మనసుని తడిపేసే అనుభూతి | Meghalaya, A Dreamland Where Clouds Touch The Earth And Nature Comes Alive, Places To Visit In Meghalaya Northeast India | Sakshi
Sakshi News home page

Meghalaya Tourist Places: మనసుని తడిపేసే అనుభూతి

Jun 29 2026 8:44 AM | Updated on Jun 29 2026 10:50 AM

Places To Visit In Meghalaya Northeast India

పర్యటన : మేఘాలయ

కొన్ని ప్రదేశాలు చూడటానికి కాదు, అనుభూతి చెందడానికి పిలుస్తాయి. ఆలాంటి ఒక ప్రదేశమే మేఘాలయ. మేఘాలు భూమిని తాకుతుంటే, జలపాతాలు పాటలు పాడుతుంటే, గమ్యం కన్నా ప్రయాణమే మధురంగా అనిపిస్తే అదే మేఘాలయ.

భారత దేశంలోని నార్త్‌ ఈస్ట్‌లో ఉన్న మేఘాలయా రాష్ట్రాన్ని ‘అబోడ్‌ ఆఫ్‌ క్లౌడ్స్‌‘ అని పిలుస్తారు. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి భూమి మొత్తం పచ్చని రంగుల్లో మునిగిపోతుంది. మేఘాలు చెరువులుగా భూమిని ఆలింగనం చేసుకున్నట్టు కనిపిస్తాయి. ప్రతీ అడుగు ప్రకృతితో మాట్లాడుతుంది. ప్రతీ మార్గం ఒక కొత్త కథను చెబుతుంది. ఇక్కడ ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకోవడం కాదు. ఆ మార్గంలో కలిగే ప్రతీ అనుభూతిని ఆస్వాదించడం.


ఆసక్తికరమైన విషయాలు..
రాష్ట్రం: మేఘాలయ, నార్త్‌ ఈస్ట్‌ ఇండియా
బెస్ట్‌ ఎక్స్‌పీరియెన్స్‌: మాన్‌ సూన్‌ లో మేఘాలు, జలపాతాల మధ్య ప్రయాణం
దగ్గరిలోని విమానాశ్రయం: గువహతి విమానాశ్రయం, అస్సాం
ట్రిప్‌ సమయం: 5 రోజులు సరిపోతుంది
టాప్‌ 5 ప్రదేశాలు: చిరపుంజి, డాకి రివర్, లివింగ్‌ రూట్‌ బ్రిడ్జెస్, షిల్లాంగ్, మావ్‌లిన్నాంగ్‌

మేఘాల మధ్య జీవనం
మేఘాలయలో వర్షం ఒక సీజన్‌ కాదు. జీవన విధానం. షిల్లాంగ్‌ వైపు ప్రయాణం మొదలైన వెంటనే రోడ్డు పక్కన నిలిచిన పైన్‌ వృక్షాలు, మేఘాలతో కప్పబడిన కొండలు, మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న గ్రామాలు మనసుని ప్రశాంతంగా మార్చేస్తాయి. ఇక్కడ గాలి కూడా చల్లని సుగంధంతో ఉంటుంది. జలపాతాల ధ్వని దూరం నుండి వినిపిస్తుంటే, మేఘాలు కొన్ని సార్లు రోడ్డుమీద దిగివచ్చి మీ పక్కనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రకృతి తన అందాన్ని ఇక్కడ కూడా ఆతిశయోక్తి లేకుండా చూపిస్తుంది.

సందర్శనీయ ప్రదేశాలు
షిల్లాంగ్‌ సిటీకి చేరగానే బ్రిటిష్‌ హిల్‌ స్టేషన్‌ లాంటి ఒక సౌకర్యం, నార్త్‌ ఈస్ట్‌ సంస్కృతి కలిసిన ప్రత్యేక వాతావరణం కనిపిస్తుంది. వార్డ్స్‌ లేక్‌ దగ్గర సాయంత్రం గాలి ఆస్వాదిస్తుంటే, సమయం నెమ్మదిగా నడుస్తున్నట్టు ఉంటుంది. చిరపుంజి వైపు వెళ్లిన తరువాత మేఘాలు ఇంకా దగ్గరగా అనిపిస్తాయి. నోహ్‌కలికై ఫాల్స్‌ నుండి పడుతున్న నీటి ధార వర్షాకాలంలో మరింత గంభీరంగా కనిపిస్తుంది. సెవన్‌ సిస్టర్స్‌ ఫాల్స్‌ మధ్య మేఘాలు ఆడుకుంటుంటే ఆ దృశ్యం చాలా సేపు మనసులో నిలిచిపోతుంది.


మాస్మై కేవ్‌లో నడుస్తుంటే ప్రకృతి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ అద్భుతమైన కళాకృతిని సిద్ధం చేసిందో అని అనిపిస్తుంది. డాకిలో ఉంగాట్‌ రివర్‌ నీరు ఎంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటుందంటే అందులో పడవ వెళ్తుంటే దూరం నుండి గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. మావ్‌లిన్నాంగ్‌ గ్రామంలో పరిశుభ్రత, ప్రకతి కలిసి ఒక మంచి జీవన విధానాన్ని చూపిస్తాయి. లివింగ్‌ రూట్‌ బ్రిడ్జెస్‌ దగ్గర ప్రకృతి, మానవ సహకారం కలిసి సృష్టించిన అద్భుతం ప్రతీ అడుగులో కనిపిస్తుంది.

ఎలా వెళ్లాలి?

  • హైదరాబాద్‌ నుండి షిల్లాంగ్‌కి ప్రయాణం ప్రారంభం అయ్యే ముందు, ఆకాశం వైపు చూస్తూ నార్త్‌ ఈస్ట్‌ పిలుపు వినిపిస్తుంది. హైదరాబాద్‌ నుంచి అస్సాంలోని గువహతికి డైరెక్ట్‌ లేదా కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ సులభంగా దొరుకుతాయి. అక్కడి నుండి రోడ్డు జర్నీ మొదలవుతుంది.

  • గువహతి నుండి షిల్లాంగ్‌ వరకు ప్రయాణం చాలా అందమైన ఘాట్‌ రోడ్ల మధ్య జరుగుతుంది. ప్రతీ మలుపు కొత్త దృశ్యం చూపిస్తుంది. మేఘాలు రోడ్డుపై దిగివస్తుంటే ప్రయాణం డెస్టినేషన్‌ కన్నా గొప్పగా అనిపిస్తుంది. విజయవాడ నుండి ప్రయాణం చేసే వారు హైదరాబాద్‌ లేదా బెంగళూరు ద్వారా గువహాతి చేరుకుని అదే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఈ మార్గంలో ప్రయాణం ఒక సినిమాలా, ఒక స్లో మోషన్‌ సీక్వెన్స్‌లా ఉంటుంది.


ఏం చూడాలి?

  • మేఘాలయాలో ప్రతీ నిమిషం ఒక ఫ్రేమ్‌లా ఉంటుంది. జలపాతాలు, మేఘాలు, పచ్చని కొండలు, అడవి మధ్య నడిచే మార్గాలు కలిసి ఒక లైవ్‌ పెయింటింగ్‌లా కనిపిస్తాయి.

  • లివింగ్‌ రూట్‌ బ్రిడ్జిపై నడిచే క్షణం ప్రకతితో కలిసి నడుస్తున్నట్టు ఉంటుంది. డాకి నదిపై పడవ ప్రయాణం చేస్తూ నీటిలో ఆకాశం ప్రతిబింబాన్ని చూస్తూ సమయం మరిచిపోవచ్చు. షిల్లాంగ్‌ మార్కెట్‌లో స్థానిక జీవన విధానం, కళ, సంస్కృతి కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు మౌనంగా గడపడం, మేఘాల మధ్య రోడ్డు జర్నీ ఆస్వాదించడం, ఉంగాట్‌ రివర్‌పై బోట్‌ రైడ్‌ ఆస్వాదించడం, లివింగ్‌ రూట్‌ బ్రిడ్జి దగ్గర నడవడం, మావ్‌లిన్నాంగ్‌ గ్రామంలో ప్రతీ వీధిని నెమ్మదిగా నడుస్తూ ఫీల్‌ అవ్వడం అనే ఈ ఐదు అనుభవాలు ఈ యాత్రని మరింతగా గుర్తిండిపోయేలా మార్చేస్తాయి.


ఎక్కడ ఉండాలి?
షిల్లాంగ్‌లో హెరిటేజ్‌ కాటేజీలు, బోటీక్‌ స్టేస్, నేచర్‌ రిసార్టులు, వుడెన్‌ హోమ్‌ స్టేలు ప్రతీ ఒక్కటి ప్రకృతి దగ్గరగా తీసుకెళ్తాయి. ప్రతీ ఉదయం బాల్కనీ తలుపు తెరవగానే మేఘాలు ఎదురుగా నిలబడి స్వాగతం చెబుతాయి. చిరపుంజిలో కొండల మధ్య ఉన్న రిసార్టులో వర్షం శబ్దం మధ్య కాఫీ తాగుతుంటే నగర జీవితం ఎంతో దూరం వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. రాత్రి సమయంలో చల్లని గాలి, పక్షుల స్వరాలు, మేఘాల మధ్య వెలుగులు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.

ఏం తినాలి?

  • మేఘాలయ రుచులు కూడా ఇక్కడి భూమిలాగే సహజంగా ఉంటాయి. జడో అనే రైస్‌ ప్రిపరేషన్, తంగ్రింబై, దోనియాంగ్‌ లాంటి స్థానిక వంటకాలు ప్రతీ భోజనంలో కొత్త రుచిని పరిచయం చేస్తాయి. నాన్‌ వెజ్‌ ప్రియులకు వెరైటీలకు కొదువేలేదు అనేలా ఆప్షన్స్‌ ఉంటాయి.

  • ఫ్రెష్‌ ఫ్రూట్స్, బాంబూ షూట్‌ రెసిపీస్, లోకల్‌ టీ, వేడి వేడి సూప్‌ చల్లని వాతావరణంలో మరింత రుచిగా అనిపిస్తాయి. చిన్న కేఫేల్లో కాఫీ సిప్‌ చేస్తూ మేఘాలను చూస్తూ గడిపిన సమయం భోజనం కన్నా ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 


యాత్రా అండ్‌ బడ్జెట్‌ వివరాలు

  • హైదరాబాద్‌ నుంచి ఐదు రోజుల మేఘాలయ ప్రయాణం అనేది బడ్జెట్‌ ప్లాన్‌న్‌  చేసుకుంటే... ప్రతీ వ్యక్తికి సుమారు రూ.28,000 నుండి రూ.35,000 మధ్య పూర్తి అవుతుంది. స్టాండర్డ్‌ కంఫర్ట్‌ ప్లాన్‌న్‌ రూ.40,000 నుండి రూ.55,000 మధ్య ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ కోసం రూ.70,000 నుండి రూ.95,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుండి వెళ్లిన వారికి ప్రయాణం దారిని బట్టి కొంచెం అదనపు ఎయిర్‌ఫేర్‌ ఉంటుంది. గువహతి నుంచి షిల్లాంగ్‌ రోడ్డు ప్రయాణం ఎవర్‌గ్రీన్‌ మెమోరీగా మిగిలిపోతుంది.

  • స్టే చార్జెస్‌ ప్రతీ రాత్రికి రూ.2 వేల నుంచి రూ.5 వేల మధ్య బడ్జెట్‌ కేటగిరిలో ఉంటాయి. ప్రీమియం రిసార్టులు రూ.7 వేల నుండి రూ.15 వేల వరకు ఉంటాయి. భోజనం కోసం రోజుకు సుమారు రూ.700 నుంచి రూ.1500 వరకు బడ్జెట్‌ పెడితే సరిపోతుంది. లోకల్‌ సైట్‌సీయింగ్‌ ΄్యాకేజీలు, ప్రైవేట్‌ క్యాబ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అనేవి అందుబాటు ధరలో చూసుకుంటే సరిపోతుంది. భారత దేశంలో భాగమే కాబట్టి వీసా అవసరం లేదు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement