షోలే... అప్పుడది... తుపాన్‌ ఇండియా | Sholay celebrates 50 years in Bollywood industry | Sakshi
Sakshi News home page

షోలే... అప్పుడది... తుపాన్‌ ఇండియా

Aug 15 2025 6:39 AM | Updated on Aug 15 2025 6:39 AM

Sholay celebrates 50 years in Bollywood industry

50 ఏళ్ల షోలే(1975–2025)

సినిమా మొత్తం రెండు జతలకు మించి వాడని హీరోలు... హీరోయిన్‌ ఏమో టాంగేవాలీ... ఇంకో హీరోయిన్‌ వితంతువు... ముఖ్య క్యారెక్టర్‌ ఆర్టిస్టుకు రెండు చేతులూ ఉండవు...విలన్‌కు గట్టిగా చూస్తే 20 మందికి మించి గ్యాంగ్‌ లేదు... లొకేషన్‌ ఉత్త రాళ్లదిబ్బలు...ఇవాళ్టి పాన్‌ ఇండియా సినిమాలతో పోల్చి చూస్తే ఈ లక్షణాలతో ఏదైనా సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందా? అవుతుంది... అయ్యింది... అవుతూనే ఉంది...‘షోలే’ – ఒక ప్రెజెంట్‌ కంటిన్యుయెస్‌ టెన్స్‌ 50 ఏళ్లుగా ‘షోలే’ లిఖించిన రికార్డులు ఎన్నో. చెప్పిన కొటేషన్లు మరెన్నో. ‘జో డర్‌ గయా... సమ్‌ఝో మర్‌గయా’...మరణమే లేని షోలేతో ప్రేక్షకుల వీడని దోస్తీ గురించి ప్రత్యేక కథనం...

‘పుష్ప’ సినిమా రెండు పార్ట్‌లుగా వచ్చి కోట్లు సంపాదించింది. ఒక గంధపు చెక్కల స్మగ్లర్‌ హీరోనా అని ఒకరిద్దరు క్వశ్చన్‌ చేశారు. కాని సగటు జనం జానేదో అని సూపర్‌హిట్‌ చేశారు. ఈ సగటు జనం ఇక్కడి వరకూ చేయడానికి చాలా మెట్లు పడ్డాయి. వాటిలో ‘షోలే’ ఒకటి.

సలీమ్‌–జావేద్‌ హిందీలో యాంగ్రీ యంగ్‌మేన్‌ను తెచ్చారు. అంటే స్వాతంత్య్రం వచ్చాక జన్మించి, యుక్త వయసు వచ్చేనాటికి అంటే 1970ల నాటికి దేశ స్థితి చూస్తే ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, బ్లాక్‌ మార్కెట్‌. రోజులు ఇలా ఉంటే అమ్మాయి వెంట పరిగెత్తి విరహగీతాలు పాడే హీరో చెల్లుబాటు కాడు అని వాళ్లు కోపంగా ఉండే హీరోని తెచ్చారు. ‘జంజీర్‌’లో అమితాబ్‌ అలాంటి హీరో. ఇతను ఇన్‌స్పెక్టర్‌గా ఉంటూ కూడా తన తల్లితండ్రులను చంపినవాణ్ణి చట్టప్రకారం శిక్షించలేకపోతాడు. యూనిఫామ్‌ను వదిలాకే పగ సాధిస్తాడు. 

చట్టానికి ఆవల కొన్ని పనులు చేసే హీరోలు అలా పుట్టుకొచ్చారు. ఆ తర్వాత ‘దీవార్‌’ వచ్చింది. కష్టపడి పని చేసే హీరోకు బదులు అడ్డదారిలో స్మగ్లర్‌గా మారే హీరోగా కనిపిస్తాడు అమితాబ్‌. సినిమాలో నిజాయతీపరుడైన శశికపూర్‌ ఉన్నా అందలానికి ఎదిగిన అమితాబ్‌ను ఆరాధిస్తాడు ప్రేక్షకుడు. ఈ వరుసలోనే వచ్చింది ‘షోలే’. ఇక్కడ అత్యంత దుర్మార్గుడైన గబ్బర్‌ సింగ్‌ను సంహరించడానికి ఇద్దరు చిల్లర దొంగలను కాంట్రాక్ట్‌ మీద పట్టుకొస్తాడు ఊరి పెద్ద ఠాకూర్‌. చిల్లర దొంగల్లో వీరత్వం ఉండటం, కొంచెం మానవత్వం ఉండటంతో మేలు చేయని పోలీసుల కంటే కొద్దిగా కీడు చేసే చిల్లర దొంగలే నయం అనుకుంటారు రామ్‌గఢ్‌ వాసులు, తద్వారా ప్రేక్షకులు. ఆ విధంగా సకల సద్గుణ శోభితుడైన హీరోకు నూకలు చెల్లుతూ వచ్చి ‘పుష్ప’ వరకూ అతడు రూపాంతరం చెందాడు.

