ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్‌ అధికారిగా!

MP civil servant Savita Pradhan Gaur success story - Sakshi

గృహ హింసను భరించలేక భర్త నుంచి విడిపోయి, ఆర్థిక భారాన్ని, కన్నీటి సాగరానికి ఎదురీది సక్సెస్‌ను అందుకోవడం మహిళలకు  తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియదేమో. అన్ని ప్రతికూలతలను అధిగమించి అచంచల సంకల్పంతో జీవితాలను మార్చుకోవడంలో వారి పట్టుదల, శ్రమ అసాధారణం. అలాంటి స్ఫూర్తిదాయకమైన మహిళా ఐఏఎస్ అధికారి సక్సెస్‌ స్టోరీ గురించి తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌లోని మండై గ్రామంలోని గిరిజన కుటుంబంలో పుట్టింది సవిత ప్రధాన్‌. ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న ఆ కుటుంబంలో సవితకు  లభించిన స్కాలర్‌షిప్ ఆమె చదువుకు ఆధారం. అలా కష్టపడి 10తరగతి పూర్తి చేసి తన గ్రామంలో టెన్త్‌ చదివిన తొలి అమ్మాయిగా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు 7 కి.మీ దూరంలో కాలేజీలో చేరింది.  ఆమె ఫీజు కట్టేందుకు తల్లి పార్ట్‌ టైం ఉద్యోగం చేసేది. డాక్టర్‌ కావాలన్న ఆశయంతో  సైన్స్‌ని  ఎంచుకుంది. కానీ 16 ఏళ్లు వచ్చాయో లేదో పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు.  బాగా డబ్బున్న కుటుంబం అన్న ఒకే  ఒక్క కారణంతో సవితకు ఇష్టం లేకుండానే ఆమె పెళ్లి జరిగి పోయింది.  ఇక్కడే  సవిత  జీవితం మరో మలుపు తిరిగింది.

పెళ్లి తరువాత జీవితం దుర్బరంగా మారిపోయింది. అటు అత్తమామ వేధింపులు, ఇటు భర్త హింస మొదలైంది. కొట్టి చంపేస్తానని బెదిరించేవాడు భర్త.  గర్భవతిగా ఉన్నపుడు కూడా తిండి సరిగ్గా పెట్టేవారు. రొట్టెల్ని దాచుకుని  దొంగచాటుగా  తినేది.  ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా  ఇది ఆగలేదు.  నరకం  చూసింది. ఈ బాధలు తట్టుకోలేక ఇక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంది. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకోబోతుండగా కిటికీలోంచి అత్తగారు చూసింది. అయినా ఏమాత్రం జాలి చూపలేదు సరిగదా. మరింత వేధించ సాగింది. దీనికి తోడు రాక్షసుడివగా మారిన భర్త చివరికి తన కుమారుడిని కూడా కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో ధైర్యాన్ని కూడగట్టుకున్న సవిత తన పిల్లల కోసం బ్రతకాలని  గట్టిగా భావించింది.

కేవలం 2700రూపాయలతో పిల్లలిద్దరితో ఇంటినుంచి బైటపడింది. తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి బ్యూటీ సెలూన్‌ను మొదలు పెట్టింది. ఇది చాలక పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. ఇళ్లలో పనిచేసేది.. దొరికిన పని అల్లా చేసేది. ఇది ఇలా సాగుతూండగానే  తల్లిదండ్రులు ,తోబుట్టువుల సాయంతో  భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో  బీఏ డిగ్రీ చేసింది.  డిగ్రీ  చదువుతుండగానే  సివిల్ సర్వీసెస్ గురించి తెలిసి వచ్చింది.  మంచి జీతం, జీవితం రెండూ ఉంటాయని గ్రహించింది. ఇక అంతే కృషి, సంకల్పంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. 24 ఏళ్ల వయస్సులో ఏఐఎస్‌ సాధించింది. తొలుత చీఫ్ మున్సిపల్ ఆఫీసర్‌గా ఆ తర్వాత వరుస ప్రమోషన్షను సాధించింది. ప్రస్తుతం, ఆమె గ్వాలియర్  అండ్‌ చంబల్ ప్రాంతాలకు  తొలి  అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 

పెళ్లి కూడా
మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మరో పెళ్లి కూడా చేసుకుంది. అంతేకాదు తనలాంటి  మహిళలకు, అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చేలా ‘హిమ్మత్ వాలీ లడ్కియాన్’ అనే యూట్యూబ్ ఛానెల్  కూడా స్టార్ట్‌ చేసింది. ఏ అమ్మాయి మౌనంగా బాధపడకూడదనేదే ఆమె ఉద్దేశం. తన జీవిత పోరాటాన్నే పాఠంగా బోధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది సవిత.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top