దేశీ టొమాటోల సిరి! మైసూరులో విత్తనోత్సవం | Sagubadi indigenous tomatoes Seeding festival in Mysore | Sakshi
Sakshi News home page

దేశీ టొమాటోల సిరి! మైసూరులో విత్తనోత్సవం

Jun 24 2025 10:12 AM | Updated on Jun 24 2025 1:13 PM

Sagubadi  indigenous tomatoes Seeding festival in Mysore

కొన్ని పంటల్లో దేశీ వంగడాల వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. కర్ణాటకకు చెందిన వి. కాంతరాజు 27 రకాల దేశీ టొమాటో వంగడాలను సాగు చేస్తూ పరిరక్షిస్తున్నారు. అత్యంత విలక్షణమైన ఆఫ్రికా టోగో, బ్లాక్‌ ప్లమ్, బ్లాక్‌ టొమాటో వంటి విశిష్ట రకాలు కూడా ఇందులో ఉన్నాయి. టొమాటోలే కాదు అనేక పంటల దేశీ వంగడాలను సేకరించటం, వాటిని రైతులకు ఇచ్చి ఏటేటా పండిస్తూ సంరక్షించటమే పనిగా పెట్టుకుంది మైసూరుకు చెందిన సేంద్రియ రైతుల సంఘం ‘సహజ సమృద్ధ’. కాంతరాజు కూడా ఈ సంఘం సభ్యుడే. ఈ 27 రకాల టొమాటోలతో పాటు చాలా రకాల ధాన్యాలు, పప్పుధాన్యాలను సైతం ఆయన సాగు చేస్తున్నారు. దేశీ విత్తనాలతో కూడిన సమీకృత సేంద్రియ వ్యవసాయమే ఆహార, పౌష్టికాహార, ఆదాయ భద్రతను కల్పిస్తుందని కాంతరాజు అంటున్నారు. కర్ణాటక దేశీ పంటల వైవిధ్యాన్ని కళ్లారా చూడాలంటే జూలై 5,6 తేదీల్లో మైసూరులో జరిగే దేశీ విత్తనోత్సవాన్ని సందర్శించాల్సిందే! అందరూ ఆహ్వానితులే.  వివరాలకు 70900 09944.

బీఆర్‌సీలపై 4 రోజుల శిక్షణ
ప్రకృతి వ్యవసాయంలో ఘన, ద్రవరూప ఎరువులు, ద్రావణాలు, కషాయాలు, జీవన ఎరువులు, జీవన పురుగు మందులను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చే కేంద్రాలను బయో రిసోర్స్‌ సెంటర్లు(బిఆర్‌సిలు) అంటారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, సహకార సంస్థలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల నిర్వాహకులకు నూజివీడు సమీపంలో కొండపర్వలో ఏర్పాటైన కృష్ణసుధ అకాడమీ ఫర్‌ ఆగ్రోఎకాలజీలో జులై 1 నుంచి 4 వరకు 4 రోజుల పాటు ఆంగ్లంలో శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. బిఆర్‌సిలకు సంబంధించిన 10 అంశాలపై శిక్షణ ఇస్తారు.  ఫీజు, రిజిస్ట్రేషన్‌ వివరాలకు.. 850 028 3300. 

Advertisement
 
Advertisement
Advertisement