Reeni Tharakan: బామ్మ పవర్‌

Reeni Tharakan: 63-year-old homemaker from Kochi wins four gold medals - Sakshi

న్యూస్‌మేకర్‌

53 ఏళ్ల వయసులో ఆమె జిమ్‌లో చేరింది ఫిట్‌నెస్‌ కోసం. పదేళ్లు తిరిగేసరికి 63 ఏళ్ల వయసులో పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ అయ్యింది. ఇటీవల మంగోలియాలో నాలుగు గోల్డ్‌మెడల్స్‌ సాధించింది. ఏ వయసులోనైనా ఆరోగ్యంగా... దృఢంగ శరీరాన్ని మలుచుకునేందుకు స్త్రీలు శ్రద్ధ పెడితే సాధ్యం కానిది లేదని కొచ్చికి చెందిన రీని తారకన్‌ సందేశం ఇస్తోంది.

మంగోలియా రాజధాని ఉలాన్‌ బటోర్‌లో ఇటీవల ‘ఇంటర్‌నేషనల్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌’ (ఐ.పి.ఎఫ్‌) చాంపియన్‌షిప్స్‌ జరిగాయి. మన దేశం నుంచి 25 మంది పాల్గొంటే వారిలో 15 మంది స్త్రీలే. వారిలో కొచ్చిన్‌కు చెందిన రీని తారకన్‌ నాలుగు గోల్డ్‌మెడల్స్‌ సాధించింది. 63 ఏళ్ల వయసులో ఆమె ఇలా దేశం తరఫున పతకాలు గెలుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని అలా జరిగింది. అందుకు ఆమె చేసిన పరిశ్రమ, చూపిన శ్రద్ధే కారణం.

భారీ పోటీ
మంగోలియాలో జరిగిన ఐ.పి.ఎఫ్‌కు 44 దేశాల నుంచి 145 మంది పవర్‌లిఫ్టర్లు హాజరయ్యారు. వీరిని 40, 50, 60, 70 ఏళ్లుగా నాలుగు కేటగిరీల్లో విభజించి పోటీలు నిర్వహించారు. మళ్లీ ఈ కేటగిరీల్లో బరువును బట్టి పోటీదార్లు ఉంటారు. స్త్రీ, పరుషులు వేరువేరుగా పాల్గొంటారు. రీని తారకన్‌ అరవై ఏళ్ల కేటగిరిలో నాలుగు గోల్డ్‌ మెడల్స్‌ సాధించింది. డెడ్‌లిఫ్టింగ్‌లో 112.5 కిలోల బరువు ఎత్తగలిగింది. ప్రశంసలు అందుకుంది. ‘ఈ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో నాకు బాగా నచ్చిన అంశం స్త్రీలు ఎక్కువగా పాల్గొనడం. మన దేశం నుంచి స్త్రీలే ఎక్కువ మంది ఉన్నాం. అంటే నేటì కాలంలో స్త్రీలు తమ సామర్థ్యాలను ఏ వయసులోనైనా మెరుగు పరుచుకోవడానికి వెనుకాడటం లేదని తెలుసుకోవాలి’ అంది రీని తారకన్‌.

బరువు తగ్గడానికి వెళ్లి
రీని తారకన్‌ కొచ్చిన్‌ శివార్లలోని తైకట్టశ్శేరి అనే గ్రామంలో ఉంటుంది. భర్త ఆంటోని తారకన్‌ రైల్వేలో పని చేసి రిటైర్‌ అయ్యాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు అమెరికాలో స్థిరపడితే మరొకరు చెన్నైలో రెస్టరెంట్‌ను నడుపుతున్నారు. ఇంట్లో విశ్రాంతిగా ఉండటం వల్ల తాను బరువు పెరుగుతున్నానని రీని తారకన్‌కు అనిపించింది. దాంతో కొచ్చిన్‌ సిటీలోని వైట్టిలా ప్రాంతంలో ఒక జిమ్‌  లో చేరింది. ఇంటినుంచి జిమ్‌ పాతిక కిలోమీటర్ల దూరమైనా బరువు తగ్గాలనే కోరికతో రోజూ వచ్చేది. భర్త ఆమెను తీసుకొచ్చి దిగబెట్టేవాడు. అయితే ఆ జిమ్‌లోని ట్రైనర్‌ ఆమెలో బరువులెత్తే సామర్థ్యం ఉందని ఆ దారిలో ప్రోత్సహించాడు. పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌గా మారొచ్చని చెప్పాడు. అందుకు తర్ఫీదు ఇస్తానన్నాడు. 2021 నుంచి ఆమెను పోటీలకు హాజరయ్యేలా చూస్తున్నాడు. అప్పటి నుంచి రీని మెడల్స్‌ సాధిస్తూనే ఉంది. ‘పదేళ్ల క్రితం నాకు జిమ్‌ అంటేనే తెలియదు. కాని క్రమం తప్పకుండా జిమ్‌ చేస్తూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు పవర్‌లిఫ్టర్‌ని అయ్యాను. ఈ గుర్తింపు సంతృప్తినిస్తోంది’ అంది రీని తారకన్‌.

సమర్థింపులు, సూటిపోట్లు
‘నేను పవర్‌లిఫ్టర్‌ కావాలని ప్రయత్నించినప్పుడు నా కుటుంబం పూర్తి సహకారం ప్రకటించింది. నా పిల్లలు ‘‘ట్రై చెయ్యమ్మా’’ అన్నారు. కాని బంధువుల్లో కొందరు సూటిపోటి మాటలు అన్నారు. ఈ వయసులో ఇదంతా అవసరమా అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారికి పని చేస్తూనే సమాధానం చెప్పాలనుకున్నాను. అప్పుడు అలా అన్నవాళ్లు ఇవాళ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. జిమ్‌ స్త్రీలకు చాలామంచిది. పవర్‌లిఫ్టింగ్‌ లాంటివి మన ఎముకలకు బలాన్నిస్తాయి. నేను నా బరువును అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉంటున్నాను. వారంలో నాలుగు రోజులు జిమ్‌కు వచ్చి రెండు గంటలు వర్కవుట్‌ చేస్తాను. రెండు రోజులు ఇంట్లో వ్యాయామం చేస్తాను. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాను. వ్యాయామం ఉత్సాహాన్నిస్తుంది. తప్పక చేయండి’ అంటోంది రీని తారకన్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top