‘షోలే’ కథ అంతా రెండు లైన్లలో చె ప్పొచ్చు. గొప్ప కథలు ఏవంటే కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా చెప్పగలిగేవే. పోలీస్‌ ఆఫీసర్‌ ఠాకూర్‌ కుటుంబాన్ని గబ్బర్‌ సింగ్‌ చంపేశాడు. ఆ ప్రాంతానికి పీడగా మారాడు. వాణ్ణి చంపడానికి ఠాకూర్‌ ఇద్దరు దొంగలను కిరాయికి తెచ్చాడు. అంతే కథ. ఈ కథను మూడున్నర గంటల పాటు 70 ఎం.ఎం స్క్రీన్‌ మీద దర్శకుడు, నటీనటులు, రచయితలు, కెమెరామేన్, సంగీత దర్శకుడు ఎలా చూపారనేదే అసలు సంగతి. వాళ్లు ఎలా చూపారంటే అలా మరెవరూ, మరెప్పుడూ చూపలేకపోయారు. అందుకే షోలే అంటే షోలే. ఇలాంటి సినిమాలు సర్పాల తలలపై మణుల వంటివి. రీమేక్‌లని ప్రయత్నిస్తే మణులు రాళ్లయిపోతాయి. లేదా పాము కాటు తప్పదు. అందుకే ‘షోలే’ను మళ్లీ మళ్లీ ముస్తాబు చేసి వదిలారు తప్ప రీమేక్‌ అంటే జనం తుపాకులు తీశారు.

‘షోలే’ యాక్షన్‌ సినిమా అనుకుంటారు. ఫక్తు కుటుంబ కథా చిత్రం. కుటుంబమే దీనికి ఆధారం. ఠాకూర్‌ కుటుంబాన్ని గబ్బర్‌ గాడు కాల్చి చంపాడు. కుటుంబం కోల్పోతే మనిషికి ఉండే బాధతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అవుతాడు. ఆ రోజుల్లో మగవారి ఎర్లీ డెత్స్‌ వల్ల ప్రతి ఇంటా ఒక వితంతువు ఉండేది. జయభాదురి వేసిన రాధ పాత్రను ప్రేక్షకులు పోల్చుకున్నారు. భర్త పోయిన ఎన్నో ఏళ్లకు ఆమె ‘జయ్‌’ అనే అమితాబ్‌ను చూసి మళ్లీ అతనితో కుటుంబాన్ని నిర్మించుకోవచ్చేమో అని ఆశ పడుతుంది. ఆ ఆశ ప్రేక్షకులకు తెలుసు. ఆమెకో కుటుంబం ఏర్పడాలని వారూ అనుకుంటారు. జరగదు. జయ్‌ చనిపోతాడు. ప్రేక్షకులు అక్కడా కనెక్ట్‌ అవుతారు. ఏ తాడూ బొంగరం లేని వీరూ అను ధర్మేంద్ర టాంగేవాలీతో సరసం చేసి సాధించుకుంది మౌసీతో పాటు ఒక కుటుంబాన్నే కదా! ఇక కథలో ఇమామ్‌ గారి కుటుంబానికి వచ్చిన బాధ ఎవరు మరుస్తారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు పట్నం పోయి సంపాదిస్తాడనుకుంటే తండ్రిని ఏకాకిని చేసి గబ్బర్‌ చేతుల్లో ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబం ఉనికే భారతదేశ సమాజపు ఉనికి. ఇన్ని కుటుంబాల ఉద్వేగాల అల్లిక కాబట్టే ‘షోలే’ ఆడింది. ఆడుకుంది.

‘షోలే’ ప్రివ్యూ కోసం థియేటర్‌లో కూచున్న రాజ్‌కపూర్‌ సినిమా మొదలైన పది నిమిషాల్లోనే మొదలయ్యే ట్రైన్‌ రాబరీ సీక్వెన్స్‌ చూసి చకితుడయ్యాడు. ‘ఇదేంటి... క్లయిమాక్స్‌ను ముందే పెట్టేశారు’ అన్నాడట పక్కనున్న వారితో. అవును ‘షోలే’ క్లయిమాక్స్‌ ముందే వచ్చేస్తుంది... అంత భారీగా. ఆ తర్వాత ‘షోలే’ను కేవలం సన్నివేశాల బలం మీద నడుపుతారుగాని యాక్షన్‌ మీద కాదు. ‘షోలే’ క్లయిమాక్స్‌ కేవలం ఠాకూర్, గబ్బర్‌ సింగ్‌ల మీదే! చేతుల్లేని ఠాకూర్‌ చేతులు తెగ్గొట్టే గబ్బర్‌తో తలపడతాడు. ఇలా స్క్రీన్‌ప్లే రాసిన ‘షోలే’ ఆడిందంటే ఏమిటి మర్మం! అదేమిటో ఎవరూ చెప్పలేరు. చెప్పినా కొంతే. రొంతే. అంతంతే. షోలేకు వ్యాఖ్యానం లేదు.

1973లో మొదలెట్టి రెండేళ్ల పాటు తీశారు ‘షోలే’. కార్పెట్లు అమ్మి, ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ చేసి సంపాదించిన డబ్బును కొడుక్కు ఇచ్చి సినిమా చేయమన్నాడు నిర్మాత జి.పి.సిప్పీ. కోటి రూపాయల సినిమా! వస్తే చాలా డబ్బులు రావాలి పోతే కోటి అన్నాడు. అందుకు తగ్గ కథ రమేష్‌ సిప్పీ రాయించుకున్నాడు సలీమ్‌ జావేద్‌లతో! అతని వేడి చూసి – వాళ్లు కూడా రంగంలో దిగారు. ‘లోహా గరమ్‌ హై... మార్‌ దో హథోడా’ (ఇనుము వేడి మీద ఉన్నప్పుడే సమ్మెట పోటు పడాలి) అనుకున్నారు. ఠాకూర్, గబ్బర్‌ సింగ్‌ల మధ్య ఇద్దరు దొంగలను ప్రవేశపెట్టి కథ అల్లారు. దీనికి ప్రేరణ అకిరా కురసావా ‘సెవన్‌ సమురాయ్‌’, మనం తీసిన ‘మేరా గావ్‌ మేరా దేశ్‌’... ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. అన్నీ తీసుకుని మనది ఇవ్వడం కూడా విద్యే. ఆ విద్యతో తయారైన ఈ కథకు ద్వారకా దివేచా కెమెరా, రామ్‌ యెదేకర్‌ ఆర్ట్‌ డైరెక్షన్, ఎం.ఎస్‌.షిండే ఎడిటింగ్, ఆర్‌.డి.బర్మన్‌ సంగీతం... గంధపు చేతులకు మల్లెలు చుట్టాయి. మరి రమేష్‌ సిప్పీ ఇంత మంచి టేకింగ్‌ను ఎలా సాధించాడో అతనికే తెలియాలి. ధర్మేంద్ర, అమితాబ్, అంజాద్‌ ఖాన్, సంజీవ్‌ కుమార్, హేమ మాలిని, జయభాదురి... ఎవరికి ఎవరు తక్కువ. సత్తువ చూపడం వారికి మక్కువ.

‘షోలే’లో ప్రతి సన్నివేశానికి, ప్రతి ఫ్రేమ్‌కు అభిమానులున్నారు. అందులోని ప్రతి చిన్న పాత్రకూ అభిమానులున్నారు. జైల్లో గూఢచారిగా పని చేసే బార్బర్‌ హరిరామ్,  పిరిమిగా కట్టెలు అమ్మే సూర్మా భూపాలి, నమక్‌ తినే కాలియా, గబ్బర్‌కు బదులు పలికే సాంబా, హిట్లర్‌ జైలర్, ఠాకూర్‌ నమ్మినబంటు రామ్‌లాల్, పిల్లనిచ్చేందుకు ధర్మేంద్ర గుణగణాలు ఆరాతీసే మౌసీ, ‘మెహబూబా’ పాటలో మెరిసిన జలాల్‌ ఆగా... ప్రతి ఒక్కరూ... సినిమాను ధన్యం చేశారు... ధన్యులయ్యారు. ప్రేమ నాటకం కోసం వాటర్‌ ట్యాంకర్‌ ఎక్కిన ధర్మేంద్ర ‘చక్కీ పీసింగ్‌’ (తిరగలి తిప్పింగ్‌) అంటాడు. ప్రేక్షకులు నవ్వుతారు. ‘సూసైడ్‌’ అంటే ఆత్మహత్య అని ధర్మేంద్ర వల్లే జనానికి ఇంగ్లిష్‌లో తెలిసింది.

‘షోలే’ తన శబ్దాలతో కూడా మనకు కనెక్ట్‌ అవుతుంది. రైలు కూతా, గుర్రపు డెక్కల చప్పుడు, జట్కా మువ్వలు, అజాన్, దూది ఏకే కవాను, కమ్మరి మోత... ఇక ఈ సినిమాకు ముందు రివాల్వరు, రైఫిలు పేలితే అలాంటి సౌండ్‌ వస్తుందని ప్రేక్షకులకు తెలియదు. బ్రిటిష్‌ స్టంట్‌మెన్‌ ఈ సినిమాకు స్టంట్‌ కొరియోగ్రాఫర్లుగా పని చేశారు. ట్రైన్‌ రాబరీలో ఒక బుల్లెట్‌ తగిలి గూడ్సు పెట్టెకు అంటించిన సర్కారు కాగితం చిట్లుతుంది. అలాంటి ఒక్క షాటు తర్వాతి కాలంలో తీయలేకపోయారు.

‘షోలే’ గొప్పతనం తెల్లార్లు చెప్పుకోవాలి. గబ్బర్‌ సింగ్‌ పేరు వాడుకుని ఒక హిట్‌ సినిమా తీసుకున్న మనం ‘షోలే’ యాభై ఏళ్ల సందర్భంగా ఉత్సవం తప్పక చేసుకోవాలి. ఈ సినిమాను తిరగేసి గుహనాథన్‌ కథ చెప్తే బాగుందని రామానాయుడు గారు ‘కక్ష’ తీశారు. ఇందులోని కొన్ని సీన్లు దర్శకేంద్రుడి ‘అడవి రాముడు’కు పనికి వచ్చాయి. ‘షోలే’ ఎందరినో డైరెక్టర్లు అయ్యేలా చేసింది. 

రైలుతో మొదలయ్యి రైలుతో ముగిసే ఈ సినిమా భారతీయ ప్రేక్షకులతో యాభై ఏళ్ల ప్రయాణం చేసింది. ఇంకో యాభై ఏళ్లు ఇకపై చేస్తుంది.
ఏ దోస్తీ హమ్‌ నహీ తోడెంగే తోడెంగే దమ్‌ మగర్‌ తేరా సాథ్‌ న ఛోడెంగె...న ఛోడెంగె...
 

పంచ్‌ డైలాగ్స్‌ ఫలానా దర్శకుడు వచ్చాక, ఫలానా రచయిత వచ్చాక ట్రెండ్‌లోకి వచ్చాయి అని ఎవరైనా అంటే నోటితోనే నవ్వబుద్ధవుతుంది. సకల పంచ్‌ డైలాగ్‌లకు బాప్‌ ‘షోలే’. అందులో ప్రతి మాటా ఒక పంచ్‌ డైలాగే. పైగా అవి  నిత్య జీవితంలోకి వచ్చేసిన డైలాగులు. కొటేషన్‌లు. సూక్తులు.

→ ఇజ్జత్‌ కీ మౌత్‌ జిల్లత్‌ కీ జిందగీ సే కయీ అచ్ఛీ హై
    (పరాభవాలతో బతికే కన్నా పరువుతో చావడం మేలు)
→ ముఝేతో సబ్‌ పోలీస్‌ వాలోంకీ సూరతే ఏక్‌ జైసీ లగ్‌ తీ హై
(నాకు అందరు పోలీసోళ్ల ముఖం ఒకలాగే కనిపిస్తుంది)
→ తేరా క్యా హోగా కాలియా
    (నీ గతేంది కాలియా)
→ తుమ్హారా నామ్‌ క్యా హై బసంతి?
    (నీ పేరేంటి బసంతి)
→ దామ్‌ జో తుమ్‌ చాహో... ఔర్‌ కామ్‌ జో మై చాహూ
    (సొమ్ము మీరు కోరినంత... పని నేను చెప్పినంత) 

– కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement