Kohima
-
Nagaland: నిజాయితీకి చిరునామా!
నాగాలాండ్ రాజధాని ‘కోహిమా’ కదా... నాగాలాండ్‌లోనే, ఇండియా–మయన్మార్ సరిహద్దుల్లో కోహిమాకు పశ్చిమాన 20 కి.మీ. దూరంలో ‘ఖొనోమా’ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం ప్రత్యేకత... గ్రామంలో ఎవరూ అబద్ధాలు ఆడకపోవటం! ఎవరూ దొంగతనం చేయకపోవటం! ఎవరూ ఇళ్లకు తాళాలు వేయకపోవటం! దుకాణాల్లో వాటిని నడిపేవారెవరూ ఉండకపోవటం! ఇలాంటివన్నీ కలిపి ఖొనోమా గ్రామంలో మొత్తం 154 ప్రత్యేకతలు ఉన్నాయి. ‘కెన్యూ’ నిబంధనలు అంటారు వాటిని. ఎవరైనా కెన్యూను దాటి ప్రవర్తించారా... ఇక వాళ్ల పని దైవం చూసుకుంటుందని గ్రామస్థుల నమ్మకం. ఖొనోమా గ్రామం దేశంలోనే ‘నిజాయితీ గల గ్రామం’గా ప్రసిద్ధి చెందింది.ఖొనోమా గ్రామంలో ఉండేదంతా ‘అంగామీ’ తెగవారు. నాగాలాండ్‌కు చెందిన ఒక ప్రధాన సమూహం ఆ తెగ. ‘అంగామీ నాగా’లు అంటారు వారిని. ‘గోల్హో’ వారి ప్రధాన ఆహారం. బియ్యం, హిమాలయాల్లో విస్తృతంగా ఉండే చిమటి కూర కలిపి గోల్హోను తయారు చేస్తారు. అలాగే కూరగాయలు, పందిమాసం, గొడ్డు మాంసం తింటారు. వారిలో దాదాపుగా అందరూ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. 2011 లెక్కల ప్రకారం అక్కడి జనాభా సుమారుగా 2 వేలు. పురుష జనాభా కంటే, స్త్రీ జనాభా పిసరంత ఎక్కువ. గ్రామం ప్రకృతి మధ్యలో ఉంటుంది. ప్రకృతి తన కోసం కట్టుకున్న ఇంటిలా ఆ పచ్చని గ్రామంపై మంచు పరుచుకుని ఉంటుంది. మోసం అనే మాటే ఉండదు!నాగాలాండ్‌లో చాలావరకు గ్రామాలన్నీ ఖొనోమాలా ఉన్నప్పటికీ, ఖొనోమా ప్రజలు ‘కెన్యూ’ నియమాలకు లోబడి జీవించటం మూలాన దేశంలోనే ఈ గ్రామం నిజాయితీ గల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఖొనోమాకు ‘వారియర్ విలేజ్’ అనే పేరు కూడా ఉంది. బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన చరిత్ర వీరిది. ఖొనోమా ప్రజల్లో నిజాయితీ అనేది కేవలం నైతిక ధర్మం మాత్రమే కాదు, అది వారి సామాజిక సంప్రదాయ శక్తి కూడా. నిజాయితీ పట్ల వారి నిబద్ధతే ఆ తెగలో పేద, ధనిక అనే అసమానతలు లేకుండా చేసింది. దొంగతనం అనే మాటే ఆ గ్రామంలో వినిపించదు. దొంగతనం అనేది దేవుడి విషయంలో మనిషి చేసే నేరం అని వారు బలంగా విశ్వసిస్తారు. ఖొనోమాలోని దుకాణాల్లో వినియోగదారులు ఎవరికి కావలింది వారు తీసుకుని, డబ్బులు అక్కడ పెట్టి వెళతారు. ఆ డబ్బుల్ని తీసుకోటానికి, లెక్క చూసుకోటానికి దుకాణంలో పనిగట్టుకుని ఎవరూ ఉండరు. అంత నమ్మకం రాజ్యమేలుతూ ఉంటుంది ఖొనోమా గ్రామంలో! అంతేనా, ఎవరైనా వ్యవసాయదారులు పంటను ఇంటికి మోసుకెళుతున్నప్పుడు అలసిపోతే, వారు ఆ పంటను రోడ్డు పక్కన వదిలి, మరుసటి రోజు వచ్చి తీసుకెళతారు. అప్పటి వరకు ఆ పంట భద్రంగా రహదారి పక్కనే ఉంటుంది. ఎవరైనా తీసుకెళతారన్న భయమే ఉండదు. ‘అనిమిజం’... ఈ గ్రామ మార్గంనిజాయితీ అన్నది వాళ్ల మత విశ్వాసాల్లోనే మిళితమై ఉంది. 19వ శతాబ్దంలో క్రైస్తవ మతం ఇటువైపు వ్యాప్తి చెందటానికి ముందు నుండే ఖొనోమాలోని ఈ అంగామీలు ‘అనిమిజం’ అనే భావనను విశ్వసిస్తూ వస్తున్నారు. నేటికీ ఆ విశ్వాసం కొనసాగుతూ వస్తోంది. అనిమిజం అంటే సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు, ప్రదేశం ప్రత్యేక ఆధ్యాత్మిక సారాన్ని కలిగి ఉంటుందన్న నమ్మకం. ఈ నమ్మకం కేవలం మతపరమైనది కాదు. రోజువారీ జీవితంలో అంతర్భాగం అయిన ఆచారాలు, సంప్రదాయాలు, పర్యావరణానికి హితమైన జీవన విధానం అనిమిజానికి ఆయువు పట్టు. వీటిలోంచి అంగామీల పూర్వీకులు ఏర్పరచిన 154 నిబంధనలే కెన్యూలు. కెన్యూ అనే మాటకు నిషిద్ధం అని అర్థం. వికలాంగులను ఆదరించకపోవటం కెన్యూ. పెద్దల్ని గౌరవించకపోవటం కెన్యూ. మోసం చేయటం, అబద్ధాలాడటం, సాటి మనిషిని తృణీకరించటం వంటివన్నీ కెన్యూలే. ఖొనోమా ప్రజల భావోద్వేగాల రక్తకణాల వంటివి ఈ కెన్యూలు. అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం!దొంగిలించిన పిల్లి మాంసం తినడం కూడా ఒక కెన్యూ. అలా చేస్తే పిల్లి శాపం తగులుతుందని ఖొనోమా గ్రామస్థులు నమ్ముతారు. పెంపుడు పిల్లలను ఆహారం కోసం చంపటం వంటి సంఘటనల నుంచి ఈ కెన్యూ ఆవిర్భవించింది. లంచాలు తీసుకోవటం, మన కోసం పని చేసినవారికి సగం జీతాన్నే చెల్లించటం, అత్తమామల్ని కించపరచటం, గుమ్మడి కాయను వేలితో చూపించటం ఇవన్నీ కూడా కెన్యూలే. వీటిలో ఒక్కో రకం తప్పుకు ఒక్కో రకం ప్రతికూల ఫలితం ఉంటుందని ఖొనోమా వాసులు నమ్ముతారు. గుమ్మడి కాయను వేలితో చూపిస్తే అది కుళ్లిపోతుందని, అత్తమామల్ని కించపరిస్తే పక్షవాతం వస్తుందని, మన కోసం పని చేసినవారికి సగం జీతమే ఇస్తే, దేవుడు మనకు ఉద్దేశించిన ఆశీర్వాదాలు వారివి అవుతాయని ఖొనోమా గ్రామంలోని అంగామీలు బలంగా నమ్ముతారు. అందుకే నిజాయితీ, సత్యసంధత వారిలో లోతుగా పాతుకుపోయాయి. భారత ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితమే, 2005లో ఖొనోమాను ‘దేశంలోనే మొట్టమొదటి హరిత గ్రామం’గా ప్రకటించింది. అన్నట్లు, గ్రామంలో సమృద్ధిగా పెరిగే ఖ్వునో అనే చిన్న మొక్క పేరు మీద ఈ గ్రామానికి ఖొనోమా అనే పేరు వచ్చిందంటే ముచ్చటగా అనిపిస్తుంది. ప్రకృతికి కట్టుబడి ఉండటం అంటే ఇదే కదా!– సాక్షి, స్పెషల్ డెస్క్ -
సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు
కోహిమా: 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్‌విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. -
అట్టుడికిన నాగాలాండ్.. రంగంలోకి ఆర్మీ
-
అట్టుడికిన నాగాలాండ్.. రంగంలోకి ఆర్మీ
కోహిమా: మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ప్రభుత్వానికి, నాగా గిరిజనులకు తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారడంతో నాగాలండ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ సన్నిహితుల ఇళ్లతోపాటు పలు ప్రభుత్వ భవనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితితి చేయిదాటుతున్న తరుణంలో ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రభుత్వ అధాకారులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగారలాండ్లోని 32 మున్సిపాలిటీల ఎన్నికలకు గత నెలలో నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది. దీనిని మెజారిటీ నాగా గిరిజనులు వ్యతిరేకించారు. మహిళలకు కోటా ఇవ్వడం తమ ఆచార,సంప్రదాయాలకు విరుద్ధమని నాగాలు నిరసనలకు దిగారు. రాజ్యాంగంలోని 371(ఎ) అధికరణ తమకు ఆ(మహిళా కోటాను వ్యతిరేకించే హక్కును) కల్పిస్తున్నదని నాగాల వాదన. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఒక దశలో ఎన్నికల వాయిదాకు సరేనన్న జెలియాంగ్ సర్కారు.. చివరికి ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపడంతో నాగాలు ఆగ్రహంతో ఊగిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1న 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలమంది నాగా గిరిజనులు రోడ్లెక్కారు. ఈ క్రమంలోనే పోలీసులకు, నాగాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నాగా యువకులు చనిపోయారు. చనిపోయిన యువకుల మృతదేహాలతో భారీ ర్యాలీ తీసిన నాగాలు.. గురువారం సాయంత్రం నుంచి రాజధాని కోహిమా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దిగ్భంధించారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాలని, కాల్పులు జరిపిన పోలీసులను డిస్మిస్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాత్రికి ఆందోళన కాస్తా హింసాత్మకంగా మారింది. కోహిమా మున్సిపాలిటీ కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి సన్నిహితుల ఇళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం అర్థరాత్రి తర్వాత సైన్యం రంగంలోకి దిగింది. ఐదు శ్రేణుల సైనిక బృందాలు కోహిమాను స్వాధీనం చేసుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం నాగాలాండ్‌లో అల్లర్లేవీ కొనసాగడంలేదని అసోం రైఫిల్స్ అధికార ప్రతినిధి మీడియాకు చెప్పారు. అల్లర్లు వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రమంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఎంతమంది చనిపోయింది, గాయపడింది తెలియాల్సిఉంది. -
సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
-
సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
కొహిమ : మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం దిగి రాకపోవడంతో నాగాలాండ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. డిమపుర్లో సీఎం జిలియంగ్ నివాసంతోపాటూ కొహిమ మున్సిపల్ కౌన్సిల్ బిల్డింగ్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. -
పొగ మీద పగబట్టారు!
స్ఫూర్తి ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా గుర్తుందా? అందులో మద్యపానం కారణంగా నాశనమైపోతున్న ఓ ఊరిని మార్చడానికి హీరో నానా తంటాలు పడతాడు. త్యాగాలు చేస్తాడు. కానీ గరిపెమా గ్రామాన్ని బాగు చేయడానికి ఏ హీరో రాలేదు. ఆ ఊరిలోని ప్రతి వ్యక్తీ ఓ హీరో అయ్యాడు. అందుకే ఇప్పుడు గరిపెమా పేరు రికార్డులకెక్కింది. నాగాల్యాండ్ రాజధాని కోహిమాకి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గరిపెమా గ్రామం. ఒకప్పుడు గరి అనే వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఊరికా పేరు వచ్చింది. మూడొందల కుటుంబాలు, ఓ బడి, ఓ ఆసుపత్రి... ఇంతే ఆ ఊరు. కానీ ఇప్పుడది సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంగా రికార్డు సాధించింది గరిపెమా. మన దేశంలో యేటా 2.200 మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారు. క్యాన్సర్‌తో చనిపోతున్న భారతీయుల్లో నలభై శాతం మంది ధూమపానం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారే. 90 శాతం మందికి నోటి క్యాన్సర్ పొగాకు వల్లే వస్తోంది. నాగాల్యాండ్‌లో కూడా ధూమపానం చేసేవారి సంఖ్య అధికమే. కానీ ఇప్పుడు ఆ ఊళ్లో ఒక్కరు కూడా పొగాకు జోలికి పోవడం లేదు. పొగ తాగాలని పరితపించడం లేదు. గ్రామ పెద్దలు, గ్రామంలోని యువసంఘం, విద్యార్థి సంఘాలు కలిసి ఊరిలో పొగాకు అన్నమాటే వినబడకుండా చేశాయి. అది మాత్రమే కాదు... ఎక్కడా మద్యం, గుట్కా కూడా లభించకుండా చేశారు. గ్రామస్తులెవరైనా పొగతాగితే ఐదు వందలు, మద్యం సేవిస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరివారే కాదు... సందర్శకులకు, ఊరివారి కోసం వచ్చే బంధుమిత్రులు కూడా వీటిని పాటించాల్సిందే. ఈ నియమాలన్నిటినీ రాసిన ఓ పెద్ద బోర్డు గ్రామంలో అడుగుపెట్టగానే కనిపిస్తుంది. అందరూ అత్యంత కచ్చితంగా నియమాలను అనుసరించడంతో భారతదేశంలోనే తొలి పొగాకు రహిత గ్రామంతో గరిపెమా అవతరించింది. దేశంలోని ఇతర ప్రాంతాలన్నిటికీ ఆదర్శంగా నిలబడింది! -
జెలియాంగ్కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. నాగాలాండ్ రాజధాని కోహిమాలోని రాజభవన్లో జెలియాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ అశ్వనీ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జెలియాంగ్తోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పటి వరకు నాగాలాంగ్ ముఖ్యమంత్రిగా ఉన్న నైపూ రియో సీఎం పదవికి, శాసనసభా స్థానానికి శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన నైపూ రియో 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే జెలియాంగ్కు భారతదేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.