
పారాచూట్ ఉమన్ ఆఫ్ ఇండియా
తండ్రి వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన స్మిత
ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ‘పారాచూట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. నవీన సాంకేతికతతో పారాచూట్ కంపెనీకి కొత్త కళ తీసుకువచ్చింది...
ముంబైలోని ‘ఓరియెంటల్ వీవింగ్ అండ్ ప్రాసెసింగ్ మిల్స్’ను స్మిత తండ్రి విష్ణునాథ్ చాల్కె స్థాపించారు. కంపెనీలోకి స్మిత అడుగుపెట్టిన తరువాత పారాచూట్‌ల తయారీ మొదలైంది.
నీటికింద ఉపయోగించే పారాచూట్, డిఫెన్స్ టార్గెట్ పారాచూట్, స్పేస్ రికవరీ పారాచూట్, కార్గో పారాచూట్, పర్సనల్ పారాచూట్, కాంబాట్ పారాచూట్, ట్యాంకులను విమానాల నుండి డ్రాప్ చేసే పారాచూట్... ఇలా ఎన్నో రకాల పారాచూట్‌లను ఓరియెంటల్ కంపెనీ తయారు చేస్తోంది.
భద్రతా దళాలకు కూడా పారాచూట్‌లను సరఫరా చేస్తుంది. పారాచూట్‌లను అంతర్జాతీయంగా ఎగుమతి చేసిన తొలి ప్రైవేట్ ఇండియన్ కంపెనీగా ‘ఓరియెంటల్’ కంపెనీ గుర్తింపు తెచ్చుకుంది.
తండ్రి వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి ముందు కొన్ని కంపెనీలలో పనిచేసింది స్మిత. మొదట్లో పని తెలిసిన టైలర్‌లను వెదుక్కోవడం కష్టంగా ఉండేది. పారాచూట్ టెక్నాలజీలో పట్టు సాధించి, మౌలిక సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్లింది స్మిత.
విదేశాల్లో జరిగే ఎగ్జిబిషన్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతుంటుంది. సాంకేతిక నిపుణులతో మాట్లాతుంది. కొత్త సాంకేతికతను ఎప్పటికప్పుడు కంపెనీలోకి తీసుకువస్తుంటుంది.
‘ఒకప్పుడు పారాచూట్ ఫ్యాబ్రిక్ సాధారణ మగ్గాలపై తయారయ్యేది. ఇప్పుడు వాటర్ జెట్ లూమ్‌లపై తయారవుతోంది. అందుకే నాణ్యత మరింత పెరిగింది’ అంటున్న స్మిత ప్రతిష్ఠాత్మకమైన ‘ది సింథటిక్ అండ్ ఆర్ట్ సిల్క్ మిల్స్ రిసెర్చి అసోసియేషన్’కు ఉపా«ధ్యక్షురాలిగా ఉంది.
తీరికలేనంత పనుల్లో ఉన్నప్పటికీ వంట చేయడం, తోటపనులు అంటే స్మితాకు ఇష్టం. ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఆమెకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఊరకే పోవు. కంపెనీ బలోపేతానికి ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి.
గర్వించిన సందర్భం
వ్యాపారరంగంలో నాకు స్ఫూర్తి మా నాన్న. అన్ని రకాలుగా నన్నుప్రోత్సహించేవారు. సాధారణ అవసరాల నుంచి యుద్ధంలో ఉపయోగపడే పారాచూట్‌ల వరకు ఎన్నో రకాల పారాచూట్‌లను మేము తయారు చేశాం. ఎయిర్‌క్రాఫ్ట్‌తో డ్రాప్ చేసే 16 టన్నుల ట్యాంకును ఎత్తే సామర్థ్యం ఉన్న పారాచూట్‌లను తయారు చేయడం మేము గర్వించిన సందర్భం.
– స్మిత