Mother's Day 2025
-
40 ఏళ్లుగా అన్నీ తానై..
పటాన్చెరు టౌన్: దివ్యాంగులైన ఇద్దరు కుమారులను 40 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ మాతృమూర్తి. లేచింది మొదలు వారి సేవలోనే జీవితం గడుపుతోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం రోడ్డులో వృద్ధురాలైన చంద్రకళ నివిస్తోంది. భర్త మడపతి చంద్రయ్య 2009 లో మృతి చెందాడు. నలుగురు కుమారులు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కొడుకు రాజశేఖర్, కూతురు భాగ్యలక్ష్మి బాగానే ఉన్నారు. మిగతా నలుగురిలో కూతురు ఉమరాణి పుట్టుకతోనే మూగ. మిగతా ముగ్గురు కుమారులు సిద్ధప్ప, మహేశ్వర్, రవికుమార్లకు చిన్నప్పుడే కాళ్లు, చేతులు పడిపోయాయి. మాటలు రాని ఉషారాణి సైతం ప్రస్తుతం తల్లి మీదే ఆధారపడింది. మూడేళ్ల క్రితం రెండో కుమారుడైన మహేశ్వర్ మృతి చెందాడు. ఉన్న ఇద్దరు కుమారులకు, కూతురుకు ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకు సేవలు చేస్తూ కాలం గడుపుతోంది వృద్ధురాలు.పెన్షనే ఆధారం.. అయితే వీరి జీవనాధారం.. తల్లి తోపాటు ఇద్దరు కుమారులకు వచ్చే పెన్షన్ మొత్తం రూ.10 వేల తోనే నెల మొత్తం గడపాల్సి వస్తోంది. అప్పుడప్పుడు దాతలు వచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చి వెళ్తారని ఆ తల్లి తెలిపారు. తమ తల్లి 40 ఏళ్లకు పైగా తమను చూసుకుంటుందని, చిన్నపిల్లలను చూసుకునే విధంగా రోజూ స్నానం చేయించి, భోజనం తినిపించి ప్రేమగా చూసుకునే తల్లి దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని కుమారులు సిద్దప్ప, రవికుమారులు అంటున్నారు. -
అమ్మ అంటేనే ఆనందం..!: హీరోయిన్ ప్రణీత.
గాఢ నిద్రలో ఉన్న ప్పుడు కేరింతల శబ్దం... ఆ శబ్దం అమ్మకు ఓ ఆనందం... అన్నం తింటుంటే బుడి బుడి అడుగులతో అల్లరి... అమ్మకు ఇదీ ఆనందం... చిట్టి చేతులు చెంపను తాకుతుంటే... అదో ఆనందం... చిన్నారి నవ్వు... ఓ స్ట్రెస్ బస్టర్. ‘‘కొన్ని త్యాగాలు... ఎన్నో ఆనందాల మధ్య అమ్మ అనే ఈ ప్రయాణం చాలా ఆనందంగా ఉంది’’ అంటున్నారు ప్రణీత. అసలు ‘అమ్మ అంటేనే ఆనందం’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారామె. ఇంకా ‘మదర్స్ డే సందర్భంగా’ ఇద్దరు పిల్లల తల్లిగా తన జీవితం ఎలా ఉందో పంచుకున్నారు హీరోయిన్ ప్రణీత.పెళ్లి కాకముందు, తల్లి కాక ముందు ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు అదనంగా తల్లిగానూ ఫుల్ బిజీ. అయితే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇటు ఫ్యామిలీని చూసుకుంటూనే అటు కెరీర్‌ని కూడా కొనసాగించవచ్చు. నేనలానే చేస్తున్నాను. కానీ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు సినిమాలు కాస్త తగ్గించుకున్నాను. అయితే టీవీ షో, యాడ్స్ చేస్తూ కెరీర్పరంగానూ బిజీగా ఉంటున్నాను. తల్లవగానే ఇంటికి పరిమితం అయిపోవాలన్నట్లుగా ఇప్పుడు ప్రపంచం లేదు. అమ్మాయిలకు కెరీర్ కూడా ముఖ్యమే. పిల్లలు స్కూల్‌కి వెళ్లేవరకూ కెరీర్‌ని పూర్తిగా మానేసుకోకుండా కాస్త స్లో చేసి, ఆ తర్వాత స్పీడప్ చేసుకోవచ్చు. మా పాప అర్నాకి ఇప్పుడు మూడేళ్లు... బాబు జైకృష్ణకి ఇంకా ఏడాది కూడా నిండలేదు. పాపని ప్లే స్కూల్‌కి పంపుతున్నాం. మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళితే మధ్నాహ్నం ఒంటి గంటకు వస్తుంది. ఈలోపు బాబు పనులు పూర్తి చేసేసి, పాపకి ఫుడ్ తయారు చేసి, రాగానే తినిపించేస్తాను. ఆ తర్వాత ఇద్దర్నీ నిద్రపుచ్చుతాను. అప్పుడు నాకు కాస్త తీరిక దొరుకుతుంది. మళ్లీ ఇద్దరూ నిద్ర లేచే సమయానికి ఏదైనా తినిపించడానికి ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత ఆటలు, డిన్నర్ టైమ్, నిద్రపుచ్చడం... ఇలా నా ఆలోచలన్నీ ఏం పెట్టాలి? ఎలా నిద్రపుచ్చాలి... అనేవాటి చుట్టూ తిరుగుతుంటాయి.సెలబ్రిటీ మదర్ అయినా, కామన్ మదర్ అయినా ఎవరైనా తల్లి తల్లే. పనులు చేసి పెట్టడానికి హెల్పర్స్‌ని పెట్టుకున్నప్పటికీ తల్లిగా పిల్లలకు చేయాల్సిన పనులు ఏ తల్లికైనా ఉంటాయి. ఉదాహరణగా చె΄్పాలంటే... పిల్లల బట్టలు మడతపెట్టడానికి, వంట చేయడానికి మనుషులు ఉన్నప్పటికీ పిల్లలకు మాత్రం నేనే తినిపిస్తాను. ‘అమ్మ తినిపిస్తుంది’ అనేది వాళ్లకు అర్థం అవ్వాలి. తినిపించడం, ఆడించడం అన్నీ అమ్మే చేయాలి. పిల్లలకు అర్థమయ్యేవన్నీ అమ్మే చెయ్యాలి.ఒక నటిగా ఫిజిక్‌ని పర్ఫెక్ట్గా మెయిన్టైన్ చేయడం చాలా అవసరం. అయితే తల్లయ్యాక అది సరిగ్గా వీలుపడటం లేదు. ఎందుకంటే ఇంతకు ముందైతే ఓ గంట వర్కవుట్ చేసి, అలసట తీరేంతవరకూ రిలాక్స్ అయ్యేదాన్ని. ఇప్పుడు వర్కవుట్ పూర్తి కాగానే పిల్లల పనులు ఉంటాయి. ఇక, అలసట తీర్చుకునేది ఎప్పుడు? అందుకే ఒక్కోసారి వర్కవుట్స్ మానేస్తున్నాను. అయితే పిల్లల కోసం చేసేది ఏదైనా హ్యాపీగా ఉంటుంది. ఫిజిక్ గురించిన ఆలోచన పక్కకు వెళ్లి΄ోతుంది (నవ్వుతూ). అలాగే కెరీర్ బ్యాక్సీట్లోకి వెళ్లి΄ోవడం సహజం. ఈ ప్రపంచంలో ‘మదర్‌హుడ్’ అనేది బెస్ట్ జాబ్ అని నా ఫీలింగ్. ఆ అద్భుతమైన అనుభూతి కోసం చేసే చిన్ని త్యాగాలు ఆనందాన్నే ఇస్తాయి.పాప పుట్టాక ఏం చేసినా.. పాపకు సౌకర్యంగానే ఉందా? సరిగ్గా చూసుకుంటున్నామా?’ అనిపించేది. బాబు పుట్టాక కూడా అది కంటిన్యూ అవుతోంది. పిల్లలు పెద్దయ్యాక కూడా తల్లికి ఈ డౌట్ ఉంటుందేమో! మొత్తం మీద నాకు అర్థమైందేంటంటే పిల్లలను ఎంత బాగా చూసుకున్నా తల్లికి తృప్తి ఉండదేమో. మావారు (నితిన్ రాజు) వీలు కుదిరినప్పుడల్లా పిల్లలను చూసుకుంటారు. ఇంటికి రాగానే పిల్లలను ప్లే ఏరియాకి తీసుకెళ్లడం, ఆడించడం చేస్తుంటారు. మా పాపను స్విమ్మింగ్‌లో చేర్పించాం. ఆ క్లాస్‌కి తీసుకెళతారు. ఇలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. – డి.జి. భవాని (చదవండి: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!) -
అమ్మంటే బలే ఇష్టం...ఎందుకో చెప్పనా..?
పిల్లలూ... అమ్మంటే ఎందుకు ఇష్టమో ఎప్పుడైనా అమ్మకు చెప్పారా? ప్రేమతో హగ్ చేసుకుని ‘అమ్మా... నువ్వంటే ప్రాణం’ అని చె΄్పారా? అమ్మ అదే మాట మనతో ఎన్నిసార్లు అనుంటుంది. అమ్మ మీద ఇష్టం అమ్మకు చెబుతుండాలి. ఇవాళ ‘మదర్స్ డే’. ఒక కాగితం మీద ‘బెస్ట్ మామ్ ఇన్ ది వరల్డ్’ హెడ్డింగ్ పెట్టి అమ్మ ఎందుకు గొప్పదో రాసి గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేయండిపిల్లలూ... మీకు ‘గమ్’ తెలుసు కదా. అది తనకూ మీకూ పూసి మీతో అంటుకు΄ోవడం తప్ప అమ్మ మీ కోసం అన్నీ చేస్తుంది. మీ ఆకలే తన ఆకలి. మీ నిద్రే తన నిద్ర. మీ నవ్వే తన నవ్వు. మీరు ఎక్కడకు అడుగులు వేసినా ఆమె కళ్లు వెనుకే వస్తుంటాయి. మీరు బయట ఆడుకుంటుంటే ఆమె ఇంట్లో నుంచే మీ ఆటను ఇమాజిన్ చేస్తుంది. మీకు దెబ్బ తగలగానే మీరు వచ్చి చెప్పే ముందే ఆమెకు తెలిసి΄ోతుంది. మీరంటే అంత ఇష్టం అమ్మకు. మరి మీక్కూడా ఇష్టమేగా. మే 11 ‘మదర్స్ డే’ సందర్భంగా పేపర్ మీద ఆ ఇష్టాన్నంతా పెట్టి అమ్మకు ప్రెజెంట్ చేద్దామా. కొందరు పిల్లలు మదర్స్ డేకు అమ్మకు ఎలాంటి లెటర్స్ రాశారో చూడండి. మీరు ఇంకా డిఫరెంట్‌గా ట్రై చేయండి.మై డియర్ మామ్...నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే గాడ్ కంటే ఎక్కువ ఇష్టం. మా క్లాస్‌లో అందరూ సీక్రెట్స్ ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటారు. నేను నీతో చెబుతా. ఎందుకంటే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకోవాల్సి వస్తే నువ్వే ఇంట్లో తెలుగు నేర్పించావు. ఎంత మంచి టీచర్‌వి నువ్వు. మా స్కూల్లో నీ లాంటి టీచర్ ఉంటే అందరూ ఫస్టే. అమ్మా.... నువ్వు సింగర్వా. అప్పుడప్పుడు హమ్ చేస్తుంటావు. నేను వింటుంటాలే. ఆ హమ్ చేసే అమ్మ ఇంకా ఇష్టం నాకు. నీకు మదర్స్ డే హగ్స్.– శ్రావ్య, క్లాస్ 7, మదనపల్లిడియర్ అమ్మా...