mothers day celebrations
-
అమ్మ అంటేనే ఆనందం..!: హీరోయిన్ ప్రణీత.
గాఢ నిద్రలో ఉన్న ప్పుడు కేరింతల శబ్దం... ఆ శబ్దం అమ్మకు ఓ ఆనందం... అన్నం తింటుంటే బుడి బుడి అడుగులతో అల్లరి... అమ్మకు ఇదీ ఆనందం... చిట్టి చేతులు చెంపను తాకుతుంటే... అదో ఆనందం... చిన్నారి నవ్వు... ఓ స్ట్రెస్ బస్టర్. ‘‘కొన్ని త్యాగాలు... ఎన్నో ఆనందాల మధ్య అమ్మ అనే ఈ ప్రయాణం చాలా ఆనందంగా ఉంది’’ అంటున్నారు ప్రణీత. అసలు ‘అమ్మ అంటేనే ఆనందం’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారామె. ఇంకా ‘మదర్స్ డే సందర్భంగా’ ఇద్దరు పిల్లల తల్లిగా తన జీవితం ఎలా ఉందో పంచుకున్నారు హీరోయిన్ ప్రణీత.పెళ్లి కాకముందు, తల్లి కాక ముందు ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు అదనంగా తల్లిగానూ ఫుల్ బిజీ. అయితే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇటు ఫ్యామిలీని చూసుకుంటూనే అటు కెరీర్‌ని కూడా కొనసాగించవచ్చు. నేనలానే చేస్తున్నాను. కానీ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు సినిమాలు కాస్త తగ్గించుకున్నాను. అయితే టీవీ షో, యాడ్స్ చేస్తూ కెరీర్పరంగానూ బిజీగా ఉంటున్నాను. తల్లవగానే ఇంటికి పరిమితం అయిపోవాలన్నట్లుగా ఇప్పుడు ప్రపంచం లేదు. అమ్మాయిలకు కెరీర్ కూడా ముఖ్యమే. పిల్లలు స్కూల్‌కి వెళ్లేవరకూ కెరీర్‌ని పూర్తిగా మానేసుకోకుండా కాస్త స్లో చేసి, ఆ తర్వాత స్పీడప్ చేసుకోవచ్చు. మా పాప అర్నాకి ఇప్పుడు మూడేళ్లు... బాబు జైకృష్ణకి ఇంకా ఏడాది కూడా నిండలేదు. పాపని ప్లే స్కూల్‌కి పంపుతున్నాం. మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళితే మధ్నాహ్నం ఒంటి గంటకు వస్తుంది. ఈలోపు బాబు పనులు పూర్తి చేసేసి, పాపకి ఫుడ్ తయారు చేసి, రాగానే తినిపించేస్తాను. ఆ తర్వాత ఇద్దర్నీ నిద్రపుచ్చుతాను. అప్పుడు నాకు కాస్త తీరిక దొరుకుతుంది. మళ్లీ ఇద్దరూ నిద్ర లేచే సమయానికి ఏదైనా తినిపించడానికి ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత ఆటలు, డిన్నర్ టైమ్, నిద్రపుచ్చడం... ఇలా నా ఆలోచలన్నీ ఏం పెట్టాలి? ఎలా నిద్రపుచ్చాలి... అనేవాటి చుట్టూ తిరుగుతుంటాయి.సెలబ్రిటీ మదర్ అయినా, కామన్ మదర్ అయినా ఎవరైనా తల్లి తల్లే. పనులు చేసి పెట్టడానికి హెల్పర్స్‌ని పెట్టుకున్నప్పటికీ తల్లిగా పిల్లలకు చేయాల్సిన పనులు ఏ తల్లికైనా ఉంటాయి. ఉదాహరణగా చె΄్పాలంటే... పిల్లల బట్టలు మడతపెట్టడానికి, వంట చేయడానికి మనుషులు ఉన్నప్పటికీ పిల్లలకు మాత్రం నేనే తినిపిస్తాను. ‘అమ్మ తినిపిస్తుంది’ అనేది వాళ్లకు అర్థం అవ్వాలి. తినిపించడం, ఆడించడం అన్నీ అమ్మే చేయాలి. పిల్లలకు అర్థమయ్యేవన్నీ అమ్మే చెయ్యాలి.ఒక నటిగా ఫిజిక్‌ని పర్ఫెక్ట్గా మెయిన్టైన్ చేయడం చాలా అవసరం. అయితే తల్లయ్యాక అది సరిగ్గా వీలుపడటం లేదు. ఎందుకంటే ఇంతకు ముందైతే ఓ గంట వర్కవుట్ చేసి, అలసట తీరేంతవరకూ రిలాక్స్ అయ్యేదాన్ని. ఇప్పుడు వర్కవుట్ పూర్తి కాగానే పిల్లల పనులు ఉంటాయి. ఇక, అలసట తీర్చుకునేది ఎప్పుడు? అందుకే ఒక్కోసారి వర్కవుట్స్ మానేస్తున్నాను. అయితే పిల్లల కోసం చేసేది ఏదైనా హ్యాపీగా ఉంటుంది. ఫిజిక్ గురించిన ఆలోచన పక్కకు వెళ్లి΄ోతుంది (నవ్వుతూ). అలాగే కెరీర్ బ్యాక్సీట్లోకి వెళ్లి΄ోవడం సహజం. ఈ ప్రపంచంలో ‘మదర్‌హుడ్’ అనేది బెస్ట్ జాబ్ అని నా ఫీలింగ్. ఆ అద్భుతమైన అనుభూతి కోసం చేసే చిన్ని త్యాగాలు ఆనందాన్నే ఇస్తాయి.పాప పుట్టాక ఏం చేసినా.. పాపకు సౌకర్యంగానే ఉందా? సరిగ్గా చూసుకుంటున్నామా?’ అనిపించేది. బాబు పుట్టాక కూడా అది కంటిన్యూ అవుతోంది. పిల్లలు పెద్దయ్యాక కూడా తల్లికి ఈ డౌట్ ఉంటుందేమో! మొత్తం మీద నాకు అర్థమైందేంటంటే పిల్లలను ఎంత బాగా చూసుకున్నా తల్లికి తృప్తి ఉండదేమో. మావారు (నితిన్ రాజు) వీలు కుదిరినప్పుడల్లా పిల్లలను చూసుకుంటారు. ఇంటికి రాగానే పిల్లలను ప్లే ఏరియాకి తీసుకెళ్లడం, ఆడించడం చేస్తుంటారు. మా పాపను స్విమ్మింగ్‌లో చేర్పించాం. ఆ క్లాస్‌కి తీసుకెళతారు. ఇలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. – డి.జి. భవాని (చదవండి: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!) -
అమ్మంటే బలే ఇష్టం...ఎందుకో చెప్పనా..?
పిల్లలూ... అమ్మంటే ఎందుకు ఇష్టమో ఎప్పుడైనా అమ్మకు చెప్పారా? ప్రేమతో హగ్ చేసుకుని ‘అమ్మా... నువ్వంటే ప్రాణం’ అని చె΄్పారా? అమ్మ అదే మాట మనతో ఎన్నిసార్లు అనుంటుంది. అమ్మ మీద ఇష్టం అమ్మకు చెబుతుండాలి. ఇవాళ ‘మదర్స్ డే’. ఒక కాగితం మీద ‘బెస్ట్ మామ్ ఇన్ ది వరల్డ్’ హెడ్డింగ్ పెట్టి అమ్మ ఎందుకు గొప్పదో రాసి గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేయండిపిల్లలూ... మీకు ‘గమ్’ తెలుసు కదా. అది తనకూ మీకూ పూసి మీతో అంటుకు΄ోవడం తప్ప అమ్మ మీ కోసం అన్నీ చేస్తుంది. మీ ఆకలే తన ఆకలి. మీ నిద్రే తన నిద్ర. మీ నవ్వే తన నవ్వు. మీరు ఎక్కడకు అడుగులు వేసినా ఆమె కళ్లు వెనుకే వస్తుంటాయి. మీరు బయట ఆడుకుంటుంటే ఆమె ఇంట్లో నుంచే మీ ఆటను ఇమాజిన్ చేస్తుంది. మీకు దెబ్బ తగలగానే మీరు వచ్చి చెప్పే ముందే ఆమెకు తెలిసి΄ోతుంది. మీరంటే అంత ఇష్టం అమ్మకు. మరి మీక్కూడా ఇష్టమేగా. మే 11 ‘మదర్స్ డే’ సందర్భంగా పేపర్ మీద ఆ ఇష్టాన్నంతా పెట్టి అమ్మకు ప్రెజెంట్ చేద్దామా. కొందరు పిల్లలు మదర్స్ డేకు అమ్మకు ఎలాంటి లెటర్స్ రాశారో చూడండి. మీరు ఇంకా డిఫరెంట్‌గా ట్రై చేయండి.మై డియర్ మామ్...నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే గాడ్ కంటే ఎక్కువ ఇష్టం. మా క్లాస్‌లో అందరూ సీక్రెట్స్ ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటారు. నేను నీతో చెబుతా. ఎందుకంటే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకోవాల్సి వస్తే నువ్వే ఇంట్లో తెలుగు నేర్పించావు. ఎంత మంచి టీచర్‌వి నువ్వు. మా స్కూల్లో నీ లాంటి టీచర్ ఉంటే అందరూ ఫస్టే. అమ్మా.... నువ్వు సింగర్వా. అప్పుడప్పుడు హమ్ చేస్తుంటావు. నేను వింటుంటాలే. ఆ హమ్ చేసే అమ్మ ఇంకా ఇష్టం నాకు. నీకు మదర్స్ డే హగ్స్.– శ్రావ్య, క్లాస్ 7, మదనపల్లిడియర్ అమ్మా...థ్యాంక్యూ... ఎప్పుడూ కారులో డాడీ పక్కన నన్ను కూచోబెట్టి నువ్వు వెనక కూచుంటావు. డాడీ నిన్ను ముందు కూచోమన్నా పాపకు అక్కడే ఇష్టం’ అంటావు. దారిలో నువ్వే దిగి ఐస్‌క్రీమ్ కొనుక్కొని వస్తావు. నేను బ్యాడ్ కలర్స్‌తో డ్రస్ సెలెక్ట్ చేసుకుంటే మంచి డ్రస్ చూపించి ఇదే బాగుందని ఒప్పిస్తావు. ముందు కోపం వచ్చినా రాను రాను అది నా ఫేవరెట్ డ్రస్ అవుతుంది. అమ్మా... నాకేం కావాలో నీకు అన్నీ తెలుసు. నేను నీ కోసం బాగా చదువుకుని బెస్ట్‌గా ఉంటానని ఈ మదర్స్ డే రోజు ప్రామిస్ చేస్తున్నా. లవ్ యూ.– మౌనిక, క్లాస్ 8, హైదరాబాద్టు మై బెస్ట్ మామ్...అమ్మా... ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ వరల్డ్‌లోకి నన్ను తీసుకు వచ్చినందుకు థ్యాంక్స్. నా కోసం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావో నాకు తెలుసు. ఇంట్లో నువ్వు, నేను మాత్రమే ఉంటాం. డాడీ మనతో లేకున్నా నేను ఆ ఆబ్సెన్స్ ఫీలవకుండా డబుల్ ఎనర్జీతో కష్టపడతావ్. నా ఆథార్ కార్డ్ కరెక్షన్ కోసం నువ్వు పరేషాన్‌గా తిరుగుతుంటే ఏడుపు వచ్చింది. నాకు కొంచెం బాగా లేకున్నా హాస్పిటల్‌కు పరిగెత్తుతావ్. రాత్రంతా నిద్ర పోకుండా చూస్తావ్. నీకు ఎవరూ లేరని అనుకోకు. నేనున్నాను. నాకు నువ్వే మమ్మీవి... డాడీవి. ఐ రెస్పెక్ట్ యూ. cherish every moment we share, and I look forward to many more memories together. హ్యాపీ మదర్స్ డే.