Nagaland: నిజాయితీకి చిరునామా! | Nagaland Capital City Kohima | Sakshi
Sakshi News home page

Nagaland: నిజాయితీకి చిరునామా!

May 4 2025 7:32 AM | Updated on May 4 2025 7:33 AM

Nagaland Capital City Kohima

నాగాలాండ్‌ రాజధాని ‘కోహిమా’ కదా... నాగాలాండ్‌లోనే, ఇండియా–మయన్మార్‌ సరిహద్దుల్లో కోహిమాకు పశ్చిమాన 20 కి.మీ. దూరంలో ‘ఖొనోమా’ అనే గ్రామం ఉంది.  ఆ గ్రామం ప్రత్యేకత... గ్రామంలో ఎవరూ అబద్ధాలు ఆడకపోవటం! ఎవరూ దొంగతనం చేయకపోవటం! ఎవరూ ఇళ్లకు తాళాలు వేయకపోవటం! దుకాణాల్లో వాటిని నడిపేవారెవరూ ఉండకపోవటం! ఇలాంటివన్నీ కలిపి ఖొనోమా గ్రామంలో మొత్తం 154 ప్రత్యేకతలు ఉన్నాయి. ‘కెన్యూ’ నిబంధనలు అంటారు వాటిని. ఎవరైనా కెన్యూను దాటి ప్రవర్తించారా... ఇక వాళ్ల పని దైవం చూసుకుంటుందని గ్రామస్థుల నమ్మకం. 

ఖొనోమా గ్రామం దేశంలోనే ‘నిజాయితీ గల గ్రామం’గా ప్రసిద్ధి చెందింది.ఖొనోమా గ్రామంలో ఉండేదంతా ‘అంగామీ’ తెగవారు. నాగాలాండ్‌కు చెందిన ఒక ప్రధాన సమూహం ఆ తెగ. ‘అంగామీ నాగా’లు అంటారు వారిని. ‘గోల్హో’ వారి ప్రధాన ఆహారం. బియ్యం, హిమాలయాల్లో విస్తృతంగా ఉండే చిమటి కూర కలిపి గోల్హోను తయారు చేస్తారు. అలాగే కూరగాయలు, పందిమాసం, గొడ్డు మాంసం తింటారు. వారిలో దాదాపుగా అందరూ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. 2011 లెక్కల ప్రకారం అక్కడి జనాభా సుమారుగా 2 వేలు. పురుష జనాభా కంటే, స్త్రీ జనాభా పిసరంత ఎక్కువ. గ్రామం ప్రకృతి మధ్యలో ఉంటుంది. ప్రకృతి తన కోసం కట్టుకున్న ఇంటిలా ఆ పచ్చని గ్రామంపై మంచు పరుచుకుని ఉంటుంది. 

మోసం అనే మాటే ఉండదు!
నాగాలాండ్‌లో చాలావరకు గ్రామాలన్నీ ఖొనోమాలా ఉన్నప్పటికీ, ఖొనోమా ప్రజలు ‘కెన్యూ’ నియమాలకు లోబడి జీవించటం మూలాన దేశంలోనే ఈ గ్రామం నిజాయితీ గల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఖొనోమాకు ‘వారియర్‌ విలేజ్‌’ అనే పేరు కూడా ఉంది. బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన చరిత్ర వీరిది. ఖొనోమా ప్రజల్లో నిజాయితీ అనేది కేవలం నైతిక ధర్మం మాత్రమే కాదు, అది వారి సామాజిక సంప్రదాయ శక్తి కూడా. నిజాయితీ పట్ల వారి నిబద్ధతే ఆ తెగలో పేద, ధనిక అనే అసమానతలు లేకుండా చేసింది. దొంగతనం అనే మాటే ఆ గ్రామంలో వినిపించదు. 

దొంగతనం అనేది దేవుడి విషయంలో మనిషి చేసే నేరం అని వారు బలంగా విశ్వసిస్తారు. ఖొనోమాలోని దుకాణాల్లో వినియోగదారులు ఎవరికి కావలింది వారు తీసుకుని, డబ్బులు అక్కడ పెట్టి వెళతారు. ఆ డబ్బుల్ని తీసుకోటానికి, లెక్క చూసుకోటానికి దుకాణంలో పనిగట్టుకుని ఎవరూ ఉండరు. అంత నమ్మకం రాజ్యమేలుతూ ఉంటుంది ఖొనోమా గ్రామంలో! అంతేనా, ఎవరైనా వ్యవసాయదారులు పంటను ఇంటికి మోసుకెళుతున్నప్పుడు అలసిపోతే, వారు ఆ పంటను రోడ్డు పక్కన వదిలి, మరుసటి రోజు వచ్చి తీసుకెళతారు. అప్పటి వరకు ఆ పంట భద్రంగా రహదారి పక్కనే ఉంటుంది. ఎవరైనా తీసుకెళతారన్న భయమే ఉండదు.   

‘అనిమిజం’... ఈ గ్రామ మార్గం
నిజాయితీ అన్నది వాళ్ల మత విశ్వాసాల్లోనే మిళితమై ఉంది. 19వ శతాబ్దంలో క్రైస్తవ మతం ఇటువైపు వ్యాప్తి చెందటానికి ముందు నుండే ఖొనోమాలోని ఈ అంగామీలు ‘అనిమిజం’ అనే భావనను విశ్వసిస్తూ వస్తున్నారు. నేటికీ ఆ విశ్వాసం కొనసాగుతూ వస్తోంది. అనిమిజం అంటే సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు, ప్రదేశం ప్రత్యేక ఆధ్యాత్మిక సారాన్ని కలిగి ఉంటుందన్న నమ్మకం. ఈ నమ్మకం కేవలం మతపరమైనది కాదు. రోజువారీ జీవితంలో అంతర్భాగం అయిన ఆచారాలు, సంప్రదాయాలు, పర్యావరణానికి హితమైన జీవన విధానం అనిమిజానికి ఆయువు పట్టు. వీటిలోంచి అంగామీల పూర్వీకులు ఏర్పరచిన 154 నిబంధనలే కెన్యూలు. కెన్యూ అనే మాటకు నిషిద్ధం అని అర్థం. వికలాంగులను ఆదరించకపోవటం కెన్యూ. పెద్దల్ని గౌరవించకపోవటం కెన్యూ. మోసం చేయటం, అబద్ధాలాడటం, సాటి మనిషిని తృణీకరించటం వంటివన్నీ కెన్యూలే. ఖొనోమా ప్రజల భావోద్వేగాల రక్తకణాల వంటివి ఈ కెన్యూలు. 

అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం!
దొంగిలించిన పిల్లి మాంసం తినడం కూడా ఒక కెన్యూ. అలా చేస్తే పిల్లి శాపం తగులుతుందని ఖొనోమా గ్రామస్థులు నమ్ముతారు. పెంపుడు పిల్లలను ఆహారం కోసం చంపటం వంటి సంఘటనల నుంచి ఈ కెన్యూ ఆవిర్భవించింది. లంచాలు తీసుకోవటం, మన కోసం పని చేసినవారికి సగం జీతాన్నే చెల్లించటం, అత్తమామల్ని కించపరచటం, గుమ్మడి కాయను వేలితో చూపించటం ఇవన్నీ కూడా కెన్యూలే. వీటిలో ఒక్కో రకం తప్పుకు ఒక్కో రకం ప్రతికూల ఫలితం ఉంటుందని ఖొనోమా వాసులు నమ్ముతారు. 

గుమ్మడి కాయను వేలితో చూపిస్తే అది కుళ్లిపోతుందని, అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం వస్తుందని, మన కోసం పని చేసినవారికి సగం జీతమే ఇస్తే, దేవుడు మనకు ఉద్దేశించిన ఆశీర్వాదాలు వారివి అవుతాయని ఖొనోమా గ్రామంలోని అంగామీలు బలంగా నమ్ముతారు. అందుకే నిజాయితీ, సత్యసంధత వారిలో లోతుగా పాతుకుపోయాయి. భారత ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితమే, 2005లో ఖొనోమాను ‘దేశంలోనే మొట్టమొదటి హరిత గ్రామం’గా ప్రకటించింది. అన్నట్లు, గ్రామంలో సమృద్ధిగా పెరిగే ఖ్వునో అనే చిన్న మొక్క పేరు మీద ఈ గ్రామానికి ఖొనోమా అనే పేరు వచ్చిందంటే ముచ్చటగా అనిపిస్తుంది. ప్రకృతికి కట్టుబడి ఉండటం అంటే ఇదే కదా!
– సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement