Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!

Punam Rai empowering Thousands Of Girls With Bindeshwar Rai Foundation - Sakshi

Bindeshwar Rai Foundation Teaches Taekwondo And Painting To Girls: మెండైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? దాడికి పాల్పడిన వారిని మట్టికరిపించాలి. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? సమాజానికి కరదీపికగా ఉండాలి.ఆడపిల్లల్ని ఇలా తీర్చిదిద్దుతోంది పూనమ్‌ రాయ్‌.


                                                        పూనమ్‌ రాయ్‌

అది 1997, ఫిబ్రవరి 2. పూనమ్‌ రాయ్‌ జీవితంలో మరచిపోలేని రోజు. మరిచిపోలేని రోజు అనడం కంటే మరపుకు రాని విషాదానికి గురి చేసిన రోజు అనడమే కరెక్ట్‌. ఆమె జీవితాన్ని అచేతనంగా మార్చి వేసిన దుర్దినం అది. అలాంటి అచేతన స్థితి నుంచి తనను తాను చైతన్యవంతం చేసుకుంది. అంతేకాదు... ఇప్పుడామె వేలాది మంది ఆడపిల్లల్ని చైతన్యవంతం చేసి ధీరవనితలుగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే మూడు వేల మందికి తైక్వాండోలో శిక్షణ ఇప్పించింది. ఈ మహిళా జాగృతోద్యమ కాగడా వెలుగుతూనే ఉండాలని, తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటుందని, తన తర్వాత ఈ జ్యోతిని అందుకునే మరో చెయ్యి తప్పకుండా వస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతోందామె.

ఆడపిల్ల తండ్రి
బీహార్‌లోని వైశాలిలో పుట్టింది పూనమ్‌ రాయ్‌. తండ్రి పీడబ్యుడీలో ఇంజనీర్, తల్లి గృహిణి. ఇంట్లో ఏ విధమైన వివక్ష లేకుండా సోదరులిద్దరితో కలిసి పెరిగింది పూనమ్‌. బనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి పెయింటింగ్‌ లో ఆనర్స్‌ చేసింది. తండ్రి ఉద్యోగరీత్యా వాళ్ల కుటుంబం వారణాసికి మారాల్సి వచ్చింది. ఆ వెంటనే ఆమెకు వారణాసికి చెందిన అబ్బాయితో పెళ్లయింది. బీహార్, యూపీల్లో ఆడపిల్లల తండ్రి అంటే వియ్యంకుల ఆధిపత్యానికి తలవంచాల్సిందే. నేటికీ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు అన్నింటికీ తలవంచుతుంటారు. పూనమ్‌ పెళ్లి విషయంలోనూ అంతే జరిగింది. వరుడు మణిపాల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చేశాడని చెప్పి పెళ్లి చేశారు. పెళ్లి సందర్భంగా భారీగా లాంఛనాలు పుచ్చుకున్నారు. పూనమ్‌కి తన భర్త ఇంటర్‌ కూడా పూర్తి చేయలేదనే ఓ చేదునిజం పెళ్లయిన రెండు వారాలకు తెలిసింది. పైగా ఆమెకు భర్త, అత్తమామల నుంచి సరైన ఆదరణ లభించలేదు.

చదవండి: అబల కాదు.. ఐరన్‌ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!!

మానసిక, భౌతిక వేధింపులు మొదలయ్యాయి. ఓ రోజు... 1997, ఫిబ్రవరి 2వ తేదీన పూనమ్‌ భర్త రకరకాలుగా దూషిస్తూ ఆమె మరణిస్తే మరో పెళ్లి చేసుకుంటానంటూ, ఆమెను బాల్కనీలో నుంచి కిందకు తోసేశాడు. ఆమెకు ఆ రోజు ఆ పడిపోవడం మాత్రమే తెలుసు. కోమా నుంచి తిరిగి స్పృహ వచ్చేటప్పటికి ఆరు నెలలు గడిచిపోయాయి. స్పృహ వచ్చిన తర్వాత తెలిసిన విషయం... తాను ఇక ఎప్పటికీ నడవలేదని. శరాఘాతం వంటి ఆ వాస్తవం ఆమెను కుంగదీసింది. అయితే... సోదరులు, తల్లిదండ్రుల ప్రేమ, క్రమం తప్పని ఫిజియోథెరపీతో ఆమె లేచి నిలబడడం, వాకర్‌ సహాయంతో నడవడం సాధ్యమైంది. పూనమ్‌లో ధైర్యం ప్రోది చేసుకోవడం మొదలైంది. ఇంతలో వాళ్ల నాన్నగారు కాలం చేశారు. ఆమె మానసికంగా కదలిపోయిందాక్షణంలో. ‘‘బాల్యంలో అందరినీ తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తాడు. కానీ మా నాన్న నలభై ఏళ్ల వయసులో నన్ను రోజూ చేయి పట్టుకుని నడిపించాడు. కొండంత అండగా ఉన్న నాన్న పోయారు. నా గతంతోపాటు నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి.

నన్ను మామూలు మనిషిని చేయడానికి ఆయన పడిన తపన నన్ను హెచ్చరించసాగింది. మా నాన్నలాగ ప్రతి ఆడపిల్లనూ కంటిపాపలా చూసుకునే తండ్రి ఉంటే సమాజం ఎంత అందంగా ఉంటుందో కదా అనిపించేది. ఆడపిల్ల తనకు ఎదురైన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన నాకు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఆడపిల్లలను చైతన్యవంతం చేయాలనుకున్నాను. స్వీయ రక్షణలో ప్రాథమిక శిక్షణ కూడా తీసుకున్నాను. నాన్న జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవడం కోసం ఆయన పేరుతో బిందేశ్వరీ రాయ్‌ ఫౌండేషన్‌ను స్థాపించాను. ‘వారణాసి తైక్వాండో అసోసియేషన్‌’తో కలిసి పని చేస్తున్నాను. ఇప్పటికీ ఆడపిల్లలకు చదువుకు ఖర్చు చేయడానికే ముందు వెనుకలు ఆలోచించే తల్లిదండ్రులున్న సమాజం మనది. వాళ్ల స్వీయరక్షణ కోసం ఫీజులు కట్టాలంటే ముందుకు రారు. అందుకోసం నేను ఉచితంగా తైక్వాండో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేశాను. మా దగ్గర శిక్షణ తీసుకున్న మూడు వేల మందిలో ఇరవై మందికి పైగా జాతీయస్థాయి టోర్నమెంట్‌లలో పాల్గొన్నారు. 

భయం పోయింది
తైక్వాండో నేర్చుకున్న తర్వాత ఆడపిల్లల్లో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషంగా ఉంది. స్కూలుకు, కాలేజ్‌కి వెళ్లే దారిలో ఆకతాయిలు ఏడిపిస్తే వీళ్లు మార్షల్‌ ఆర్ట్‌కు పని చెప్తున్నారు. దాంతో తైక్వాండో నేర్చుకున్న పిల్లలను ఒకమాట అనడానికి ఆకతాయిలు కూడా సందేహిస్తున్నారు. ఈ పరిణామంతో మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని పేరెంట్స్‌ కూడా ముందుకు వస్తున్నారు. వారంలో మూడు రోజులు తైక్వాండో, మరో మూడు రోజులు పెయింటింగ్‌ లో శిక్షణ ఇస్తున్నాం. మా పిల్లలు వేసిన ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించాం. అలాగే బేటీ బచావో, బేటీ పఢావో అంశంతో తల్లి కడుపులో రూపుదిద్దుకున్నప్పటి నుంచి చివరి వరకు సాగే ఆడబిడ్డ జీవిత ప్రయాణాన్ని 648 బొమ్మలతో చిత్రిస్తున్నాం’’ అని చెప్పింది పూనమ్‌రాయ్‌.

చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్‌ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top