ఆవగింజంత విశ్వాసం.. అద్భుత విజయాలు | Self confidence and Faith leads to miraculous achievements | Sakshi
Sakshi News home page

ఆవగింజంత విశ్వాసం.. అద్భుత విజయాలు

Sep 25 2025 10:22 AM | Updated on Sep 25 2025 10:37 AM

Self confidence and Faith leads to miraculous achievements

కండబలంతోనే బతికేటట్లయితే, దేవుడు సృష్టించిన ఈ విశాల విశ్వంలో ఈగలు, దోమల్లాంటి అల్ప జీవులకు అసలు తావుండేది కాదు. ఏలా లోయలో ఫిలిష్తీయులతో భీకర యుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలీయుల సైనికులైన తన ముగ్గురు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దావీదు యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే మహాబలుడు ప్రతిరోజూ తన కండలు ప్రదర్శిస్తూ, ధైర్యముంటే ఒక్కొక్కరుగా వచ్చి తనతో తలపడమంటూ తొడలు కొట్టి సవాలు చెయ్యడం, ఇశ్రాయేలీయులంతా అతనికి జడిసి గుడారాల్లో దాక్కోవడం దావీదు చూశాడు. గొల్యాతు అనేవాడి రూపంలో ‘భయం’ రాజ్యమేలుతున్న యుద్ధభూమిలో, యుద్ధం జరగకుండానే విజేతలెవరో నిర్ణయమైంది. విశ్వాసులుగా నిర్భయంగా జీవించాల్సిన, రోషంతో యుద్ధం గెలవాల్సిన ఇశ్రాయేలీయులు తమ విజయం పైన, ప్రాణాలపైన ఆశలొదిలేశారు, దేవుణ్ణి కూడా వదిలేశారు, వాళ్ళ రాజైన సౌలయితే, అంతా వదిలేసి గడగడలాడుతూ కూర్చున్నాడు. ఆ స్థితిలో దావీదు యుద్ధరంగ ప్రవేశం చేసి, గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానన్నాడు. బక్కగా, పీలగా, ఇంకా లేత ప్రాయంలో ఉన్న దావీదు ఏ విధంగానూ గొల్యాతుకు సమ ఉజ్జీ కాదనుకున్నారంతా. అయితే తనతో దేవుడున్నాడన్న కొండంత విశ్వాసంతో, దావీదు అందరి అంచనాలను ముఖ్యంగా శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వడిశెల రాయితో గొల్యాతు ను మట్టికరిపించి అతని కత్తితోనే అతని శిరచ్ఛేదనం చేశాడు, దేవుని ప్రజలకు అలా గొప్ప విజయాన్ని అనూహ్యంగా సాధించి పెట్టాడు.

దేవుడెంత శక్తిమంతుడో, గొప్పవాడో ఇశ్రాయేలీయులందరికీ తమ పూర్వీకులు చెప్పిన విషయాల ద్వారా సైద్ధాంతికంగా తెలిసినా, దేవుని బాహుబలం తమను కూడా నాటి యుద్ధంలో గెలిపిస్తుందన్న ‘ఆచరణాత్మక విశ్వాసం’ లోకి వారు ఎదగ లేకపోయారు. అయితే దేవుడు తనతో ఉండగా శత్రువుల కండలు, మారణాయుధాలు, పెడబొబ్బలు వీటన్నింటికీ అతీతమైన విజయం తన సొంతమని నమ్మిన ‘ఆచరణాత్మక సజీవ విశ్వాసం’తో దావీదు యుద్ధాన్ని గెలిపించాడు. కేవలం ఆవగింజంత విశ్వాసంతో అత్యద్భుత కార్యాలు చెయ్యొచ్చని యేసుప్రభువు బోధించాడు. ఆవగింజ నలుసంతే ఉండొచ్చు కాని అది ఒక విత్తనం కనుక అందులో జీవం ఉంటుంది. నేలలో పడ్డ నలుసులో వెయ్యేళ్ళయినా మార్పు రాదు కాని నేలలో పడ్డ ఒక ‘ఆవగింజ’ అతి చిన్నదే అయినా, కొన్నిరోజుల్లోనే మట్టిపెళ్ళల్ని, రాతికుప్పల్ని పెకిలించుకొని పైకొచ్చి మొక్కగా ఎదుగుతుంది. ఆవగింజలో, ఆ మాటకొస్తే ప్రతి విశ్వాసిలో దేవుడు నిక్షిప్తం చేసిన కార్యసాధక మహాశక్తి ఇది. ఆవగింజలోని ఈ శక్తి దేవుడిచ్చే తేమ, సూర్యరశ్మితో అంకురించినట్టే, దేవుని సహవాసం, ప్రేమ, సాయం తోడైన విశ్వాసంతో మహాద్భుతాలు జరుగుతాయన్నది బైబిల్‌ చెప్పే గొప్పసత్యం.

చదవండి: Weight Loss వెయిట్‌ లాస్‌లో ఇవే మెయిన్‌ సీక్రెట్స్
 

భయం నీడలాంటిది. సూర్యుడు వెనకుంటే నీడ మన ముందుండి భయపెడుతుంది. దేవుడు మన ముందుంటే భయం అనే మన నీడ మన వెనక్కి పారిపోతుంది. కండబలంతో కాక, దేవుని పట్ల విశ్వాసమనే ఆయుధంతోనే వాటిపై విజయం సాధించగల మన్నది ఈ దావీదు ఉదంతం తెలిపే వెలలేని ఆత్మీయ పాఠం.
– సందేశ్‌ అలెగ్జాండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement