
ఏఐఎన్‌యూలో విభిన్నంగా మాతృదినోత్సవం
కిడ్నీలు దానం చేసిన తల్లులకు ఘనంగా సత్కారం
అమ్మ అంటేనే త్యాగానికి, అంతులేని ప్రేమకు మరోపేరు. అలా త్యాగం చేసి.. తమ కిడ్నీలను తమ పిల్లలకు దానం చేసిన కొంతమంది తల్లులను ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లో మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా, రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను గౌరవించారు.
మాతృదినోత్సవాన్ని ఏఐఎన్‌యూ ఈ సంవత్సరం మరింత పవిత్రంగా చేసింది. తమ పిల్లల జీవితాలు కాపాడేందుకు తమకిడ్నీలు దానం చేసిన తల్లుల గాధలను ఆస్పత్రి ద్వారా అందరికీ పంచింది. ఈ కార్యక్రమంలో వైద్యులు, రోగులు, వారి కుటుంబసభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు.
కిడ్నీ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్న గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లంతా తమ జీవితాలను తల్లులు ఎలా సమూలంగా మార్చేశారో, అంతకుముందు తాము అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడ్డామో తడిగుండెలతో వివరించారు. ఈ సందర్భంగా ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “అవయవదానం అనేది ఒక వ్యక్తి వేరేవారికి చేయగలిగిన అతి గొప్పదానమనీ, ఈ తల్లులు కేవలం పిల్లలను కని, పెంచడమే కాదు.. వాళ్లకు రెండోసారి జీవితం ఇచ్చారని కొనియాడారు. అవయవదానాల్లో, ముఖ్యంగా తల్లి నుంచి వచ్చినప్పుడు కిడ్నీలు ఎక్కువకాలం పనిచేస్తాయి. బాగా సన్నిహితుల నుంచి రావడంతో శరీరం వాటిని తిరస్కరించే అవకాశాలు తక్కువ. రోగులు త్వరగా కోలుకుని, తమ పనులు చేసుకోగలరు” అని చెప్పారు.

సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “మాతృదినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా తల్లులను గౌరవించుకుంటారు. ఈరోజు మనం దీన్ని విభిన్నంగా చేసుకుంటున్నాం. ఈ సన్మానం అనేది మనకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఈ తల్లుల అపూర్వ త్యాగానికి చిన్న నూలుపోగు లాంటిదే” అన్నారు.
సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.ఎస్. వలీ మాట్లాడుతూ, “తమ పిల్లలకు నిస్వార్థంగా తమ సొంత కిడ్నీలు దానం చేసి, వారి ప్రాణాలు రెండోసారి నిలబెట్టిన తల్లులను ఈ మాతృదినోత్సవాన మనం గౌరవించుకుంటున్నాం. తమపిల్లల పట్ల అపార ప్రేమాభిమానాలు చూపించడంతో పాటు, వారికి.. వారి కుటుంబాలకు బంగారు భవిష్యత్తును వీరు అందించారు. వారి త్యాగం తల్లీబిడ్డల మధ్య ఉండే అపురూపమైన బంధానికి, ప్రేమకు ఉండే శక్తికి ఒక నిదర్శనం. వారి అసాధారణ బలం, నిబద్ధతను ఎంతగానో కొనియాడుతున్నాం” అని తెలిపారు.
మాతృప్రేమకు ఉన్న బలాన్ని తాజా పరిశోధన మరోసారి తెలిపింది: పిల్లలకు కిడ్నీలు దానం చేయడంలో తల్లులే ముందు ఉంటున్నారు. పిల్లల కిడ్నీమార్పిడి కేసులలోనూ ఇదే ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలకు, తల్లులకు రోగనిరోధకశక్తి పరంగా ఉండే సానుకూలత, సంరక్షణ బాధ్యతలు, పిల్లల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే భావోద్వేగం.. వీటన్నింటి వల్ల తల్లులు ఇవ్వడమే మంచిది. ఏఐఎన్‌యూలో జరిగే కిడ్నీ మార్పిడుల్లో మూడోవంతు దాతలు తల్లులే అవుతున్నారు.
ఈ సంబరాల్లో ఏఐఎన్‌యూ వైద్య నిపుణులు - సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ సుజీత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (హైటెక్ సిటీ) డాక్టర్ క్రాంతికుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (దిల్‌సుఖ్‌నగర్) డాక్టర్ అనూష గుడిపాటి తదితరులు పాల్గొన్నారు.