
దివ్యాంగులైన కుమారులకు మాతృమూర్తి సేవలు
పటాన్‌చెరు టౌన్: దివ్యాంగులైన ఇద్దరు కుమారులను 40 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ మాతృమూర్తి. లేచింది మొదలు వారి సేవలోనే జీవితం గడుపుతోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం రోడ్డులో వృద్ధురాలైన చంద్రకళ నివిస్తోంది. భర్త మడపతి చంద్రయ్య 2009 లో మృతి చెందాడు. నలుగురు కుమారులు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కొడుకు రాజశేఖర్, కూతురు భాగ్యలక్ష్మి బాగానే ఉన్నారు.
మిగతా నలుగురిలో కూతురు ఉమరాణి పుట్టుకతోనే మూగ. మిగతా ముగ్గురు కుమారులు సిద్ధప్ప, మహేశ్వర్, రవికుమార్‌లకు చిన్నప్పుడే కాళ్లు, చేతులు పడిపోయాయి. మాటలు రాని ఉషారాణి సైతం ప్రస్తుతం తల్లి మీదే ఆధారపడింది. మూడేళ్ల క్రితం రెండో కుమారుడైన మహేశ్వర్ మృతి చెందాడు. ఉన్న ఇద్దరు కుమారులకు, కూతురుకు ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకు సేవలు చేస్తూ కాలం గడుపుతోంది వృద్ధురాలు.
పెన్షనే ఆధారం..
అయితే వీరి జీవనాధారం.. తల్లి తోపాటు ఇద్దరు కుమారులకు వచ్చే పెన్షన్ మొత్తం రూ.10 వేల తోనే నెల మొత్తం గడపాల్సి వస్తోంది. అప్పుడప్పుడు దాతలు వచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చి వెళ్తారని ఆ తల్లి తెలిపారు. తమ తల్లి 40 ఏళ్లకు పైగా తమను చూసుకుంటుందని, చిన్నపిల్లలను చూసుకునే విధంగా రోజూ స్నానం చేయించి, భోజనం తినిపించి ప్రేమగా చూసుకునే తల్లి దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని కుమారులు సిద్దప్ప, రవికుమారులు అంటున్నారు.