ప్రకృతి సృష్టించిన పక్షి జాతులలో అత్యంత సుందరమైన రూపం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ‘నెమలి’ మాత్రమే. నీలిరంగు గొంతు, వయ్యారాల నడక, పురివిప్పిన పించపు అందాలతో అడవి తల్లి ఒడిలో తిరుగాడే ఈ జాతీయ పక్షి సొగసులను వరి్ణంచడానికి మాటలు చాలవు.
వర్షం వచ్చే ముందు ‘క్యావ్.. క్యావ్..’ అంటూ వినసొంపైన స్వరంతో కూస్తూ, పించం విప్పి ఆ నెమలి చేసే నాట్యం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది.సరిగ్గా ఫొటోలో చూస్తున్నారే.. ఇదీ ఆ సుందర దృశ్యం!సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో, చెట్ల పొదల చాటున దాగుండే ఈ లక్ష్మీదేవి వాహనం.. కడప జిల్లా సిద్ధవటం పరిధిలోని లంకమల అభయారణ్యం ప్రధాన రహదారి సమీపంలో హఠాత్తుగా ప్రత్యక్షమైంది.
రాతి గోడపై రాజసం ఉట్టిపడేలా నిలబడి, పొడవైన పించాన్ని కిందకు వాల్చి, తలపై కిరీటం లాంటి నెమలి సిగతో పరిసరాలను ఎంతో గంభీరంగా వీక్షిస్తోంది. తన హావభావాలతో అడవి అందాలను మరింత రెట్టింపు చేస్తూ వయ్యారంగా నడుస్తున్న ఈ అద్భుతమైన సుందర దృశ్యాన్ని మన ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించి పత్రికా పేజీల్లో బంధించింది. రహదారి వెంట వెళ్తున్న ప్రయాణికులు సైతం ఈ జాతీయ పక్షి వంపుసొంపులను చూసి కాసేపు మైమరచిపోయారు. - ఫొటోలు : ఎస్.కె.మొహమ్మద్ రఫీ, సాక్షి ఫోటో గ్రాఫర్, కడప


