
వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన తల్లి స్ఫూర్తితో సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. బీహార్‌లోని పాట్నాలో జన్మించిన అగర్వాల్, కెరీర్ ఆరంభంలో విఫలమైనప్పుడు నిరాశకు గురయ్యారు. అప్పుడు అమ్మే అండగా నిలిచింది. గుండెల్లో ధైర్యం నింపింది. మాతృ దినోత్సవం సందర్భంగా ఈ తల్లీకొడుకుల అనుబంధం గురించి తెలిపేదే ఈ కథనం..
విజయవంతమైన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభ రోజులు పరీక్షగానే ఉంటాయి. ఎవరు అవమానించినా, హేళన చేసినా ఈ పరీక్షలో వారికి తోడుగా నిలిచేది తల్లి మాత్రమే. అలాగే అనిల్ అగర్వాల్‌కూ అమ్మ అండగా నిలిచింది. విజయం వైపు నడిపించింది. “అనిల్.. ముందుకు సాగు.. తలుపులు తెరుచుకుంటాయి” అని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటారాయన.ఈ మాటలు ఆయనలో సంకల్పాన్ని నింపాయి. వేదాంతను స్థాపించి భారత జీడీపీలో 1.4% వాటా సాధించే సంస్థగా నిలిపారు.
ప్రస్తుతం వేదాంత ఒక పెద్ద మార్పును చేస్తోంది. 83% ఆమోదంతో డీమెర్జర్‌కి క్రెడిటర్స్ ఆమోదం లభించింది. దీనివల్ల సంస్థ ఐదు స్వతంత్ర విభాగాలుగా విడిపోతుంది. సెప్టెంబర్ 2025 నాటికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అగర్వాల్ ఆశిస్తున్నారు. ఈ డీమెర్జర్ షేర్‌హోల్డర్ల విలువను పెంచి, రుణ భారాన్ని తగ్గిస్తుంది. గత ఐదేళ్లలో వేదాంతలో పెట్టుబడులు 4.7 రెట్ల రాబడిని ఇచ్చాయి.
వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతపై కూడా అగర్వాల్ దృష్టి ఉంది. అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ ద్వారా నడిచే నంద్‌ఘర్ కార్యక్రమం బాల్య విద్యను ప్రోత్సహిస్తుంది. మదర్స్ డే సందర్భంగా, తల్లుల పాత్రను గౌరవిస్తూ తన తల్లి స్ఫూర్తిని తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నారు అనిల్ అగర్వాల్. ఈమేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు.
‘మొదటిసారి, ‘మదర్స్ డే’ రోజున అమ్మ లేదు!
అమ్మ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు… ఆమె మీ ఉనికే. ఆమె శరీర రూపంలో మనతో లేకపోయినా, ఆమె ఆత్మ శ్వాస మనతోనే ఉంటుంది.
కాలం, దేవుడి కృపగా మారి కన్నీళ్లను ఆరబెడుతుంది. అంతులేని బాధను సానుకూల శక్తిగా మార్చి మనకు బతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది.
విచారం, కాలంతో పాటు శక్తిగా మారుతుంది, ఎందుకంటే మీ ప్రేమ నిజమైనది.
ఉదయం లేచినప్పుడు ఏదో భక్తి గీతం, ఆలోచించకుండానే నోటిలోకి వచ్చినట్లు, అలాగే అమ్మ జ్ఞాపకం మనసులో వెలుగును నింపుతూ ఉంటుంది.
ఖాదీ బట్టల వాసన లేదా అగరబత్తి సుగంధంలో తరచూ అమ్మ ఉనికిని అనుభవిస్తాను.
మా అమ్మకు ఇంగ్లీష్ రాదు, కానీ లండన్‌లో ఉంటూ ఆమె ఇంగ్లీష్ వాళ్లతో చక్కగా సంభాషించేది. భావనల భాషకు పదాల అవసరం ఎప్పుడూ ఉండదు.
పెద్ద నిర్ణయం తీసుకునే ప్రతిసారీ ఒక క్షణం ఆగిపోతాను. అమ్మ ఆశీర్వాదం కావాలన్నట్లు అనిపిస్తుంది.‘వేద’ నా అమ్మ పేరు.
“వేదాంత” అక్కడి నుండే పుట్టింది.
నా విజయం నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రసాదమే.
అమ్మ జ్ఞాపకానికి ఒక నిర్దిష్టమైన రోజు అవసరం లేకపోయినా, ఇలాంటి ఒక రోజును నిర్ణయించడం నాకు చాలా సానుకూల ఆలోచనగా అనిపిస్తుంది. ప్రపంచమంతా ఒక మాటగా కలిసి ఈ రోజును అమ్మకు అంకితం చేస్తోంది. ఇది చాలా మంచి విషయం.
‘మదర్స్ డే’ సందర్భంగా ప్రతి అమ్మకు నా నమస్కారం!’