ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే..

The Singing Ringing Tree Musical Sculpture - Sakshi

చెట్లు పలికే స్వరమాధుర్యాన్ని ఎప్పుడైనా విన్నారా? చెట్లు పాటలు పాడటమేంటి? ఇదేం పిచ్చి ప్రశ్న అని కోప్పడిపోకండి. చెట్టు పలికే వాయుగీతాన్ని వినాలంటే మీరు ఇంగ్లాండ్‌ వెళ్లాల్సిందే.

అక్కడ లాంకషైర్‌ కౌంటీలోని బర్న్‌లీ పట్టణానికి చేరువలో కనిపించే చెట్టు రోజంతా వాయుగీతాలను వినిపిస్తుంది. నెమ్మదిగా పిల్లగాలులు వీచేటప్పుడు మంద్రంగా, గాలులు ఒకమోస్తరుగా వీచేటప్పుడు కాస్త మధ్యమంగా, శరవేగంగా పెనుగాలులు వీచేటప్పుడు తారస్థాయిలోను స్వరాలాపన చేసే ఈ వృక్షం అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇది సహజమైన వృక్షం కాదు, ఉక్కుతో రూపొందించిన పది అడుగుల లోహ కళాఖండం ఇది. దీనికి కొమ్మల్లా వివిధ పరిమాణాల్లో వేణువు మాదిరి లోహపు గొట్టాలను ఏర్పాటు చేయడంతో, ఈ గొట్టాల గుండా గాలి వెళ్లేటప్పుడల్లా చిత్రవిచిత్రమైన స్వరధ్వనులు వినిపిస్తాయి.

మైక్‌ టాంకిన్, అన్నాలియు అనే లోహశిల్పులు ఈ లోహవృక్షాన్ని స్వరాలు పలికేలా తీర్చిదిద్దారు. బెర్న్‌లీ పట్టణానికి చేరువలోని ఖాళీ మైదానంలో దీనిని 2006లో ఏర్పాటు చేశారు. బీబీసీలో ప్రసారమైన 1960ల నాటి ఫాంటసీ సీరియల్‌ స్ఫూర్తితో దీనికి ‘ద సింగింగ్‌ రింగింగ్‌ ట్రీ’ అనే పేరు పెట్టారు. ఈ లోహవృక్ష రూపకల్పనలో కనపరచిన అమోఘ శిల్పనైపుణ్యానికి గుర్తింపుగా 2007లో దీనిని రూపొందించిన శిల్పులకు రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్స్‌ ఏటా ఇచ్చే జాతీయ అవార్డు కూడా లభించింది. 

చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top