థ్యాంక్యూ... ఎప్పుడూ కారులో డాడీ పక్కన నన్ను కూచోబెట్టి నువ్వు వెనక కూచుంటావు. డాడీ నిన్ను ముందు కూచోమన్నా పాపకు అక్కడే ఇష్టం’ అంటావు. దారిలో నువ్వే దిగి ఐస్‌క్రీమ్ కొనుక్కొని వస్తావు. నేను బ్యాడ్ కలర్స్‌తో డ్రస్ సెలెక్ట్ చేసుకుంటే మంచి డ్రస్ చూపించి ఇదే బాగుందని ఒప్పిస్తావు. ముందు కోపం వచ్చినా రాను రాను అది నా ఫేవరెట్ డ్రస్ అవుతుంది. అమ్మా... నాకేం కావాలో నీకు అన్నీ తెలుసు. నేను నీ కోసం బాగా చదువుకుని బెస్ట్‌గా ఉంటానని ఈ మదర్స్ డే రోజు ప్రామిస్ చేస్తున్నా. లవ్ యూ.– మౌనిక, క్లాస్ 8, హైదరాబాద్టు మై బెస్ట్ మామ్...అమ్మా... ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ వరల్డ్‌లోకి నన్ను తీసుకు వచ్చినందుకు థ్యాంక్స్. నా కోసం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావో నాకు తెలుసు. ఇంట్లో నువ్వు, నేను మాత్రమే ఉంటాం. డాడీ మనతో లేకున్నా నేను ఆ ఆబ్సెన్స్ ఫీలవకుండా డబుల్ ఎనర్జీతో కష్టపడతావ్. నా ఆథార్ కార్డ్ కరెక్షన్ కోసం నువ్వు పరేషాన్‌గా తిరుగుతుంటే ఏడుపు వచ్చింది. నాకు కొంచెం బాగా లేకున్నా హాస్పిటల్‌కు పరిగెత్తుతావ్. రాత్రంతా నిద్ర పోకుండా చూస్తావ్. నీకు ఎవరూ లేరని అనుకోకు. నేనున్నాను. నాకు నువ్వే మమ్మీవి... డాడీవి. ఐ రెస్పెక్ట్ యూ. cherish every moment we share, and I look forward to many more memories together. హ్యాపీ మదర్స్ డే.– దివ్య, క్లాస్ 10, విజయవాడగుడ్ మార్నింగ్ అమ్మా...మదర్స్ డే రోజు నీ కోసం రాస్తున్న లెటర్ ఇది. ఇలా రాయడం నాకు వెరీ న్యూ. ఏం రాయాలి? నీకు పెట్స్ అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టం. రాకీ గాణ్ణి తెచ్చుకుంటానని అన్నప్పుడు గట్టిగట్టిగా వద్దన్నావ్. నేను హర్ట్ అయ్యి రాత్రంతా ఏడ్చానని ఓన్లీ ఫర్ మీ ఓకే చేశావ్. అదిప్పుడు నాకు మాత్రమే కాదు నీక్కూడా బెస్ట్ ఫ్రెండే. అమ్మా... థ్యాంక్యూ ఫర్ యువర్ అన్‌కండీషనల్ లవ్.– నీ నందు/ఎర్రపండు, క్లాస్ 9, వాల్టేర్మామ్... మొమ్మ... మమ్మ... అమ్మ‘మామ్’ అనే పదం పిల్లల నుంచే వచ్చింది! తల్లిని ‘మామ్’ ‘మొమ్మ’ ‘మమ్మ’ అని పిలిచే పేర్లు ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్నాయి. పసిబిడ్డలు పూర్తిగా మాట్లాడలేని రోజుల్లో చేసే శబ్దాల నుంచే ఈ పేర్లు పుట్టాయి అంటారు భాషావేత్తలు.మదర్నింగ్ సండేస్‘మదర్స్ డే’ మూలాలు పురాతన గ్రీకు, రోమన్ సంప్రదాయాలలో ఉన్నాయి. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో ‘మదర్నింగ్ సండేస్’ రోజు పిల్లలు ఎక్కడ ఉన్నా తమ తల్లి దగ్గరికి వచ్చి ఆమె కోసం కేక్ తయారుచేసేవారు.మదర్స్ డే స్టాంప్తల్లుల గౌరవార్థం అమెరికాలో 1934లో మే 2న వయొలెట్ స్టాంప్‌ను విడుదల చేశారు. జేమ్స్ మెక్ నీల్ విస్లర్ ప్రసిద్ధ కళాఖండం ‘΄ోర్రై్టయిట్ ఆఫ్ మై మదర్’ ఆధారంగా ఈ స్టాంప్‌ను రూ΄÷ందించారు.మదర్ ఆఫ్ మదర్స్ డేవర్జీనియా(అమెరికా)కు చెందిన కాపీరైటర్ అన్నా జార్వీస్కు ‘మదర్ ఆఫ్ మదర్స్ డే’ అని పేరు. అమెరికా అంతర్యుద్ధ కాలంలో జార్వీస్ అమ్మ ఆన్ ఇరువైపుల సైనికులను దృష్టిలో పెట్టుకొని ‘మదర్స్ వర్క్ క్లబ్’లను నిర్వహించేది. యుద్ధ సమయంలో తన తల్లి సాగించిన శాంతి ప్రయత్నాలకు గుర్తుగా, గౌరవార్థంగా ‘మదర్స్ డే’ను ప్రారంభించింది అన్నా జార్వీస్. 1908లో వెస్ట్ వర్జీనియాలోని గ్రాఫ్టన్ నగరంలో, ఫిలడెల్ఫియాలో మొదటి అధికారిక ‘మదర్స్ డే’ వేడుకలు మే నెలలోని రెండో ఆదివారం జరిగాయి. మొదటి అధికారిక ‘మదర్స్ డే’ 1914 మే 10న జరిగింది.మదర్స్ డే ప్రేయర్వర్జీనియా(యూఎస్) టేలర్ కౌంటీలోని ఆండ్రూస్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిని అంతర్జాతీయ మాతృదినోత్సవ మందిరంగా పిలుస్తారు. ‘మదర్స్ డే’ గురించి అన్నా జార్వీస్ ఆలోచించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలో ప్రతి సంవత్సరం ‘మదర్స్ డే’ ప్రార్థన నిర్వహిస్తారు. (చదవండి: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!) -
Mother's Day: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!
తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన ఆర్థోపెడిక్ నిపుణుల్లో డాక్టర్ తేతలి దశరథరామారెడ్డి ఒకరు. తండ్రి నారాయణ రెడ్డి పేరు మీద సొంతూర్లో ఒక ట్రస్ట్ పెట్టి.. అవసరంలో ఉన్న వాళ్లకు వైద్యసహాయం అందిస్తున్నారు. అమ్మ సంకల్పబలం వల్లే తాను డాక్టర్నయ్యానని చెప్పే ఆయన ఇంటర్వ్యూ మదర్స్ డే సందర్భంగా..! ‘‘మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి. మా నాన్న నారాయణ రెడ్డి. ఆ రోజుల్లో బీఏ హానర్స్ చేశారు. అమ్మ అచ్చాయమ్మ.. పెద్దగా చదువుకోలేదు. నాకు రెండున్నరేళ్లున్నప్పుడు మా నాన్న రోడ్ యాక్సిడెంట్ పాలయ్యారు. మేం మొత్తం ఆరుగురం. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లి. అమ్మ మోటివేషన్.. నేను చిన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్‌ని. బాగా అల్లరిచేసే వాడిని కూడా! నేను డాక్టర్ అవడానికి స్ఫూర్తి మా చిన్నాన్న (కంటి డాక్టర్ సత్యనారాయణ రెడ్డి) అయితే మోటివేషన్ మాత్రం అమ్మదే! అమ్మ చాలా డిసిప్లిన్డ్.. కష్టపడే తత్వం.. చాలా ఫోకస్డ్.. డెడికేటెడ్. కమాండింగ్ నేచర్! మమ్మల్ని పొద్దున నాలుగింటికి లేపి చదువుకు కూర్చోబెట్టేది. మాతోపొటే తనూ కూర్చుని.. మేం చదువుకుంటుంటే ఆమె రామకోటి రాసేది. అమ్మ ఆశయమల్లా మాలో ఎవరినైనా డాక్టర్ చేయాలన్న నాన్న కోరికను నెరవేర్చడమే! ఏమాత్రం చదువును నిర్లక్ష్యం చేసినా.. మా చిన్నాన్నను ఉదాహరణగా చూపిస్తూ చక్కగా చదువుకుంటే అలా గౌరవం పొందుతారని చెప్పేది! మా బద్ధకాన్ని ఏమాత్రం సహించేది కాదు. తండ్రిలేని పిల్లలు కదా.. తనేమాత్రం అశ్రద్ధ చేసినా పాడైపోతారనే భయం అమ్మకు. అందుకే మమ్మల్ని పెంచడంలో ఎక్కడా రాజీ పడలేదు ఆవిడ. గారాబం గారాబమే. స్ట్రిక్ట్‌నెస్ స్ట్రిక్ట్నెసే! బద్ధకం అనేది ఆమె డిక్షనరీలో లేదు. ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి అనేవారు. మా అందరినీ సమర్థులైన ఇండివిడ్యువల్స్‌గా తయారు చేశారు. ఇటు మరుదులు.. అటు తమ్ముళ్లు అందరూ ఆమె మాటను గౌరవించేవారు. నిజానికి మా ఇంట్లో నానమ్మ తర్వాత మా మేనత్త మాణిక్యం. ఆ తర్వాత అమ్మే! నాన్న లేకపోయినా ఆ ఉమ్మడి కుటుంబాన్ని చెదరనివ్వలేదు అమ్మ. అందుకే చిన్నాన్నలకు అమ్మంటే చాలా గౌరవం. అలా అమ్మ మోటివేషన్, నాన్న కోరిక, చిన్నాన్న స్ఫూర్తితో నేను డాక్టర్‌ను అయ్యాను. మా మేనమామలకైతే ఆవిడ వాళ్లమ్మతో సమానం. మేమెప్పుడైనా అమ్మను చిన్నగా విసుక్కున్నా మా మేనమామలు మమ్మల్ని కేకలేసేవారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా.. ఇంట్లోకి రావడం రావడమే తిరుగు ప్రయాణానికి టికెట్ ఎప్పుడు రిజర్వ్ చేస్తావని అడిగేది. ఆ రావడం కూడా ఒంట్లో బాలేక΄ోతేనే వచ్చేది. ఆసుపత్రిలో చూపించుకుని వెంటనే వెళ్లిపోయేవారు. ఎంత అడిగినా ఉండేవారు కారు. ఎక్కువగా తన తమ్ముళ్లతో ఉండటానికి ఇష్టపడేవారు. మా అమ్మ విషయంలో నాకున్న ఒకే ఒక అసంతృప్తి.. మా ఇంట్లో ఇప్పుడు దాదాపు 17 మంది దాకా డాక్టర్లున్నారు. అమ్మ మా సక్సెస్ చూశారు కానీ.. మా పిల్లల సక్సెస్ చూడకుండానే పోయారు. 2016లో చనిపోయారావిడ.మహాగొప్ప మేనమామలు..మా నాన్నగారు పోయాక అమ్మ మానసికంగా కుంగిపోతే.. అమ్మమ్మ వాళ్లు తీసుకెళ్లి కొన్నాళ్లు అక్కడే పెట్టుకున్నారు. అప్పుడు అమ్మను కంటికి రెప్పలా కాచుకుంది మా మేనమామలే! ఆ కష్టకాలంలో మా ఫ్యామిలీ నిలబడ్డానికి ప్రధాన కారణం మా అమ్మమ్మ గారి కుటుంబమే! మా అమ్మాయి డాక్టర్. అమెరికాలో మాస్టర్స్ చేస్తోంది. అబ్బాయేమో ఆస్ట్రేలియాలో సప్లయ్ అండ్ చైన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేస్తున్నారు. నా భార్య సింధు. హోమ్ మేకర్. ఆమె కూడా అమ్మలాగే మంచి డిసిప్లిన్డ్. ఈ విషయంలో ఆమె మీద అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. గ్రేట్ మదర్. మా పెద్ద కుటుంబంలో చక్కగా ఇమిడిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే సింధు.. స్వీట్ హార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ.’’– సరస్వతి రమ (చదవండి: అమ్మ మనసు తెలుసా?) -
Hyderabad: సిటీలో.. మదర్స్‌డే.. సందడి..
సాక్షి, హైదరాబాద్: మదర్స్ డే సందర్భంగా నగరంలో ఆదివారం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, జరగనున్నాయి. వీటిలో భోజన విందులు, గిఫ్ట్ ఆఫర్లు మరెన్నో ఉన్నాయి. నగరంలోని మారియట్ హోటల్లో ఉన్న బక్రా రెస్టారెంట్లో ప్రత్యేక బ్రంచ్ మెనూ అందిస్తున్నారు. గచ్చిబౌలిలోని షెరటన్ హోటల్ లోని ఫీస్ట్ రెస్టారెంట్లో విత్ లవ్ మమ్స్ కిచెన్ థీమ్‌తో ప్రత్యేక బ్రంచ్. ఫొటో బూత్, గేమ్స్, బహుమతులతో మదర్స్‌డే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైటెక్ సిటీలోని ది వెస్టిన్ హోటల్లో సీజనల్ టేస్ట్స్ రెస్టారెంట్లో కాంటినెంటల్, నార్త్ ఇండియన్, ఇటాలియన్ వంటకాలతో ప్రత్యేక డైనింగ్ తగ్గింపు ధరలో అందిస్తున్నారు. ఇలాంటి మెనూ మార్పులే కాకుండా పలు ఆఫర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్‌లో మదర్స్ డేని పురస్కరించుకుని మూడు ఎంట్రీలు కొంటే ఒక ఎంట్రీ ఉచితంతో పాటు మదర్స్ డే థీమ్‌తో పలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ మదర్స్ డే సందర్భంగా అమ్మకు బహుమతులు అందించండి అంటూ ప్రత్యేక ఆల్మండ్స్ గిఫ్ట్ ప్యాక్స్‌ను నగర మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమ్మకు అందించాల్సిన పోషకాహారంపై ఆన్లైన్ వేదికలపై పలు న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పలు వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ బాదం వంటి పోషకాలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. -
Mother's Day: మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.. అమ్మ’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Happy Mother’s Day to all the incredible mothers. Your love, strength, and sacrifice are immeasurable. Today, we honor you for all that you do.Happy Mother’s Day Amma!#MothersDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 11, 2025 -
Mother's Day 2025: అమ్మ మనసు తెలుసా?
‘ఏంటమ్మా నీ గోల? నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసులే?’ అనే పిల్లల ధిక్కారాలు అమ్మకు కొత్తేం కాదు. ‘పదే పదే ఫోన్ చేసి విసిగించకమ్మా.. ఆకలేస్తే నేను తింటా కదా? నువ్వు అడగాలా?’లాంటి పోట్లాటలు, ఆమెకు వింతా కాదు. అయినా మన కోసమే తపిస్తుంది. మనం బాగుండాలని భరిస్తుంది. ‘అయ్యో పాపం అమ్మ తిన్నదో లేదో?’ అని మనమెలాగో కుశలం కనుక్కోము సరికదా, ఆమె కుశలమడిగితే టైమ్ లేదన్న సాకుతోనో, బిజీగా ఉన్నామన్న వంకతోనో, నోటికొచ్చిన సమాధానాలిచ్చి బాధపెడతాం. ఇంతటి జీవితాన్నిచ్చిన అమ్మకు నిజంగానే కాసింత సమయాన్ని కేటాయించలేమా? అసలు అమ్మకు ఏం కావాలి? ఆమె మనసును ఎలా తెలుసుకోవాలి?ప్రయత్నిస్తే అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా అర్థమయ్యేది అమ్మే. నిజానికి అమ్మ మనసు తెలుసుకోవాలన్న మన ఆలోచనతోనే ఆమె ఆనందం మొదలవుతుంది. మన ఈ ప్రయత్నమే ఆమెకు, అసలు సిసలు బహుమానమవుతుంది.అమ్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆమెను మాట్లాడనిద్దాం. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో కాస్త శ్రద్ధగా విందాం. ఆమె మాటల్లోని భావాలను గ్రహించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనకు ఆమె గురించి ఇంకెన్నో విషయాలు తెలుస్తాయి.అమ్మ చేసే పనులను గమనిద్దాం. అప్పుడు ఆమె దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుందో? ఆమెకు ఏది ఇష్టమో? ఏది ఇష్టం లేదో? ఆమె దేని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుందో? ఇలా ఆమె గురించి మరింత అర్థమవుతుంది.అమ్మ మనసుని సరదాగా మధ్యమధ్యలో కదిలిద్దాం. తన జీవితంలో పొందిన ఆనందాలనో, ఆమె తన కన్నవాళ్లతో గడిపిన క్షణాలనో, ఆమె ఎదుర్కొన్న కష్టాలనో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఆమె మనసు, ఆమె దృక్పథం మనకు మరింత బోధపడతాయి.మనం తీసుకునే కొన్ని నిర్ణయాల్లో అమ్మను సలహా అడుగుదాం. అలాంటప్పుడు ఆమె ఆలోచనా విధానం మనకు ఇంకా బాగా తెలుస్తుంది. పైగా ఆ సలహా మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆమెకు మనం ఇచ్చే విలువేమిటో ఆమెకూ అర్థమవుతుంది.అమ్మకు దూరంగా ఉంటే రోజుకొక్కసారైనా ఫోన్ చేసి ప్రేమతో పలకరిద్దాం. మనస్పూర్తిగా మాట కలుపుదాం. మన మనసులో ఆమె స్థానం పదిలమేనన్న సంగతి తెలియపరుద్దాం. ఆ రోజులో మనం అందుకున్న ప్రశంసల గురించో, మనం చేసిన పనుల గురించో, వెళ్లిన ప్రదేశాల గురించో ఆమెతో పంచుకుందాం. వీలు కుదిరినప్పుడు అమ్మతో కలిసి భోజనం చేద్దాం. టీవీ చూద్దాం. షాపింగ్‌కో, సినిమాకో తీసుకెళ్దాం. అలా చేస్తే బంధం మరింత బలపడుతుంది. ఆమెకు మన సమయాన్ని కేటాయించడం కూడా, ఆమె ఓ బహుమతిగానే భావిస్తుంది.అమ్మకు చిన్నచిన్న పనుల్లో సాయం చేయడం అలవాటు చేసుకుందాం. అలాగే కోపంలో అరవడం, గొడవ పడటం, అభిప్రాయాలు వేరుకావటం సహజమే. కాని, దానికి ఏదో ఒక సమయంలో క్షమాపణలు చెప్పడం నేర్చుకుందాం. మన తిరస్కారానికి కారణాలను సున్నితంగా వివరిద్దాం.ఏదో ఒక సందర్భంలో అమ్మకు కృతజ్ఞతలు తెలుపుదాం. జీవితంలో ఉన్నతమైన మెట్లు ఎక్కినప్పుడో, అత్యంత ఆనందంగా ఉన్నప్పుడో అమ్మనోసారి ప్రేమగా పలకరిద్దాం. వీలైతే ఆ క్షణంలోనే ఆమెకు ఐలవ్యూ చెబుదాం. దానికంటే ఆమెకు విలువైన బహుమతి మరొకటి ఉండదు.ఏది ఏమైనా జన్మజన్మలకు తీరని రుణపాశమే అమ్మప్రేమ. ప్రాణం పోసుకోకముందే ముడిపడిన ఆ పేగు బంధానికి, ప్రాణాలేం ధారబోయక్కర్లేదు. చూపులో ప్రేమ, పిలుపులో ధీమా కనిపించేలా స్పందిస్తే చాలు, తిరుగులేని ఆమె ఆశీర్వచనాలు.. జీవితాంతం దేవదూతలై కాపాడతాయి. యముడితోనైనా పోరాడతాయి. అంతటి వాత్సల్యాన్ని పంచే అమ్మకు.. బహుమానాలేం అక్కర్లేదు. మనం ఎంత ఎదిగినా, అమ్మ ఒడిలో ఒదిగే పసిమనసుని వదులుకోకపోతే చాలు. అమ్మకు సరైన ప్రతిఫలాన్ని అందించినట్లే అవుతుంది.∙సంహిత నిమ్మన -
వీరమాతకు వందనం
యుద్ధంలో బిడ్డను కోల్పోయిన దుఃఖం ఒకవైపు. ‘దేశమాత కోసం నా బిడ్డప్రాణత్యాగం చేశాడు’... అనే గర్వం ఒకవైపు... ఎంతోమంది వీరమాతలు... అందరికీ వందనం...యుద్ధ చరిత్రలోకి ఒకసారి...గర్వంగా అనిపించింది...కొన్ని సంవత్సరాల క్రితం... ఉగ్రవాదులతో జరిగిన పోరులో నలుగురిని చంపేశాడు లెఫ్టినెంట్ నవదీప్‌సింగ్. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూనే నేలకొరిగాడు 26 సంవత్సరాల ఆ యువకుడు. ‘నేనంటే నవదీప్‌కు ఎంత ఇష్టమో చెప్పడానికి మాటలు చాలవు. ఫ్రెండులా ఎన్నో కబుర్లు చెబుతుండేవాడు. నవదీప్ లేడు అనే వాస్తవం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికీ కలలో ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాడు. అమ్మా...నేను వస్తున్నాను అనే మాట వినబడితే సంతోషంగా అనిపించేది. లెఫ్టినెంట్ నవదీప్‌సింగ్ తల్లి కౌర్ ఇక ఆ మాట ఎప్పుడూ వినిపించదు. ఉగ్రవాదులను నవదీప్ దీటుగా ఎదుర్కోకపోతే ఎంతో నష్టం జరిగి ఉండేది... అని పై అధికారులు చెప్పినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నవదీప్ నా బిడ్డ. అతడు చనిపోయినప్పుడు నేనే కాదు.. ఎంతోమంది తల్లులు సొంత బిడ్డను కోల్పోయినట్లు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది. దేశం కోసం పోరాడే వీరసైనికుడికి ఒక్కరే అమ్మ ఉండదు. దేశంలోని ప్రతి అమ్మ తన అమ్మే’ అంటుంది పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన నవదీప్‌సింగ్ తల్లి కౌర్.ఇంటికి ఎప్పుడొస్తావు బిడ్డ?ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ నియోజక వర్గం కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ పాక్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. ఆ తల్లి దుఃఖ భాషను అర్థం చేసుకోగలమా? కుమారుడు మురళీనాయక్ మరణం గురించి అడిగినప్పుడు ‘ఏమని చెప్పాలి సామీ’ అని ఆ తల్లి భోరున విలపించింది. మురళీనాయక్ పార్థివదేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చారు. వారు తనలాగే ఏడ్చారు. అమ్మా... నీ కొడుకు ఎంత గొప్ప వీరుడో చూశావా! ‘ఆర్మీ జవాన్ మురళీ నాయక్ తల్లి’ అని తనను పరిచయం చేస్తున్న సమయంలో ఆ తల్లి హృదయం గర్వంతో పొంగిపోతుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఆ వీరమాతలందరికీ వందనం.కవాతు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి!జమ్మూ కశ్మీర్ దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ బ్రిజేష్ థాప వీరమరణం పొందాడు. ‘బ్రిజేష్ ఇక లేడు అనే వార్త విని కుప్పకూలిపోయాను. మా అబ్బాయి అని చెప్పడం కాదుగానీ చాలా క్రమశిక్షణ ఉన్న కుర్రాడు. ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే నేను సైన్యంలో చేరుతాను అనేవాడు. సైన్యంలో పనిచేయడం చాలా కష్టం అని చెబుతుండేదాన్ని. ఎంత కష్టమైనా సైన్యంలోకి వెళతాను అనేవాడు. బ్రిజేష్ లేడనే వాస్తవం కష్టంగా ఉన్నా సరే... దేశం కోసం నా కుమారుడుప్రాణాలు అర్పించాడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది’ అంటారు నీలిమ థాప. సైనిక దుస్తుల్లో కుమారుడిని చూసిన తొలి క్షణం నీలిమ భావోద్వేగానికి గురయ్యారు.