
లక్ష్యాన్ని వీడక ప్రయత్నిస్తూ ఉంటే విజయం ఏదో ఒకనాటికి వరిస్తుందని రాగిణి దాస్(Ragini Das) నిరూపించింది. 12 ఏళ్ల క్రితం గూగుల్ ఇంటర్వ్యూకు హాజరైన రాగిణి అందులో సెలెక్ట్ కాలేదు. దాంతో జొమాటో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంది. జొమాటోలో చేరి ఆ సంస్థ ఉన్నతికి తోడ్పడింది. ఇప్పుడు గూగుల్ రాగిణిని పిలిచి మరీ గూగుల్ ఇండియాకు ‘హెడ్ ఆఫ్ స్టార్టప్స్’గా నియమించింది. బాణం ఒకసారి గురి తప్పేది ఈసారి కచ్చితంగా గురికి చేరుకోవడానికే అని నిరూపించిన రాగిణి దాస్ పరిచయం.
‘అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది’ అన్నాడో సినీ కవి. అందరి విషయంలో అది సాధ్యం కాకపోవచ్చు. కాని శ్రమ, పట్టుదల ఉంటే వెనుదిరిగిన చోటే మళ్లీ ముందడుగు వేయడం సాధ్యమని నిరూపించారు రాగిణి దాస్. ప్రస్తుతం ఆమె గూగుల్ మెచ్చిన బిజినెస్ స్ట్రాటజిస్ట్. అందుకే ఆ సంస్థ గూగుల్ ఇండియా స్టార్టప్స్ విభాగానికి ఇటీవల ఆమెను హెడ్‌గా నియమించింది. ఆశ్చర్యం ఏమంటే పన్నెండేళ్ల క్రితం అదే గూగుల్ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లి వెనుదిరిగిన ఆమె ప్రస్తుతం అదే సంస్థలో ఉన్నత ఉద్యోగానికి ఎంపికవడం విశేషం.
చురుకైన విద్యార్థిని
హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లో జన్మించిన రాగిణి– చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమ్‌లో చదువుకున్నారు. చదువుతోపాటు అక్కడ ఆమె సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గాపాల్గొన్నారు. ఆ తర్వాత లాన్ కాస్టర్ యూనివర్సిటీ (ఇంగ్లాండ్) నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. అక్కడ చదువుతున్న సమయంలోనే స్టాండర్డ్ చాటర్డ్ బ్యాంక్‌తోపాటు ఇతర సంస్థల్లో ఇంటర్న్‌గా పని చేశారు రాగిణి. భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించడంపై ఆ సమయంలోనే దృష్టి సారించారు.
గూగుల్ కాదు పొమ్మంది
2012లో ట్రిడెంట్ గ్రూప్ ఇండియా సంస్థ ద్వారా తన కెరీర్‌ని ప్రారంభించారు రాగిణి. మొదట స్వదేశంలో మార్కెటింగ్ పర్యవేక్షించిన ఆమె ఆ తర్వాత యూరప్, అమెరికాల మార్కెటింగ్‌నూ నిర్వహించారు. సంస్థకు వెన్నుదన్నుగా నిలిచారు. 2013 ఆమె కెరీర్‌కు అత్యంత కీలకమైన సంవత్సరం. ఆ సమయంలో గూగుల్, జొమాటో సంస్థల్లో ఇంటర్వ్యూలకు వెళ్లారు రాగిణి. గూగుల్‌లో చివరి రౌండ్ దాకా నిలిచి, ఆ తర్వాత వెనుదిరగాల్సి వచ్చింది. అప్పుడు జొమాటో ఆమెను సగౌరవంగా సంస్థలోకి ఆహ్వానించింది.
అలా జొమాటోలో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా చేరిన రాగిణి అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థలో కీలకస్థానాల్లో పని చేశారు. 2017లో జొమాటో గోల్డ్ ఫౌండింగ్ టీంలో సభ్యురాలిగా మారి, సంస్థ ఉన్నతికి కృషి చేశారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ తదితర దేశాల్లో జొమాటో గోల్డ్ ఆరంభానికి ఆమె కీలకంగా వ్యవహరించారు. ‘జొమాటో నా కెరీర్‌ని తీర్చిదిద్దింది. నా భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యాలు, స్నేహితులను అక్కడే పొందాను’ అని ఆమె అంటుంది.
మహిళల కోసం...
జొమాటో నుంచి బయటకు వచ్చాక 2020లో ఆనంద్ సిన్హాతో కలిసి ముంబయి కేంద్రంగా ఆమె లీప్.క్లబ్ అనే ఆన్ లైన్, ఆఫ్‌లైన్ క్లబ్‌ని స్థాపించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు, వృత్తి నైపుణ్యాలు, నెట్‌వర్కింగ్ అంశాలను చేరువ చేసేందుకు ఈ క్లబ్ పని చేసింది. ఈ ఏడాది మేలో దీన్ని నిలిపి వేసేనాటికి ఈ క్లబ్‌లో సుమారు 25 వేల మంది పెయిడ్ సభ్యులు ఉండటం విశేషం. ‘ఈ క్లబ్ వల్ల చాలా మంది మహిళలు మేలు పొందడం నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది రాగిణి. పలు కారణాలతో లీప్.క్లబ్‌ను ఆపేసిన అనంతరం తన పెంపుడు శునకం జిమ్మీతో ఉల్లాసంగా గడుపుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అదే సమయంలో గూగుల్ ప్రకటన ఆమెను ఆకర్షించింది.
గూగుల్ నుంచి గూగుల్‌కు...
గూగుల్ స్టార్టప్స్ ఇండియా హెడ్ స్థానానికి అభ్యర్థుల కోసం వెతుకుతున్న సమయంలో మరోమారు గూగుల్ గడప తొక్కారు రాగిణి. ఇన్నాళ్ల తన అనుభవం తప్పక ఆ స్థానాన్ని తనకు అందిస్తాయని నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. ఆమెను గూగుల్ ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలనకునే వారిని సమన్వయం చేసి, గూగుల్ ద్వారా వారికి తగిన ్రపోత్సాహం అందించడం, మెంటర్స్‌ను ఇవ్వడం, ఫండింగ్ రిసోర్సస్‌ను తెలియచేయడం ఆమె పని. ‘భూమిలాగే జీవితం కూడా గుండ్రంగా ఉంది’ అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు రాగిణి.