అటు ఉల్లి ఒరుగులు, ఇటు మునగ పొడి : విదేశాల్లో గిరాకీ! | Sagubadi how to make onion flakes and Organic Moringa Powder | Sakshi
Sakshi News home page

అటు ఉల్లి ఒరుగులు, ఇటు మునగ పొడి : విదేశాల్లో గిరాకీ!

Jul 16 2025 11:16 AM | Updated on Jul 16 2025 3:35 PM

Sagubadi how to make onion flakes and Organic Moringa Powder

ఏ పంట పండించినా రైతులకు నికరంగా ఎంత ఆదాయం వస్తోంది అన్నదాన్ని బట్టే ఆ పంట మేలైనదా కాదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. రైతుకు నికరాదాయం పెరగాలంటే ఏ పంటలు పండించాలి?  పొట్టపో΄సుకోవటానికి ఎంతోచ్చినా చాల్లే అని అందరూ పండించే సాధారణ పంటలు పండిస్తే లాభం లేదు. విదేశాలకు అవసరమైన పంటలేవో గ్రహించి పండించి, ఎగుమతి చెయ్యాలి. ఈ విషయంలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వాళ్లు పండించి ఎగుమతి చేస్తున్నవి ఇవీ: 1. తెల్ల ఉల్లిపాయ ఒరుగులు 2. మునగ ఆకుల  పొడి!

తెల్ల ఉల్లిపాయల ఒరుగులు అనాదిగా ఎగుమతి అవుతున్న సరుకు కాదు. ఇటీవల కాలంలోనే దీనికి విదేశాల్లో గిరాకీ వచ్చింది. ఆ అవకాశాన్ని అందరికన్నా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది గుజరాత్‌ రైతులే. ఆ తర్వాత మహారాష్ట్ర. విదేశాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో తెల్ల ఉల్లిపాయల ఒరుగుల్ని వాడుతున్నారు. అమెరికా, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లో ఈ ట్రెండ్‌ నడుస్తోంది. తెల్ల ఉల్లి పాయలకు ఎర్ర ఉల్లి పాయల కన్నా 30% అధిక ధర ఇచ్చి వ్యాపారులు కొంటున్నారు. అందుకే ఇవి పండిస్తున్నా అంటున్నారు గుజరాత్‌ భావ్‌నగర్‌ జిల్లా రైతు రాహుల్‌. 

తెల్ల ఉల్లి ఒరుగులు మన దేశంలో కిలోకి రూ. 130 ధర ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 2.5–3 డాలర్లు (రూ. 215–255) పలుకుతోంది. సరుకు నాణ్యత, దేశాన్ని బట్టి ధరల్లో మార్పుంటుంది. కొనే వారుంటే పండించే వారూ ఆసక్తి చూపుతారు. అలాగే తెల్ల ఉల్లి సాగు విస్తీర్ణం పెరుగుతూ వెళ్తోంది. మొత్తం ఉల్లి సాగు విస్తీర్ణంలో 40% తెల్ల ఉల్లిదే. గత ఏడాది గుజరాత్‌లో 81,011 హెక్టార్లు సాగైన ఉల్లి ఈ ఏడాది 93,500 హెక్టార్లకు పెరిగింది.

ఇక రెండోది మునగ ఆకుల పొడి సంగతి. ప్రపంచంలో 80% మునగ సాగుతో భారత్‌ ముందుంది. మునగ సాగు, ఎగుమతిలో తమిళనాడు రైతులు అగ్రగామిగా ఉన్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో రైతులు కూడా దీనిపై దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్‌ రైతు పంకజ్‌ కుమార్‌. తోటి రైతులంతా వరి, గోధుమ పండిస్తుంటే ఆయన మాత్రం పదేళ్ల క్రితమే 1.5 ఎకరాల్లో మునగాకు పండించటం మొదలు పెట్టి, ఇప్పుడు పదెకరాలకు విస్తరించారు. జర్మనీ తదితర దేశాల్లో మునగాకు పొడికి గిరాకీ ఉంది. అందుకే మూడేళ్ల నుంచి అధిక సాంద్రతలో మునగాకును సాగు చేస్తున్నా అంటున్నారాయన.  మునగ కొద్దిపాటి నీటి వసతితోనే వేగంగా పెరిగే పంట. అయితే, 6–10 ఏళ్ల తర్వాత పంట మార్పిడి చేయటం తప్పనిసరి అంటున్నారు సీనియర్‌ రైతులు.  

ఇంతకీ, ఇతర రాష్ట్రాల్లో రైతులు ముందున్నారా? అక్కడి ప్రభుత్వాలే రైతులచేత ముందడుగు వేయిస్తున్నాయా?? అని మనం ఆలోచించుకోవాలి. మనం ముందంజలో ఉండే పంటలు చాలా ఉన్నా.. ఈ రెండు పంటల విషయంలో ఇతర రాష్ట్రాలను చూసి మనమూ నేర్చుకుంటే మేలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement