ఏమైందో ఏమిటో పండక్కి ఊరు వెళ్లి వచ్చిన కోటి వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ‘ఎలాన్ మస్క్ మన ఆఫీసుకు వచ్చాడట... నన్ను ఏమైనా అడిగాడా?’ అని ఆరా తీశాడు. ‘మీకో బ్రేకింగ్ న్యూస్ తెలుసా? ట్రంప్ మన మున్సిపల్ ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నాడు’ అని బాంబు పేల్చాడు. ‘వీడికి ఏమైంది? పిచ్చిగానీ పట్టిందా?’ అని అరిచాడు అతడి స్నేహితుడు సందేహ్ కుమార్.
‘అతడికి పట్టింది పిచ్చి కాదు, పిల్పిడెన్సియా పిలాసాపీయ సోపియా నైజీరియో బరబ్బర’ అని బదులు ఇచ్చింది ఆకాశవాణి.‘పిల్పిడెన్సియా పిలాసాఫీయా సోపీయా!!!!!!!... అదేమిటి?????’ అని మిక్కిలి ఆశ్చర్యపోయాడు సందేహ్ కుమార్.‘గూగుల్ స్టోర్‌లోకి వెళ్లి బ్యాక్ ఫ్లాష్ ట్యాబ్ ఓపెన్ చెయ్యి. ఫ్లాష్‌బ్యాక్ ఏమిటో నీకే అర్థమవుతుంది’ అని క్లుప్తంగా చెప్పింది ఆకాశవాణి. అలాగే చేశాడు సందేహ్ కుమార్. సరిగ్గా కొన్ని రోజుల ముందు...సంక్రాంతి పండక్కి స్వగ్రామానికి వెళ్లాడు కోటి. పండగ రోజు ఊళ్లో వేపచెట్టుకు వేలాడదీసిన పెద్ద బ్యానర్ కంటపడింది. అందులో ఇలా ఉంది...
‘సమస్త గ్రామ ప్రజలకు... ఈరోజు కూడా ఇంట్లోనే తినాలా? ఎప్పుడూ అవే వంటకాలా? అందుకే వంటల పోటీ పెడుతున్నాం. కనీవినీ ఎరుగని కొత్త వంటకానికి... అక్షరాలా కోటి రూపాయల ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నాం’‘పేరులోనే కోటి... బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష కూడా లేదు’ అని ఎప్పుడూ నిట్టూర్చే కోటికి ఇది తనను వెదుక్కుంటూ వచ్చిన బంపర్ ఆఫర్ అని బలంగా అనిపించింది. నిజానికి కోటికి వంట కాదు కదా కాఫీ చేయడం కూడా రాదు. అయితే అతడిలోని శ్రుతిమించిన ఆత్మవిశ్వాసం వంటల పోటీలో పాల్గొనేలా చేసింది. తాను కనిపెట్టిన వంటకానికి పిలాసాపియా సోపీయా నైజీరియో బరబ్బర (పి.సో.నై.బ) అని పేరు పెట్టి, దాని ప్రాశస్త్యం గురించి గాలి పోగేసి ఘనంగా చెప్పడం వల్ల... పోటీలో అతడే కోటి రూపాయల విజేత!
‘ఒక విజేతగా మీరు ఆవిష్కరించిన వంటకాన్ని మీరే మొదట రుచి చూడాలి’ అని చెప్పారు నిర్వాహక కమిటీ వాళ్లు. టైటానిక్ షిప్‌లో సముద్రం లోతుల్లోకి మునిగిపోతున్నట్లుగా ముఖం పెట్టాడు కోటి. కానీ... కోటి రూపాయలు దక్కాలంటే టేస్ట్ చేయక తప్పదు కదా! ‘పి.సో. నై. బ’ రెండు గరిటెలు నోట్లో పెట్టుకున్నాడో లేదో... భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరిగినట్లు కోటి తల కోటి విధాలుగా తన చుట్టూ తాను తిరుగుతూ, చుట్టూ ఉన్నవారి చుట్టూ తిరిగింది.కట్ చేస్తే... కోటి... మునపటి కోటి కాదు! నీతి 2026: కోటి విద్యలు ‘కోటి’ కోసం కాదు..!
– యాకుబ్ బాషా


