శెభాష్‌.. ఒకేసారి ఇద్దరు మహిళా డీజీపీలు

Shashi Prabha Dwivedi Gurpreet Deo IPS Promoted As DGP In Punjab - Sakshi

ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహిళా శక్తి గురించి తెలిసినప్పుడు ఒక కొత్త ఊపిరి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడా ఊపిరిని, ఉత్సాహాన్నీ రెట్టింపు చేస్తూ పంజాబ్‌లో ఒకేసారి ఇద్దరు మహిళలు డీజీపీలుగా పదోన్నతులు పొందారు. మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారు. 

పంజాబ్‌లో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) స్థాయికి పదోన్నతి పొందిన ఏడుగురు పోలీసు అధికారుల పేర్లను హోం వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆ ఏడుగురు అధికారుల్లో ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు గౌరవప్రదమైన పాత్రను కైవసం చేసుకున్నారు.

శశిప్రభ ద్వివేది, గురుప్రీత్‌ కౌర్‌ ఇద్దరు మహిళలు ఇలా ఒకేసారి డీజీపీలుగా పదోన్నతులు పొందడం ఇదే మొదటిసారి. ఈ పదోన్నతులు ఇప్పుడు పంజాబ్‌ పోలీసు ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న అధికారుల సంఖ్యకు సంబంధించి అత్యంత శక్తిమంతమైన శక్తులలో ఒకటిగా మారడానికి మార్గం సుగమం చేశాయి. 

గురుప్రీత్‌ కౌర్‌ డియో
1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అదే సంవత్సరం అధికారిగా నియమితులయ్యారు. గురుప్రీత్‌ ఇటీవల పదోన్నతి పొందిన బ్యాచ్‌లో అత్యంత సీనియర్‌ అధికారి. పంజాబ్‌ పోలీస్‌లో భాగమైన మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారి. గతంలో మహిళా వ్యవహారాలను కవర్‌ చేసే బాధ్యతలు, అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హోదాను కలిగి ఉన్న కమ్యూనిటీ వ్యవహారాల విభాగానికి బాధ్యత వహించారు.

చీఫ్‌ ఆఫ్‌ డ్రగ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ (క్రైమ్‌)గా, బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అడిషనల్‌ డీజీపిగా పనిచేశారు. తన పదోన్నతిపై ఆమె స్పందిస్తూ ‘డీజీపీగా పనిచేసే అవకాశం లభించినందుకు ఆనందం’గా ఉందన్నారు. 

శశిప్రభ ద్వివేది
అడిషనల్‌ ఛార్జ్‌ ఆఫ్‌ మోడర్‌నైజేషన్‌ (రైల్వేస్‌) అడిషనల్‌ డిజిపిగా పదోన్నతి పొందిన ద్వివేది 1993 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందినవారు. 1994లో ఆమె« విధుల్లో చేరారు. 2021లో పంజాబ్‌ లోక్‌పాల్‌ ఏడీజీపీగా నియమితులయ్యారు. ఆగస్టు 2022లో ద్వివేది గౌరవ వందనం స్వీకరించి, పోలీసుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ను పరిశీలించారు. ఏడీజీపీగా ఆమె ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌కు అదనపు బాధ్యతలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జవాన్లందరిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ‘నిజాయితీగా, నిర్భయంగా విధులు నిర్వర్తించాలని, చట్టాన్ని గౌరవించాల’ని ఆమె సూచించారు. పంజాబ్‌ రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగాన్ని ఎత్తిచూపుతూ, దశాబ్దాలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్‌ రాకెట్‌ను అంతమొందించేందుకు తగిన కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top