– దివ్య, క్లాస్ 10, విజయవాడగుడ్ మార్నింగ్ అమ్మా...మదర్స్ డే రోజు నీ కోసం రాస్తున్న లెటర్ ఇది. ఇలా రాయడం నాకు వెరీ న్యూ. ఏం రాయాలి? నీకు పెట్స్ అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టం. రాకీ గాణ్ణి తెచ్చుకుంటానని అన్నప్పుడు గట్టిగట్టిగా వద్దన్నావ్. నేను హర్ట్ అయ్యి రాత్రంతా ఏడ్చానని ఓన్లీ ఫర్ మీ ఓకే చేశావ్. అదిప్పుడు నాకు మాత్రమే కాదు నీక్కూడా బెస్ట్ ఫ్రెండే. అమ్మా... థ్యాంక్యూ ఫర్ యువర్ అన్‌కండీషనల్ లవ్.– నీ నందు/ఎర్రపండు, క్లాస్ 9, వాల్టేర్మామ్... మొమ్మ... మమ్మ... అమ్మ‘మామ్’ అనే పదం పిల్లల నుంచే వచ్చింది! తల్లిని ‘మామ్’ ‘మొమ్మ’ ‘మమ్మ’ అని పిలిచే పేర్లు ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్నాయి. పసిబిడ్డలు పూర్తిగా మాట్లాడలేని రోజుల్లో చేసే శబ్దాల నుంచే ఈ పేర్లు పుట్టాయి అంటారు భాషావేత్తలు.మదర్నింగ్ సండేస్‘మదర్స్ డే’ మూలాలు పురాతన గ్రీకు, రోమన్ సంప్రదాయాలలో ఉన్నాయి. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో ‘మదర్నింగ్ సండేస్’ రోజు పిల్లలు ఎక్కడ ఉన్నా తమ తల్లి దగ్గరికి వచ్చి ఆమె కోసం కేక్ తయారుచేసేవారు.మదర్స్ డే స్టాంప్తల్లుల గౌరవార్థం అమెరికాలో 1934లో మే 2న వయొలెట్ స్టాంప్‌ను విడుదల చేశారు. జేమ్స్ మెక్ నీల్ విస్లర్ ప్రసిద్ధ కళాఖండం ‘΄ోర్రై్టయిట్ ఆఫ్ మై మదర్’ ఆధారంగా ఈ స్టాంప్‌ను రూ΄÷ందించారు.మదర్ ఆఫ్ మదర్స్ డేవర్జీనియా(అమెరికా)కు చెందిన కాపీరైటర్ అన్నా జార్వీస్కు ‘మదర్ ఆఫ్ మదర్స్ డే’ అని పేరు. అమెరికా అంతర్యుద్ధ కాలంలో జార్వీస్ అమ్మ ఆన్ ఇరువైపుల సైనికులను దృష్టిలో పెట్టుకొని ‘మదర్స్ వర్క్ క్లబ్’లను నిర్వహించేది. యుద్ధ సమయంలో తన తల్లి సాగించిన శాంతి ప్రయత్నాలకు గుర్తుగా, గౌరవార్థంగా ‘మదర్స్ డే’ను ప్రారంభించింది అన్నా జార్వీస్. 1908లో వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్ నగరంలో, ఫిలడెల్ఫియాలో మొదటి అధికారిక ‘మదర్స్ డే’ వేడుకలు మే నెలలోని రెండో ఆదివారం జరిగాయి. మొదటి అధికారిక ‘మదర్స్ డే’ 1914 మే 10న జరిగింది.మదర్స్ డే ప్రేయర్వర్జీనియా(యూఎస్) టేలర్ కౌంటీలోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిని అంతర్జాతీయ మాతృదినోత్సవ మందిరంగా పిలుస్తారు. ‘మదర్స్ డే’ గురించి అన్నా జార్వీస్ ఆలోచించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలో ప్రతి సంవత్సరం ‘మదర్స్ డే’ ప్రార్థన నిర్వహిస్తారు. (చదవండి: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!) -
Mother's Day: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!
తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన ఆర్థోపెడిక్ నిపుణుల్లో డాక్టర్ తేతలి దశరథరామారెడ్డి ఒకరు. తండ్రి నారాయణ రెడ్డి పేరు మీద సొంతూర్లో ఒక ట్రస్ట్ పెట్టి.. అవసరంలో ఉన్న వాళ్లకు వైద్యసహాయం అందిస్తున్నారు. అమ్మ సంకల్పబలం వల్లే తాను డాక్టర్నయ్యానని చెప్పే ఆయన ఇంటర్వ్యూ మదర్స్ డే సందర్భంగా..! ‘‘మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి. మా నాన్న నారాయణ రెడ్డి. ఆ రోజుల్లో బీఏ హానర్స్ చేశారు. అమ్మ అచ్చాయమ్మ.. పెద్దగా చదువుకోలేదు. నాకు రెండున్నరేళ్లున్నప్పుడు మా నాన్న రోడ్ యాక్సిడెంట్ పాలయ్యారు. మేం మొత్తం ఆరుగురం. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లి. అమ్మ మోటివేషన్.. నేను చిన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్‌ని. బాగా అల్లరిచేసే వాడిని కూడా! నేను డాక్టర్ అవడానికి స్ఫూర్తి మా చిన్నాన్న (కంటి డాక్టర్ సత్యనారాయణ రెడ్డి) అయితే మోటివేషన్ మాత్రం అమ్మదే! అమ్మ చాలా డిసిప్లిన్డ్.. కష్టపడే తత్వం.. చాలా ఫోకస్డ్.. డెడికేటెడ్. కమాండింగ్ నేచర్! మమ్మల్ని పొద్దున నాలుగింటికి లేపి చదువుకు కూర్చోబెట్టేది. మాతోపొటే తనూ కూర్చుని.. మేం చదువుకుంటుంటే ఆమె రామకోటి రాసేది. అమ్మ ఆశయమల్లా మాలో ఎవరినైనా డాక్టర్ చేయాలన్న నాన్న కోరికను నెరవేర్చడమే! ఏమాత్రం చదువును నిర్లక్ష్యం చేసినా.. మా చిన్నాన్నను ఉదాహరణగా చూపిస్తూ చక్కగా చదువుకుంటే అలా గౌరవం పొందుతారని చెప్పేది! మా బద్ధకాన్ని ఏమాత్రం సహించేది కాదు. తండ్రిలేని పిల్లలు కదా.. తనేమాత్రం అశ్రద్ధ చేసినా పాడైపోతారనే భయం అమ్మకు. అందుకే మమ్మల్ని పెంచడంలో ఎక్కడా రాజీ పడలేదు ఆవిడ. గారాబం గారాబమే. స్ట్రిక్ట్‌నెస్ స్ట్రిక్ట్నెసే! బద్ధకం అనేది ఆమె డిక్షనరీలో లేదు. ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి అనేవారు. మా అందరినీ సమర్థులైన ఇండివిడ్యువల్స్‌గా తయారు చేశారు. ఇటు మరుదులు.. అటు తమ్ముళ్లు అందరూ ఆమె మాటను గౌరవించేవారు. నిజానికి మా ఇంట్లో నానమ్మ తర్వాత మా మేనత్త మాణిక్యం. ఆ తర్వాత అమ్మే! నాన్న లేకపోయినా ఆ ఉమ్మడి కుటుంబాన్ని చెదరనివ్వలేదు అమ్మ. అందుకే చిన్నాన్నలకు అమ్మంటే చాలా గౌరవం. అలా అమ్మ మోటివేషన్, నాన్న కోరిక, చిన్నాన్న స్ఫూర్తితో నేను డాక్టర్‌ను అయ్యాను. మా మేనమామలకైతే ఆవిడ వాళ్లమ్మతో సమానం. మేమెప్పుడైనా అమ్మను చిన్నగా విసుక్కున్నా మా మేనమామలు మమ్మల్ని కేకలేసేవారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా.. ఇంట్లోకి రావడం రావడమే తిరుగు ప్రయాణానికి టికెట్ ఎప్పుడు రిజర్వ్ చేస్తావని అడిగేది. ఆ రావడం కూడా ఒంట్లో బాలేక΄ోతేనే వచ్చేది. ఆసుపత్రిలో చూపించుకుని వెంటనే వెళ్లిపోయేవారు. ఎంత అడిగినా ఉండేవారు కారు. ఎక్కువగా తన తమ్ముళ్లతో ఉండటానికి ఇష్టపడేవారు. మా అమ్మ విషయంలో నాకున్న ఒకే ఒక అసంతృప్తి.. మా ఇంట్లో ఇప్పుడు దాదాపు 17 మంది దాకా డాక్టర్లున్నారు. అమ్మ మా సక్సెస్ చూశారు కానీ.. మా పిల్లల సక్సెస్ చూడకుండానే పోయారు. 2016లో చనిపోయారావిడ.మహాగొప్ప మేనమామలు..మా నాన్నగారు పోయాక అమ్మ మానసికంగా కుంగిపోతే.. అమ్మమ్మ వాళ్లు తీసుకెళ్లి కొన్నాళ్లు అక్కడే పెట్టుకున్నారు. అప్పుడు అమ్మను కంటికి రెప్పలా కాచుకుంది మా మేనమామలే! ఆ కష్టకాలంలో మా ఫ్యామిలీ నిలబడ్డానికి ప్రధాన కారణం మా అమ్మమ్మ గారి కుటుంబమే! మా అమ్మాయి డాక్టర్. అమెరికాలో మాస్టర్స్ చేస్తోంది. అబ్బాయేమో ఆస్ట్రేలియాలో సప్లయ్ అండ్ చైన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేస్తున్నారు. నా భార్య సింధు. హోమ్ మేకర్. ఆమె కూడా అమ్మలాగే మంచి డిసిప్లిన్డ్. ఈ విషయంలో ఆమె మీద అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. గ్రేట్ మదర్. మా పెద్ద కుటుంబంలో చక్కగా ఇమిడిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే సింధు.. స్వీట్ హార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ.’’– సరస్వతి రమ (చదవండి: అమ్మ మనసు తెలుసా?) -
Mother's Day 2025: అమ్మ మనసు తెలుసా?
‘ఏంటమ్మా నీ గోల? నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసులే?’ అనే పిల్లల ధిక్కారాలు అమ్మకు కొత్తేం కాదు. ‘పదే పదే ఫోన్ చేసి విసిగించకమ్మా.. ఆకలేస్తే నేను తింటా కదా? నువ్వు అడగాలా?’లాంటి పోట్లాటలు, ఆమెకు వింతా కాదు. అయినా మన కోసమే తపిస్తుంది. మనం బాగుండాలని భరిస్తుంది. ‘అయ్యో పాపం అమ్మ తిన్నదో లేదో?’ అని మనమెలాగో కుశలం కనుక్కోము సరికదా, ఆమె కుశలమడిగితే టైమ్ లేదన్న సాకుతోనో, బిజీగా ఉన్నామన్న వంకతోనో, నోటికొచ్చిన సమాధానాలిచ్చి బాధపెడతాం. ఇంతటి జీవితాన్నిచ్చిన అమ్మకు నిజంగానే కాసింత సమయాన్ని కేటాయించలేమా? అసలు అమ్మకు ఏం కావాలి? ఆమె మనసును ఎలా తెలుసుకోవాలి?ప్రయత్నిస్తే అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా అర్థమయ్యేది అమ్మే. నిజానికి అమ్మ మనసు తెలుసుకోవాలన్న మన ఆలోచనతోనే ఆమె ఆనందం మొదలవుతుంది. మన ఈ ప్రయత్నమే ఆమెకు, అసలు సిసలు బహుమానమవుతుంది.అమ్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆమెను మాట్లాడనిద్దాం. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో కాస్త శ్రద్ధగా విందాం. ఆమె మాటల్లోని భావాలను గ్రహించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనకు ఆమె గురించి ఇంకెన్నో విషయాలు తెలుస్తాయి.అమ్మ చేసే పనులను గమనిద్దాం. అప్పుడు ఆమె దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుందో? ఆమెకు ఏది ఇష్టమో? ఏది ఇష్టం లేదో? ఆమె దేని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుందో? ఇలా ఆమె గురించి మరింత అర్థమవుతుంది.అమ్మ మనసుని సరదాగా మధ్యమధ్యలో కదిలిద్దాం. తన జీవితంలో పొందిన ఆనందాలనో, ఆమె తన కన్నవాళ్లతో గడిపిన క్షణాలనో, ఆమె ఎదుర్కొన్న కష్టాలనో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఆమె మనసు, ఆమె దృక్పథం మనకు మరింత బోధపడతాయి.మనం తీసుకునే కొన్ని నిర్ణయాల్లో అమ్మను సలహా అడుగుదాం. అలాంటప్పుడు ఆమె ఆలోచనా విధానం మనకు ఇంకా బాగా తెలుస్తుంది. పైగా ఆ సలహా మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆమెకు మనం ఇచ్చే విలువేమిటో ఆమెకూ అర్థమవుతుంది.అమ్మకు దూరంగా ఉంటే రోజుకొక్కసారైనా ఫోన్ చేసి ప్రేమతో పలకరిద్దాం. మనస్పూర్తిగా మాట కలుపుదాం. మన మనసులో ఆమె స్థానం పదిలమేనన్న సంగతి తెలియపరుద్దాం. ఆ రోజులో మనం అందుకున్న ప్రశంసల గురించో, మనం చేసిన పనుల గురించో, వెళ్లిన ప్రదేశాల గురించో ఆమెతో పంచుకుందాం. వీలు కుదిరినప్పుడు అమ్మతో కలిసి భోజనం చేద్దాం. టీవీ చూద్దాం. షాపింగ్‌కో, సినిమాకో తీసుకెళ్దాం. అలా చేస్తే బంధం మరింత బలపడుతుంది. ఆమెకు మన సమయాన్ని కేటాయించడం కూడా, ఆమె ఓ బహుమతిగానే భావిస్తుంది.అమ్మకు చిన్నచిన్న పనుల్లో సాయం చేయడం అలవాటు చేసుకుందాం. అలాగే కోపంలో అరవడం, గొడవ పడటం, అభిప్రాయాలు వేరుకావటం సహజమే. కాని, దానికి ఏదో ఒక సమయంలో క్షమాపణలు చెప్పడం నేర్చుకుందాం. మన తిరస్కారానికి కారణాలను సున్నితంగా వివరిద్దాం.ఏదో ఒక సందర్భంలో అమ్మకు కృతజ్ఞతలు తెలుపుదాం. జీవితంలో ఉన్నతమైన మెట్లు ఎక్కినప్పుడో, అత్యంత ఆనందంగా ఉన్నప్పుడో అమ్మనోసారి ప్రేమగా పలకరిద్దాం. వీలైతే ఆ క్షణంలోనే ఆమెకు ఐలవ్యూ చెబుదాం. దానికంటే ఆమెకు విలువైన బహుమతి మరొకటి ఉండదు.ఏది ఏమైనా జన్మజన్మలకు తీరని రుణపాశమే అమ్మప్రేమ. ప్రాణం పోసుకోకముందే ముడిపడిన ఆ పేగు బంధానికి, ప్రాణాలేం ధారబోయక్కర్లేదు. చూపులో ప్రేమ, పిలుపులో ధీమా కనిపించేలా స్పందిస్తే చాలు, తిరుగులేని ఆమె ఆశీర్వచనాలు.. జీవితాంతం దేవదూతలై కాపాడతాయి. యముడితోనైనా పోరాడతాయి. అంతటి వాత్సల్యాన్ని పంచే అమ్మకు.. బహుమానాలేం అక్కర్లేదు. మనం ఎంత ఎదిగినా, అమ్మ ఒడిలో ఒదిగే పసిమనసుని వదులుకోకపోతే చాలు. అమ్మకు సరైన ప్రతిఫలాన్ని అందించినట్లే అవుతుంది.∙సంహిత నిమ్మన -
Mother's day 2025 అమ్మ ఇచ్చిన రెండో జీవితం
అమ్మ అంటేనే త్యాగానికి, అంతులేని ప్రేమకు మరోపేరు. అలా త్యాగం చేసి.. తమ కిడ్నీలను తమ పిల్లలకు దానం చేసిన కొంతమంది తల్లులను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లో మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా, రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను గౌరవించారు.మాతృదినోత్సవాన్ని ఏఐఎన్‌యూ ఈ సంవత్సరం మరింత పవిత్రంగా చేసింది. తమ పిల్లల జీవితాలు కాపాడేందుకు తమకిడ్నీలు దానం చేసిన తల్లుల గాధలను ఆస్పత్రి ద్వారా అందరికీ పంచింది. ఈ కార్యక్రమంలో వైద్యులు, రోగులు, వారి కుటుంబసభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు.కిడ్నీ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్న గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లంతా తమ జీవితాలను తల్లులు ఎలా సమూలంగా మార్చేశారో, అంతకుముందు తాము అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడ్డామో తడిగుండెలతో వివరించారు. ఈ సందర్భంగా ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “అవయవదానం అనేది ఒక వ్యక్తి వేరేవారికి చేయగలిగిన అతి గొప్పదానమనీ, ఈ తల్లులు కేవలం పిల్లలను కని, పెంచడమే కాదు.. వాళ్లకు రెండోసారి జీవితం ఇచ్చారని కొనియాడారు. అవయవదానాల్లో, ముఖ్యంగా తల్లి నుంచి వచ్చినప్పుడు కిడ్నీలు ఎక్కువకాలం పనిచేస్తాయి. బాగా సన్నిహితుల నుంచి రావడంతో శరీరం వాటిని తిరస్కరించే అవకాశాలు తక్కువ. రోగులు త్వరగా కోలుకుని, తమ పనులు చేసుకోగలరు” అని చెప్పారు.సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “మాతృదినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా తల్లులను గౌరవించుకుంటారు. ఈరోజు మనం దీన్ని విభిన్నంగా చేసుకుంటున్నాం. ఈ సన్మానం అనేది మనకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఈ తల్లుల అపూర్వ త్యాగానికి చిన్న నూలుపోగు లాంటిదే” అన్నారు.సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.ఎస్. వలీ మాట్లాడుతూ, “తమ పిల్లలకు నిస్వార్థంగా తమ సొంత కిడ్నీలు దానం చేసి, వారి ప్రాణాలు రెండోసారి నిలబెట్టిన తల్లులను ఈ మాతృదినోత్సవాన మనం గౌరవించుకుంటున్నాం. తమపిల్లల పట్ల అపార ప్రేమాభిమానాలు చూపించడంతో పాటు, వారికి.. వారి కుటుంబాలకు బంగారు భవిష్యత్తును వీరు అందించారు. వారి త్యాగం తల్లీబిడ్డల మధ్య ఉండే అపురూపమైన బంధానికి, ప్రేమకు ఉండే శక్తికి ఒక నిదర్శనం. వారి అసాధారణ బలం, నిబద్ధతను ఎంతగానో కొనియాడుతున్నాం” అని తెలిపారు.మాతృప్రేమకు ఉన్న బలాన్ని తాజా పరిశోధన మరోసారి తెలిపింది: పిల్లలకు కిడ్నీలు దానం చేయడంలో తల్లులే ముందు ఉంటున్నారు. పిల్లల కిడ్నీమార్పిడి కేసులలోనూ ఇదే ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలకు, తల్లులకు రోగనిరోధకశక్తి పరంగా ఉండే సానుకూలత, సంరక్షణ బాధ్యతలు, పిల్లల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే భావోద్వేగం.. వీటన్నింటి వల్ల తల్లులు ఇవ్వడమే మంచిది. ఏఐఎన్‌యూలో జరిగే కిడ్నీ మార్పిడుల్లో మూడోవంతు దాతలు తల్లులే అవుతున్నారు.ఈ సంబరాల్లో ఏఐఎన్‌యూ వైద్య నిపుణులు - సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ సుజీత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (హైటెక్ సిటీ) డాక్టర్ క్రాంతికుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (దిల్సుఖ్నగర్) డాక్టర్ అనూష గుడిపాటి తదితరులు పాల్గొన్నారు. -
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్‌లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్‌లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్‌లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్‌గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్‌ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్‌కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్‌ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్‌లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్‌ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్‌తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్‌కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్‌లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్‌తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్‌ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్‌తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్‌లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్‌తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్‌లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్‌లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్‌తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్‌కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్‌లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్‌డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్‌లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. -
Mothers Day: అమ్మలుగా.. అధికారులుగా
నల్గొండ: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ పమేలా సత్పతి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె తన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటున్న తీరు ఆదర్శనీయం. తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. ఆ తర్వాత ప్రాథమిక విద్య కోసం స్థానిక ప్రైవేట్ పాఠశాలలో దగ్గరుండి చేర్పించారు. కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఇతర అంశాలపై పట్టు దొరికే విధంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. పలుచోట్లకు తనతో పాటు తీసుకెళ్లి తల్లి మమకారాన్ని పంచుతున్నారు. మొత్తంగా కలెక్టర్‌గా బిజీగా ఉంటూనే తన బిడ్డ బాగోగులను ఎప్పటి కప్పుడు చూసుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న సమ యంలోనూ పమేలా సత్పతి తన చిన్న బాబుతోనే వార్డుల్లో పరిశీలనకు వెళ్లేవారు. బాలికలకు ‘రక్ష స్నేహిత’ సమాజంలో మహిళలు, బాలికలు నిత్యం ఏదో ఓ చోట హింసకు గురవుతూనే ఉన్నారు. భద్రతపై వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కలెక్టర్ పమేలా సత్పతి ‘రక్ష స్నేహిత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అధికారులను, ప్రజాప్రతినిధులను, వైద్యారోగ్య సిబ్బందిని భాగస్వాములను చేస్తున్నారు. విద్యార్థినులు వేధింపులకు గురైన సమయంలో ఎలా స్పందించాలి.. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ కాన్సెప్ట్‌తో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లే.. మార్గదర్శకురాలు కలెక్టర్ పమేలా సత్పతికి తన తల్లి మార్గదర్శకురాలు. చిన్నపటి నుంచే చనువు ఎక్కువ. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆమె.. ప్రతి చిన్న అంశాన్ని కూడా తల్లితో పంచుకునేవారు. బిడ్డ చెప్పిన ప్రతి అంశాన్ని తల్లి తన మనసులో పెట్టుకుని మంచి చేసే అంశాలను తెలియజేసేవారు. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రుల స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే ఐఏఎస్ సాధించానంటున్నారు పమేలా సత్పతి. శాంతిభద్రతలు కాపాడడంలో తనదైన ముద్ర వేస్తూనే.. ఏడాదిలోపు వయసున్న తన ఇద్దరు (కవలలు) పిల్లల పెంపకంలో తల్లిగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు నల్లగొండ ఎస్పీ అపూర్వరావు. విధుల్లో భాగంగా పిల్లలకు దూరంగా ఉండాల్సిన సమయంలో తన తల్లి లేదా అత్తను వారి వద్ద ఉంచి పిల్లల బాగోగులు చూసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఖాళీ సమయంలో పిల్లలతోనే ఎక్కువగా గడుపుతారు. జిల్లాలో గంజాయిని అదుపు చేయడంలో, అంతరాష్ట్ర ముఠా దొంగల ఆటకట్టించడంలో ఎస్పీగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. సమస్య ఉందని గ్రీవెన్స్‌డేలో తన వద్దకు వచ్చే వారికి భరోసా కల్పిస్తున్నారు. షీటీంను పటిష్టం చేసి ఆకతాయిల ఆగడాలను కట్టడి చేశారు. సామాజిక మాద్యమాల ద్వారా మోస పోకుండా ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. విధుల్లో భాగంగా ఎంత బిజీగా ఉన్న ముందుగానే ప్రణాళికలు వేసుకుని.. తన పిల్లలతో గడిపేందుకు కూడా సమయం ఇస్తున్నారు. పిల్లలతో గడపడం ఇష్టం అమ్మ తోడుంటే జీవితం బంగారుమయంగా మరుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ప్రతిఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర కీరోల్గా ఉంటుంది. క్రమశిక్షణ, చదువు, భవిష్యత్‌కు తల్లే మార్గదర్శిగా నిలుస్తుంది. తల్లిగా నేను ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసూ్తనే విధులు నిర్వహిస్తున్నాను. నాకు పిల్లలు దూరంగా ఉన్నప్పుడు వీలైనంత తొందరగా.. వారి దగ్గరకు చేరేలా ప్లాన్ చేసుకుంటా. అమ్మ ఆర్థిక స్వావలంబన సాధిస్తేనే.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వగలుగుతుంది. – అపూర్వరావు, ఎస్పీ -
అమ్మ గొప్పతనాన్ని చాటిన నాట్స్ వెబినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మల గొప్పతనాన్ని చాటేలా వెబినార్ నిర్వహించింది. తల్లి ప్రేమను తమ బిడ్డలకే కాకుండా చాలా మంది, అమ్మ ప్రేమను పంచుతున్న కొందరు తల్లులతో కలిపి ఈ వెబినార్ నిర్వహించింది. రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో అమ్మ పాత్రే కీలకమని ఈ సందర్భంగా మాతృమూర్తులు వివరించారు. ఈ వెబినార్ ప్రాముఖ్యతను జ్యోతి వనం వివరించారు. శర్వాణి సాయి గండూరి అమ్మ మీద పాడిన పాటతో ఈ వెబినార్ ప్రారంభమైంది. కవిత తోటకూర ఈ వెబినార్ కు ప్రధాన వ్యాఖ్యతగా వ్యవహరించారు. కృష్ణవేణి శర్మ, రాధ కాశీనాధుని, ఉమ మాకం లు అమ్మగా తమ అనుభవాలను వివరించారు. శ్రీక అలహరితో పాటు కొంతమంది చిన్నారులు అమ్మలపై వ్రాసిన కవితలు ఈ వెబినార్‌లో స్వయంగా వారే చదవి వినిపించారు. అమ్మ పట్ల తమ ప్రేమను చాటారు. అమ్మల అనుభవాలు, త్యాగాలు తెలుసుకుంటే మనలో అది ఎంతో కొంత స్ఫూర్తిని రగిలిస్తుందనే ఉద్ధేశంతోనే ఈ వెబినార్‌ను చేపట్టామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ అరుణ గంటి అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మజ నన్నపనేని, లక్ష్మి బొజ్జ, గీత గొల్లపూడి, దీప్తి సూర్యదేవర, ఉమ మాకం, బిందు యలమంచిలి తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ నాయకులు శ్రీనివాస్ కాకుమాను, రవి గుమ్మడిపూడి, మురళీకృష్ణ మేడిచెర్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ వెబినార్‌కు తమ వంతు సహకారం అందించారు. అమ్మల అనుభవాలను నేటి తరానికి పంచిన ఇంత చక్కటి వెబినార్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ధన్యవాదాలు తెలిపారు. చదవండి: న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్ -
వెటా ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు
విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్ విజయవంతంగా ముగిశాయి. మే 16 న మేరీల్యాండ్ హానోవర్‌లో నిర్వహించిన వేడుకలకి దాదాపు ఆరువందల మందికి పైగా సభ్యులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లోకల్ బ్యాండ్ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు చాలా బహుమతులను అందజేశారు. అలాగే ఆహుతులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు. ఈ మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరిలతో పాటు వెటా మేరీల్యాండ్ చాప్టర్ కార్యవర్గం నిర్విరామంగా కృష్టి చేసింది. ఈ కార్యక్రమంలో వెటా మీడియా నేషనల్ ఛైర్ పర్సన్ సుగుణారెడ్డి, స్థానిక వెటా సభ్యులు ప్రీతీ రెడ్డి, యామిని రెడ్డి , నవ్యస్మృతి , జయలతో పాటు స్థానిక కమ్యూనిటీ లీడర్స్ సుధా కొండెపి, కవిత చల్ల, శ్రీధర్ నాగిరెడ్డి , డాక్టర్ పల్లవి , రామ్మోహన్ కొండా, యోయో టీవీ నరసింహ రెడ్డి అనిత ముత్తోజు , అపర్ణ కడారి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వెటా స్థానిక కార్యవర్గాన్ని ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అభినందించారు. తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసం మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) సంస్థను రెండేళ్ల కిందట ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేశారు. మహిళకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకత (క్రియేటివిటీ)ను పెంచి వారి కలలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలని ఉద్దేశ్యంతో ఝాన్సీరెడ్డి ఈ సంఘం స్థాపించారు. మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తోంది. చదవండి: న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్ -
‘మదర్స్ డే’ నాడు అమ్మకు కేక్ కొనాలని వెళ్తూ..
నరసరావుపేట రూరల్: మదర్స్ డే సందర్భంగా అమ్మను సంతోషపెట్టాలని కేక్ కొనేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు చేరారు. ఈ విషాద ఘటన మాతృ దినోత్సవం నాడు ఇద్దరు తల్లులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. వివరాలు.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురం గ్రామానికి చెందిన మలతోటి వెంకిబాబు (19), వేమర్తి ఏసుబాబు (17)లు ఆదివారం మదర్స్ డే సందర్భంగా కేక్ కొనేందుకు బైక్‌పై నరసరావుపేటకు వస్తుండగా కేసానుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద ఈద్గా వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో వెంకిబాబు ఐటీఐ చదువుతుండగా, ఏసుబాబు పదో తరగతిలో చేరాల్సి ఉంది. వెంకిబాబుకు తల్లిదండ్రులు వెంకటరావు, వజ్రమ్మ, ఒక సోదరి ఉన్నారు. ఏసుబాబు తల్లిదండ్రులు సుధాకరరావు, పుష్పలీలలకు అతనొక్కడే సంతానం. మాతృదినోత్సవం నాడే కొడుకును కోల్పోవాల్సి రావడంతో కన్నవారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ టి.సూర్యనారాయణరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ దేవత వంటిది: విప్ సునీత
యాదగిరిగుట్ట: సృష్టిలో అమ్మ దేవతవంటిది ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని తన నివాసంలో ఆమె కేక్ కేట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమ్మలేని సృష్టి ఊహించలేనిదని ఆమె అన్నారు. దేవత వంటి అమ్మను నేడు పిల్లలు రోడ్డున పడేస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా అమ్మను ప్రేమగా చూసుకోవాలని ఆమె సూచించారు.