జూలై 7 చాక్లెట్ డే
నవ్వుకు నాంది కావాలన్నా... ప్రేమకు కానుక కావాలన్నా... చిన్నారి ఏడుపు ఆపాలన్నా... పెద్దల ఒత్తిడి కరిగించాలన్నా.. అందరికీ గుర్తొచ్చే తీపి నేస్తం చాక్లెట్! చేతిలో ఇమిడిపోయేంత చిన్నదైనా... మనసంతా తీపితో నింపే శక్తి దీనిది. అందరి పుట్టినరోజులను తీపిగా మార్చే నీకు, ఈరోజు ప్రపంచం ‘హ్యాపీ బర్త్‌డే చాక్లెట్!’ అని పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 7న జరుపుకునే ‘చాక్లెట్ డే’లో ఒకటే రూల్... కేలరీలు లెక్కపెట్టకుండా చాక్లెట్ తినాలి... తింటూ ఆనందించాలి... ఆనందాన్ని పంచాలి!
రూపాలెన్నో... రుచి ఒకటే!
ఒకప్పుడు చాక్లెట్ అంటే జేబులో దాచుకుని స్కూల్‌లో తినే చిన్న ముక్క. అదృష్టం బాగుంటే చాక్లెట్ బార్! అంతకంటే బాగుంటే పెద్ద డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్! కానీ ఇప్పుడు చాక్లెట్ సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందంటే, మనం తినే ప్రతి తీపి పదార్థంలోనూ దాని సంతకం కనిపిస్తోంది. చాక్లెట్ ఇప్పుడు కేవలం ఒక స్వీట్ కాదు, అది ఒక ఫుల్‌టైమ్ సెలబ్రిటీ! ఐస్‌క్రీమ్‌లోకి దూకేస్తుంది, మిల్క్‌షేక్‌లో ఈదేస్తుంది, కేక్‌పై సింహాసనం వేసుకుని కూర్చుంటుంది. డోనట్స్‌లోనూ దాక్కుంటుంది, కుకీస్‌లో కలిసిపోతుంది. పండ్లతో జోడీ కడుతుంది. సిరప్స్‌లో కూడా జారిపోతుంది.
అవసరమైతే కాక్‌టెయిల్స్‌తోనూ చేతులు కలిపేస్తుంది. ఇంతకీ చాక్లెట్ ఎన్ని రూపాల్లో ఉందో తెలుసా? చాక్లెట్ బార్, చాక్లెట్ బాల్స్, చాక్లెట్ ఐస్‌క్రీమ్, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, హాట్ చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్, చాక్లెట్ కప్‌కేక్, ట్రఫుల్స్, ఫాండ్యూ... ఇలా లెక్కపెడుతూ పోతే చాక్లెట్ తినే టైమ్ మిస్ అయి పోతుంది! ఇక ఆన్ లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత చాక్లెట్ అభిమానుల పరిస్థితి మరింత ప్రమాదకరం. ఒక క్లిక్ చేస్తే చాలు– నిమిషాల్లో చాక్లెట్ ఇంటి గుమ్మం ముందు హాజరు! బయటికి వెళ్లాల్సిన పనిలేదు, చాక్లెట్టే మన దగ్గరకు వచ్చేస్తోంది.
బిస్కట్ కంపెనీలు కూడా ఇప్పుడు ‘చాక్లెట్ లేకుంటే బిజినెస్ లేదు అన్నట్టుగా చాక్లెట్ ఫ్లేవర్లతో కొత్త ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ప్రత్యేకంగా చాక్లెట్లకే అంకితమైన షాపులు కూడా ఉన్నాయి. కేక్ షాపుల్లో అయితే ఏ కేక్‌కి ఎక్కువ డిమాండ్ అంటే? సమాధానం ఒక్కటే, ‘చాక్లెట్!’ ఇదంతా ఎందుకంటే, చాక్లెట్ రూపం మారొచ్చు, రంగు మారొచ్చు, సైజు మారొచ్చు– కానీ ఒక చాక్లెట్ నోట్లో పడితే వచ్చే ఆనందం మాత్రం ఎప్పటికీ మారదు!
చాక్లెట్‌కు పుట్టినరోజు ఎలా వచ్చింది?
ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రేమికులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ‘ఇంతకాలం మనకు ఆనందం పంచిన చాక్లెట్‌కు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలి కదా!’ అని. అలా 2009 నుంచి అధికారికంగా ‘చాక్లెట్ డే’ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై 7నే ఎందుకు ఎంచుకున్నారంటే... 1550లో ఇదే రోజున చాక్లెట్ మొదటిసారి యూరప్‌కు పరిచయమైందట! అలా ప్రతి ఏడాది జూలై 7న ఈ తియ్యటి పండుగను జరుపుకుంటున్నారు.
అయితే, దేశాన్ని బట్టి ఈ తేదీలు మారుతుంటాయి. కోకో ఉత్పాదనలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన ఘనా ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకొంటుంది. యూరప్‌లోని లాట్వియా జూలై 11న చాక్లెట్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. అంతేకాదు, చాక్లెట్ ప్రేమికుల కోసం ఏడాది పొడవునా వివిధ రకాల చాక్లెట్లకు ప్రత్యేక రోజులు కూడా ఉన్నాయి. జనవరి 10న బిట్టర్‌స్వీట్ చాక్లెట్ డే, జూలై 28న మిల్క్ చాక్లెట్ డే, సెప్టెంబర్ 22న వైట్ చాక్లెట్ డే, అలాగే డిసెంబర్ 16న చాక్లెట్ కవర్డ్ ఏనీథింగ్ డే జరుపుకుంటారు.
చాక్లెట్ చెట్టుకు కాస్తుందా?
‘చాక్లెట్ ఫ్యాక్టరీలో తయారవుతుంది కదా, చెట్టుకు ఎలా కాస్తుంది?’ అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ నిజం ఏమిటంటే, చాక్లెట్ ప్రయాణం మొదలయ్యేది చెట్టు దగ్గరే! ‘కోకో’చెట్టును నాటిన తర్వాత, దానికి మొదటి కాయ కాయడానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే, దాని సగటు ఆయుష్షు దాదాపు 100 ఏళ్లు. అంతేకాదు, ఒక్కో కోకో కాయలో సుమారు 40 వరకు గింజలు ఉంటాయి. ఆ కాయల్లో ఉండే గింజలే తర్వాత మన చేతిలోకి చాక్లెట్‌గా చేరుతాయి. అంటే మనం తింటున్న చాక్లెట్ అసలు రూపం ఒక చెట్టు పండే!
దేవతల ఆహారం!
భూమి మీద మనుషులు పుట్టకముందే అంటే దాదాపు 100 మిలియన్ సంవత్సరాల క్రితమే డైనోసార్ల కాలంలో కోకో చెట్లు ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు! దాదాపు 4,000 ఏళ్ల క్రితమే మధ్య అమెరికాలోని మాయన్ , అజ్టెక్ నాగరికతల ప్రజలు కోకో సాగు చేసేవారు. కోకో చెట్ల కాయల్లో ఉండే గింజలతో ‘షొకోలాటల్‘ అనే ప్రత్యేక పానీయం తయారు చేసేవారు. అది సాధారణ పానీయం కాదు; రాజులు, యోధులు తాగేవారు. మతపరమైన కార్యక్రమాల్లో ఉపయోగించేవారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో కోకో గింజలను డబ్బుల్లా కూడా ఉపయోగించేవారు! చాక్లెట్ చెట్టు శాస్త్రీయ నామం ‘థియోబ్రోమా కకావో’. గ్రీకు భాషలో దీని అర్థం ‘దైవ ఆహారం’ అందుకే చాక్లెట్‌ను అప్పట్లో ‘దేవతల ఆహారం’ అని పిలిచేవారు.
చేదు పానీయం!
ఈరోజు ఒక చాక్లెట్ బార్ చేతిలో పెడితే క్షణాల్లో మాయమైపోతుంది. కానీ మీరు టైమ్ మెషిన్ లో కూర్చొని కొన్ని వేల ఏళ్ల వెనక్కి వెళ్లి ‘నాకు చాక్లెట్ కావాలి’ అంటే, మీ చేతిలో ఒక గ్లాసు చేదు పానీయం పెట్టేవారు! అవును, చాక్లెట్ మొదట్లో అసలు తినే తీపి పదార్థమే కాదు. మధ్య అమెరికాలోని ప్రాచీన ఒల్మెక్, మాయన్ , అజ్టెక్ నాగరికతలకు చెందిన ప్రజలు కోకో గింజలతో ఒక ప్రత్యేక పానీయం తయారు చేసుకుని తాగేవారు. కానీ అందులో చక్కెర ఉండేది కాదు. పైగా మిరపకాయలు, మసాలాలు కూడా కలిపేవారు. నేటి చాక్లెట్ అభిమానులు ఆ పానీయం రుచి చూస్తే, ‘ఇది చాక్లెట్టా? లేకా కషాయమా?’ అని ఆశ్చర్యపోవాల్సిందే! తర్వాత స్పానిష్ యాత్రికులు కోకోను యూరప్‌కు తీసుకెళ్లడంతో చక్కెర, పాలు చేరాయి. అలా ఒకప్పుడు చేదుగా ఉన్న పానీయం నేడు ప్రపంచాన్ని తీపిగా మార్చే చాక్లెట్‌గా అవతరించింది!