ఎప్పటి కల అది! నాన్న యూనిఫామ్ వేసుకొని చిన్నారి బ్రిజేష్ మార్చ్ చేస్తుండేవాడు (బ్రిజేష్ తండ్రి మిలిటరీలో పనిచేశారు) కుమారుడిని చూసి ‘మేజర్ సాబ్ వచ్చేశారు’ అని నవ్వేది.ఇప్పుడిక ఆమెకు నవ్వే అవకాశమే లేకపోవచ్చు. కన్నీటి సముద్రంలో దిక్కుతోచకుండా ఉన్నట్లుగానే ఉండవచ్చు. అయితే... కుమారుడి ధైర్యసాహసాల గురించి విన్నప్పుడు ఆ తల్లి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. ‘కెప్టెన్ బ్రిజేష్ థాప’ అని కుమారుడి పేరు విన్నప్పుడల్లా... ఆర్మీ అధికారుల కవాతు శబ్దాలు ఆమెకు వినిపిస్తూనే ఉంటాయి.ఆ తల్లి ఎలా తట్టుకుందో!‘పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకం’ అంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన మంజుల. ఇండియా–చైనా యుద్ధంలో ఆమె కుమారుడు కల్నల్ సంతోష్‌బాబు కన్నుమూశాడు. చదువులోనే కాదు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండే కొడుకును చూసి మంజుల గర్వించేది. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంతోష్ మరణం గురించి మంజులకు తెలియజేశారు. ఆ తల్లి గుండె ఎలా తట్టుకుందో తెలియదు. కల్నల్ సంతోష్ బాబు, తల్లి మంజులకుమారుడి బాల్యవిశేషాలు, క్రమశిక్షణ గురించి కళ్లకు కట్టినట్లు చెప్పే మంజుల కుమారుడి మరణం గురించి.. ‘మన దేశం కోసం మా అబ్బాయి వీరమరణం పొందాడు’ అని గర్వంతో చెబుతుంది. ‘ఒక్కడే బాబు నాకు...’ అంటున్న ఆ తల్లి కంఠానికి కన్నీళ్లు అడ్డుపడి మాటలు రావు. ఆమె మనసులో కనిపించని దుఃఖసముద్రాలు ఉండవచ్చుగాక... కానీ ఆమె పదే పదే చెబుతుంది...‘నా బిడ్డ మన దేశం కోసం చనిపోయాడు’.ఎక్కడ ఉన్నా అమ్మ గురించే‘కెప్టెన్ సౌరభ్ కాలియ బయట ఎలా ఉంటాడో తెలియదుగానీ ఇంట్లో మాత్రం చిలిపి’ అంటుంది అతడి తల్లి విజయ కాలియ. ‘మేరా పాస్ మా హై’ అని తల్లి గురించి సరదాగానే సినిమా డైలాగు చెబుతుండేవాడుగానీ... నిజంగా తల్లి సౌరభ్ ధైర్యం. సైన్యం. ‘ఒకరోజు సౌరభ్ వంటగదిలోకి వచ్చి సైన్ చేసిన బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఎందుకు? అని అడిగితే ‘నేను ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మనీ విత్‌డ్రా చేసుకోవడానికి’ అన్నాడు. తాను ఎక్కడ ఉన్నా నా గురించే ఆలోచించేవాడు’ అంటుంది విజయ.ఇప్పుడు ‘కాలియ హోమ్’లో ఆ బ్లాంక్ చెక్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ చెక్‌ను చూసినప్పుడల్లా కుమారుడిని చూసినట్లుగానే ఉంటుంది. ‘డబ్బును డ్రా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ కాగితంపై నా బిడ్డ చేసిన సంతకం ఉంది. అది నాకోసం చేసింది. ఇది ఎప్పటికీ తీయటి జ్ఞాపకంగా ఉండిపోతుంది’ అంటుంది విజయ. చివరిసారిగా తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి ఫోన్ చేశాడు సౌరభ్.‘నా పుట్టిన రోజుకు తప్పకుండా ఇంటికి వస్తాను అన్నాడు. ఆ రోజు ఇప్పటికీ రాలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతుంది విజయ. 23 ఏళ్లు నిండకుండానే కార్గిల్ యుద్ధంలో సౌరభ్ చనిపోయాడు. హిమాచల్‌ద్రేశ్‌లోని పలంపూర్ ఇంట్లో ఒక గది మొత్తాన్ని సౌరభ్ మ్యూజియంగా మార్చారు. ‘ఈ మ్యూజియంలోకి వస్తే మా అబ్బాయి దగ్గరకి వచ్చినట్లే ఉంటుంది’ అంటుంది విజయ.నా కుమారుడు... వీరుడుఆ అమ్మ పేరు త్రిప్తా థాపర్... ఆమె కళ్లలో ఒకవైపు అంతులేని దుఃఖం, మరోవైపు గర్వం కనిపిస్తాయి. కార్గిల్ యుద్ధంలో థాపర్ తన కుమారుడిని కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో మహు పట్టణంలోని మిలిటరీ కంటోన్మెంట్ మ్యూజియంలో కార్గిల్ యుద్ధ దృశ్యాలను, కుమారుడి ఫోటోను చూస్తున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు.ఇరవై రెండు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విజయంత్ థాపర్ కార్గిల్ వార్ హీరో. తన దళంతో శత్రువుల బంకర్ ను చుట్టుముట్టే క్రమంలో విజయంత్ థాపర్ మరణించాడు.వీర్‌చక్ర విజయంత్ థాపర్ ,తల్లి త్రిప్తా థాపర్ ‘వీర్‌చక్ర విజయంత్ థాపర్ అమ్మగారు అని నన్ను పరిచయం చేస్తుంటారు. వీర్‌చక్ర అతడి పేరులో శాశ్వతంగా కలిసిపోయింది’ అని విజయంత్ గురించి గర్వంగా చెబుతుంది త్రిప్తా థాపర్. ఆమె దృష్టిలో అది మ్యూజియం కాదు. పవిత్ర స్థలం. ‘ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఫోటో ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దేశం కోసం చిన్న వయసులోనే జీవితాన్ని త్యాగం చేసిన వీరులను పదే పదే తలుచుకునేలా చేస్తుంది’ అంటుంది థాపర్. తన సన్నిహిత మిత్రురాలు పూనమ్ సైనీతో కలిసి తరచు ఈ మ్యూజియమ్‌కు వస్తుంటుంది త్రిప్తా థాపర్.