
మే 11మదర్స్ డే
‘ఏంటమ్మా నీ గోల? నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసులే?’ అనే పిల్లల ధిక్కారాలు అమ్మకు కొత్తేం కాదు. ‘పదే పదే ఫోన్ చేసి విసిగించకమ్మా.. ఆకలేస్తే నేను తింటా కదా? నువ్వు అడగాలా?’లాంటి పోట్లాటలు, ఆమెకు వింతా కాదు. అయినా మన కోసమే తపిస్తుంది. మనం బాగుండాలని భరిస్తుంది. ‘అయ్యో పాపం అమ్మ తిన్నదో లేదో?’ అని మనమెలాగో కుశలం కనుక్కోము సరికదా, ఆమె కుశలమడిగితే టైమ్ లేదన్న సాకుతోనో, బిజీగా ఉన్నామన్న వంకతోనో, నోటికొచ్చిన సమాధానాలిచ్చి బాధపెడతాం. ఇంతటి జీవితాన్నిచ్చిన అమ్మకు నిజంగానే కాసింత సమయాన్ని కేటాయించలేమా? అసలు అమ్మకు ఏం కావాలి? ఆమె మనసును ఎలా తెలుసుకోవాలి?
ప్రయత్నిస్తే అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా అర్థమయ్యేది అమ్మే. నిజానికి అమ్మ మనసు తెలుసుకోవాలన్న మన ఆలోచనతోనే ఆమె ఆనందం మొదలవుతుంది. మన ఈ ప్రయత్నమే ఆమెకు, అసలు సిసలు బహుమానమవుతుంది.
అమ్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆమెను మాట్లాడనిద్దాం. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో కాస్త శ్రద్ధగా విందాం. ఆమె మాటల్లోని భావాలను గ్రహించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనకు ఆమె గురించి ఇంకెన్నో విషయాలు తెలుస్తాయి.
అమ్మ చేసే పనులను గమనిద్దాం. అప్పుడు ఆమె దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుందో? ఆమెకు ఏది ఇష్టమో? ఏది ఇష్టం లేదో? ఆమె దేని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుందో? ఇలా ఆమె గురించి మరింత అర్థమవుతుంది.
అమ్మ మనసుని సరదాగా మధ్యమధ్యలో కదిలిద్దాం. తన జీవితంలో పొందిన ఆనందాలనో, ఆమె తన కన్నవాళ్లతో గడిపిన క్షణాలనో, ఆమె ఎదుర్కొన్న కష్టాలనో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఆమె మనసు, ఆమె దృక్పథం మనకు మరింత బోధపడతాయి.
మనం తీసుకునే కొన్ని నిర్ణయాల్లో అమ్మను సలహా అడుగుదాం. అలాంటప్పుడు ఆమె ఆలోచనా విధానం మనకు ఇంకా బాగా తెలుస్తుంది. పైగా ఆ సలహా మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆమెకు మనం ఇచ్చే విలువేమిటో ఆమెకూ అర్థమవుతుంది.
అమ్మకు దూరంగా ఉంటే రోజుకొక్కసారైనా ఫోన్ చేసి ప్రేమతో పలకరిద్దాం. మనస్పూర్తిగా మాట కలుపుదాం. మన మనసులో ఆమె స్థానం పదిలమేనన్న సంగతి తెలియపరుద్దాం. ఆ రోజులో మనం అందుకున్న ప్రశంసల గురించో, మనం చేసిన పనుల గురించో, వెళ్లిన ప్రదేశాల గురించో ఆమెతో పంచుకుందాం.
వీలు కుదిరినప్పుడు అమ్మతో కలిసి భోజనం చేద్దాం. టీవీ చూద్దాం. షాపింగ్‌కో, సినిమాకో తీసుకెళ్దాం. అలా చేస్తే బంధం మరింత బలపడుతుంది. ఆమెకు మన సమయాన్ని కేటాయించడం కూడా, ఆమె ఓ బహుమతిగానే భావిస్తుంది.
అమ్మకు చిన్నచిన్న పనుల్లో సాయం చేయడం అలవాటు చేసుకుందాం. అలాగే కోపంలో అరవడం, గొడవ పడటం, అభిప్రాయాలు వేరుకావటం సహజమే. కాని, దానికి ఏదో ఒక సమయంలో క్షమాపణలు చెప్పడం నేర్చుకుందాం. మన తిరస్కారానికి కారణాలను సున్నితంగా వివరిద్దాం.
ఏదో ఒక సందర్భంలో అమ్మకు కృతజ్ఞతలు తెలుపుదాం. జీవితంలో ఉన్నతమైన మెట్లు ఎక్కినప్పుడో, అత్యంత ఆనందంగా ఉన్నప్పుడో అమ్మనోసారి ప్రేమగా పలకరిద్దాం. వీలైతే ఆ క్షణంలోనే ఆమెకు ఐలవ్యూ చెబుదాం. దానికంటే ఆమెకు విలువైన బహుమతి మరొకటి ఉండదు.
ఏది ఏమైనా జన్మజన్మలకు తీరని రుణపాశమే అమ్మప్రేమ. ప్రాణం పోసుకోకముందే ముడిపడిన ఆ పేగు బంధానికి, ప్రాణాలేం ధారబోయక్కర్లేదు. చూపులో ప్రేమ, పిలుపులో ధీమా కనిపించేలా స్పందిస్తే చాలు, తిరుగులేని ఆమె ఆశీర్వచనాలు.. జీవితాంతం దేవదూతలై కాపాడతాయి. యముడితోనైనా పోరాడతాయి. అంతటి వాత్సల్యాన్ని పంచే అమ్మకు.. బహుమానాలేం అక్కర్లేదు. మనం ఎంత ఎదిగినా, అమ్మ ఒడిలో ఒదిగే పసిమనసుని వదులుకోకపోతే చాలు. అమ్మకు సరైన ప్రతిఫలాన్ని అందించినట్లే అవుతుంది.
∙సంహిత నిమ్మన