చాక్లెట్ చమక్కులు!
1. పెట్స్‌కు నో ఎంట్రీ
కుక్కలు, పిల్లులకు చాక్లెట్ అస్సలు పడదు. చాక్లెట్‌లో ఉండే ‘థియోబ్రోమిన్ ’ అనే పదార్థం కుక్కలకు విషంతో సమానం. కాబట్టి మీ చాక్లెట్‌ను మీ పెంపుడు జంతువులకు మాత్రం పొరపాటున కూడా షేర్ చేయకండి! అయితే, మెసోఅమెరికా కాలంలో చాక్లెట్‌ను మనుషులకు ఒక శక్తిమంతమైన ఔషధంగా వాడేవారు.
2. బంగారాన్ని కాదన్నారు
స్పానిష్ సైనికులు అజ్టెక్ సామ్రాజ్యాన్ని ముట్టడించినప్పుడు అక్కడ దొరికిన బంగారాన్ని, వెండిని వదిలేసి, కేవలం కోకో గింజలున్న గిడ్డంగిని కాపాడుకున్నారు. మాయన్, అజ్టెక్ నాగరికతల్లో కోకో గింజలను డబ్బులా వాడేవారు. వీటితో బట్టలు, ఆహారం కొనేవారు, పన్నులు కూడా కట్టేవారు! అప్పట్లో వాటికి అంత విలువ ఉండేది!
3. అదొక ‘ఫార్మా’ యాక్సిడెంట్!
1930లలో ‘నెస్లే’ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ, పిల్లల కోసం ఒక విటమిన్ పౌడర్‌ను తయారు చేస్తూ, అనుకోకుండా ‘వైట్ చాక్లెట్’ను కనిపెట్టింది. 1728లో యూకేలో మొట్టమొదటి చాక్లెట్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఇక 1847లో జోసెఫ్ ఫ్రై అనే బ్రిటిష్ వ్యక్తి ప్రపంచంలోనే మొదటి సాలిడ్ చాక్లెట్ బార్‌ను తయారుచేశారు.
4. హిట్లర్ సీక్రెట్ ప్లాన్!
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్‌ను చంపడానికి హిట్లర్ ఒక క్రేజీ ప్లాన్ వేశాడు. చాక్లెట్ బార్ లోపల పేలుడు పదార్థాలు పెట్టి ‘ఎక్స్‌ప్లోజివ్ చాక్లెట్’ను తయారు చేయించాడు. కానీ బ్రిటన్ గూఢచారులు దాన్ని కనిపెట్టేశారు! ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ యుద్ధంలో సైనికులు యాక్టివ్‌గా ఉండటానికి చాక్లెట్లు ఇచ్చేవారట!
5. స్పేస్ ట్రావెల్
రష్యన్, అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వెంట తీసుకెళ్లిన మొదటి స్నాక్స్ లిస్ట్‌లో చాక్లెట్ బార్స్ ఉన్నాయి.
6. సినిమాలో ‘రక్తం’ బదులు...
హాలీవుడ్ క్లాసిక్ హారర్ సినిమా ‘సైకో’ లోని ఫేమస్ షవర్ సీన్ లో రక్తంలా కనిపించడం కోసం ‘బాస్కో చాక్లెట్ సిరప్’ను వాడారు. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మీద అది పర్ఫెక్ట్ రక్తంలా కనిపించింది!
7. పరిమళాల రహస్యం
చాక్లెట్ వాసనలో దాదాపు 600 రకాల వోలటైల్ కాంపౌండ్స్ ఉంటాయి. సైంటిస్టులు ల్యాబ్‌లో ఎన్ని ప్రయోగాలు చేసినా, ఆ సహజసిద్ధమైన చాక్లెట్ సువాసనను ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయలేకపోయారు.
8. ఫేమస్ చాక్లెట్ టూత్‌పేస్ట్!
వినడానికి విచిత్రంగా ఉన్నా... కోకో గింజల తొక్కల్లో ఉండే ‘సీబీహెచ్’ అనే పదార్థం మన పంటి ఎనామిల్‌ను గట్టిపరుస్తుంది. ప్రస్తుతం కొన్ని విదేశీ కంపెనీలు చాక్లెట్ ఫ్లేవర్డ్ టూత్‌పేస్ట్‌లను కూడా తయారు చేస్తున్నాయి. రీసెర్చ్ ప్రకారం, డార్క్ చాక్లెట్‌లో ఉండే కొన్ని కాంపౌండ్స్, మనం వాడే టూత్‌పేస్ట్‌లలోని ఫ్లోరైడ్ కంటే వేగంగా పళ్లలోని బ్యాక్టీరియాతో పోరాడుతాయట!
9. దోమలు లేకపోతే చాక్లెట్ లేదు
కోకో పూలు చాలా చిన్నవిగా ఉంటాయి. వీటికి పరాగసంపర్కం చేయగలిగేది కేవలం ‘చాక్లెట్ మిడ్జ్’ అనే చిన్న దోమ మాత్రమే! ఆ దోమలు లేకపోతే ప్రపంచంలో చాక్లెట్ అనేదే ఉండదు!
10. బ్లడ్ గ్రూప్‌తో లింక్!
జపాన్ లో ‘బ్లడ్ గ్రూప్ చాక్లెట్స్’ అమ్ముతారు. మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి, మీ వ్యక్తిత్వానికి సరిపోయే ఫ్లేవర్ ఉన్న చాక్లెట్‌ను వాళ్లు డిజైన్ చేస్తారు.
11. రూబీ చాక్లెట్
డార్క్, మిల్క్, వైట్ కాకుండా ప్రపంచంలో నాల్గవ రకం చాక్లెట్ ఉంది. అదే ‘రూబీ చాక్లెట్’. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా, ఇది సహజంగానే పింక్ కలర్‌లో ఉంటుంది. దీన్ని 2017లోనే కనుగొన్నారు.
12. టైటానిక్ లక్!
మిల్టన్ హెర్షే (ప్రముఖ హెర్షేస్ చాక్లెట్ వ్యవస్థాపకుడు) నిజానికి టైటానిక్ ఓడలో ప్రయాణించాల్సింది. కానీ చివరి నిమిషంలో ఒక బిజినెస్ మీటింగ్ వల్ల ప్రయాణం రద్దు చేసుకున్నారు. అలా చాక్లెట్ కింగ్ ప్రాణాలు బతికాయి!
13. నోట్లో వేస్తే మాయం
చాక్లెట్ నోట్లో కరిగే ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రతకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే అది నోట్లో పడగానే అలా మాయమైపోయిందనిపిస్తుంది.
ఆరోగ్యానికి కూడా నేస్తమే
చాక్లెట్ అంటే ‘పళ్లు పాడవుతాయి’, ‘బరువు పెరుగుతాం’ అని భయపడుతుంటారు.
కాని, డార్క్ చాక్లెట్‌లో కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకు మించి తింటే నష్టాలు
దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆరోగ్య ప్రయోజనాలు
1. ఒక చిన్న చాక్లెట్ ముక్కలోనే అనేక ఖనిజాల ఖజానా దాగి ఉన్నందున దీనిని ‘సూపర్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు.
2. డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
3. ఫ్లేవనాయిడ్లు రక్తప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
4. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, పొటాషియం, జింక్ వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
5. మెదడుకు రక్తప్రసరణను పెంచి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో తోడ్పడవచ్చు.
6. మూడ్‌ను మెరుగుపరచి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
7. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలోను, తేమను నిలుపుకోవడంలో తోడ్పడుతుంది.
8. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడే అవకాశం ఉంది.
ఆరోగ్య నష్టాలు
1. అధికంగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
2. చక్కెర ఎక్కువగా ఉన్న చాక్లెట్‌లు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి.
3. తరచుగా తింటే దంతక్షయం వచ్చే అవకాశం ఉంటుంది.
4. చాక్లెట్‌లోని కేఫీన్ కారణంగా నిద్రలేమి సమస్యలు రావచ్చు.
5. కొంతమందిలో మైగ్రేన్ లేదా తలనొప్పులను ప్రేరేపించవచ్చు.
6. అధిక క్యాలరీలు, కొవ్వు కారణంగా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
7. కొంతమంది వ్యక్తుల్లో అలర్జీ ప్రతిచర్యలు కనిపించవచ్చు.
⇒ డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ, అది ఇంకా క్యాలరీలు కలిగిన ఆహారమే.
⇒ కాబట్టి రోజుకు 20–30 గ్రాములు లేదా 1–2 చిన్న ముక్కలు మాత్రమే మితంగా తీసుకోవడం మంచిది.
⇒ అలాగే 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను ఎంచుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు.
ఎంతమంది తింటున్నారంటే?
ప్రపంచవ్యాప్తంగా రోజూ దాదాపు 100 కోట్ల మంది చాక్లెట్‌ను ఆస్వాదిస్తారని అంచనా! అంటే ఈ క్షణంలో కూడా ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చాక్లెట్ ర్యాపర్‌ను చింపి మొదటి ముక్క నోట్లో వేసుకుంటున్నారు! ఇదే విషయాన్ని అంతర్జాతీయ సర్వేలు కూడా చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 75 లక్షల టన్నుల చాక్లెట్ వినియోగిస్తున్నారు.
చాక్లెట్ ప్రియుల జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అక్కడ ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 10 నుంచి 11 కిలోల వరకు చాక్లెట్‌ను ఆస్వాదిస్తారు. భారత్‌లోనూ చాక్లెట్‌కు ఆదరణ వేగంగా పెరుగుతోంది. దేశీయ మార్కెట్ విలువ ఇప్పటికే రూ. 20,000 కోట్లను దాటగా, ప్రపంచ చాక్లెట్ పరిశ్రమ విలువ రూ.12 లక్షల కోట్లకుపైగా ఉంది అంతేకాదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, మూడ్‌ను మార్చుకోవడానికి, చిన్న సెలబ్రేషన్ల కోసం చాలామంది ముందుగా ఎంచుకునేది చాక్లెట్‌నే!
తీపిలోనే కాదు... రికార్డుల్లోనూ టాప్!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా స్విట్జర్లాండ్‌కు చెందిన ‘లా చ్యూర్సా’ నిలిచింది. దీని ధర కిలోకు దాదాపు రూ.6.6 లక్షలు, ఇక 80 గ్రాముల బార్‌కే రూ.53 వేలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుంది! మరోవైపు, బ్రిటన్ కు చెందిన థోర్న్‌టన్ ్స సంస్థ తయారు చేసిన 5,792.5 కిలోల మహా చాక్లెట్ బార్ ప్రపంచంలోనే అత్యంత బరువైన చాక్లెట్‌గా గిన్నిస్ రికార్డు సాధించింది. సైజులోనూ చాక్లెట్ తన సత్తా చాటింది.
2024లో ఈక్వెడార్‌లో రూపొందించిన 416.34 చదరపు మీటర్ల వైశాల్యం గల చాక్లెట్ బార్ ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ బార్‌గా నిలిచింది. అది ఎంత పెద్దదంటే, ఆ రికార్డు కోసం ఉపయోగించిన చాక్లెట్ బార్లను ఒక వ్యక్తి రోజుకు ఒక్కటి చొప్పున తింటే, ఏకంగా 30 ఏళ్లు పడుతుంది. ఇలా చాక్లెట్ తీపి రుచిలోనే కాదు, ధర, బరువు, పరిమాణంలోనూ చాక్లెట్ రికార్డుల మోత మోగిస్తోంది.
చాక్లెట్ అభిమానుల కోసం ఒక సరదా కోట్ కూడా ఉంది. ‘పదిమందిలో తొమ్మిది మంది చాక్లెట్ అంటే ఇష్టం అని చెప్తుంటేæ, పదో వ్యక్తి మాత్రం అబద్ధం చెప్తాడు.’ ఇలా ప్రతి ఒక్కరి ఆనందాలను ఆహ్వానించే ఈ అతిథిని తన ప్రత్యేకమైన రోజున చాక్లెట్‌ను ఆస్వాదించకుండా ఎలా ఉంటాం!
∙కొండి దీపిక