ఎప్పుడు వచ్చినా కుమారుడి దగ్గరికి వచ్చినట్లే ఉంటుంది ఆ తల్లికి. బ్యాగులు సర్దుకొని ఇల్లు వదిలే ముందు... ‘అమ్మా... ఆరోగ్యం జాగ్రత్త’ అని చెప్పేవాడు. గంభీరంగా కనిపించే అతడి కళ్లలో అమ్మను విడిచి వెళ్లే ముందు సన్నని కన్నీటి పొర కనిపించేది. అయితే అమ్మకు ఆ కన్నీటి ఆనవాలు కనిపించకుండా తన చిరునవ్వు చాటున దాచేవాడు. ‘అమ్మా, కొడుకుల అనుబంధం గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అని కన్నీళ్లు తుడుచుకుంటుంది త్రిప్తా థాపర్ స్నేహితురాలు పూనమ్. -
Mother's day 2025 అమ్మ ఇచ్చిన రెండో జీవితం
అమ్మ అంటేనే త్యాగానికి, అంతులేని ప్రేమకు మరోపేరు. అలా త్యాగం చేసి.. తమ కిడ్నీలను తమ పిల్లలకు దానం చేసిన కొంతమంది తల్లులను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లో మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా, రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను గౌరవించారు.మాతృదినోత్సవాన్ని ఏఐఎన్‌యూ ఈ సంవత్సరం మరింత పవిత్రంగా చేసింది. తమ పిల్లల జీవితాలు కాపాడేందుకు తమకిడ్నీలు దానం చేసిన తల్లుల గాధలను ఆస్పత్రి ద్వారా అందరికీ పంచింది. ఈ కార్యక్రమంలో వైద్యులు, రోగులు, వారి కుటుంబసభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు.కిడ్నీ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్న గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లంతా తమ జీవితాలను తల్లులు ఎలా సమూలంగా మార్చేశారో, అంతకుముందు తాము అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడ్డామో తడిగుండెలతో వివరించారు. ఈ సందర్భంగా ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “అవయవదానం అనేది ఒక వ్యక్తి వేరేవారికి చేయగలిగిన అతి గొప్పదానమనీ, ఈ తల్లులు కేవలం పిల్లలను కని, పెంచడమే కాదు.. వాళ్లకు రెండోసారి జీవితం ఇచ్చారని కొనియాడారు. అవయవదానాల్లో, ముఖ్యంగా తల్లి నుంచి వచ్చినప్పుడు కిడ్నీలు ఎక్కువకాలం పనిచేస్తాయి. బాగా సన్నిహితుల నుంచి రావడంతో శరీరం వాటిని తిరస్కరించే అవకాశాలు తక్కువ. రోగులు త్వరగా కోలుకుని, తమ పనులు చేసుకోగలరు” అని చెప్పారు.సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “మాతృదినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా తల్లులను గౌరవించుకుంటారు. ఈరోజు మనం దీన్ని విభిన్నంగా చేసుకుంటున్నాం. ఈ సన్మానం అనేది మనకు ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఈ తల్లుల అపూర్వ త్యాగానికి చిన్న నూలుపోగు లాంటిదే” అన్నారు.సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.ఎస్. వలీ మాట్లాడుతూ, “తమ పిల్లలకు నిస్వార్థంగా తమ సొంత కిడ్నీలు దానం చేసి, వారి ప్రాణాలు రెండోసారి నిలబెట్టిన తల్లులను ఈ మాతృదినోత్సవాన మనం గౌరవించుకుంటున్నాం. తమపిల్లల పట్ల అపార ప్రేమాభిమానాలు చూపించడంతో పాటు, వారికి.. వారి కుటుంబాలకు బంగారు భవిష్యత్తును వీరు అందించారు. వారి త్యాగం తల్లీబిడ్డల మధ్య ఉండే అపురూపమైన బంధానికి, ప్రేమకు ఉండే శక్తికి ఒక నిదర్శనం. వారి అసాధారణ బలం, నిబద్ధతను ఎంతగానో కొనియాడుతున్నాం” అని తెలిపారు.మాతృప్రేమకు ఉన్న బలాన్ని తాజా పరిశోధన మరోసారి తెలిపింది: పిల్లలకు కిడ్నీలు దానం చేయడంలో తల్లులే ముందు ఉంటున్నారు. పిల్లల కిడ్నీమార్పిడి కేసులలోనూ ఇదే ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలకు, తల్లులకు రోగనిరోధకశక్తి పరంగా ఉండే సానుకూలత, సంరక్షణ బాధ్యతలు, పిల్లల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే భావోద్వేగం.. వీటన్నింటి వల్ల తల్లులు ఇవ్వడమే మంచిది. ఏఐఎన్‌యూలో జరిగే కిడ్నీ మార్పిడుల్లో మూడోవంతు దాతలు తల్లులే అవుతున్నారు.ఈ సంబరాల్లో ఏఐఎన్‌యూ వైద్య నిపుణులు - సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (బంజారాహిల్స్) డాక్టర్ సుజీత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (హైటెక్ సిటీ) డాక్టర్ క్రాంతికుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ (దిల్సుఖ్నగర్) డాక్టర్ అనూష గుడిపాటి తదితరులు పాల్గొన్నారు.