌ను రాస్తుంది. ఈ బ్రాండ్ కుర్తా సెట్స్‌నూ తయారు చేస్తుంది. ‘మాది కేవలం ఒక బ్రాండ్ కాదు.. ఒక ఉద్యమం.. గుర్తింపు కోసం, గౌరవం కోసం చేసే మూవ్‌మెంట్. అందుకే మా డిజైన్స్ ఐడెంటిటీ, డిగ్నిటీ, పోయెట్రీ, పర్పస్‌తో మిళితమై ఉంటాయి. మా ఈ బ్రాండ్ ఫిలాసఫీని మా వైకల్యమే షేప్ చేసింది’ అని చెబుతారు శ్వేత, అంకిత. అలా వాళ్లు పిల్లల కోసం దుస్తులనే కాదు కలలనూ నేస్తున్నారు.
(చదవండి: Donald Trump: కాళ్లలో వాపు?.. సిరలు దెబ్బతిన్నాయేమో.. ట్రంప్‌కు కూడా ఇదే సమస్య!)