Mother's Day: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా! | Dr Thethali Dasharathara Reddy is one of the rare orthopedic specialists | Sakshi
Sakshi News home page

అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!

May 11 2025 10:02 AM | Updated on May 11 2025 10:47 AM

Dr Thethali Dasharathara Reddy is one of the rare orthopedic specialists

తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన ఆర్థోపెడిక్‌ నిపుణుల్లో డాక్టర్‌ తేతలి దశరథరామారెడ్డి ఒకరు. తండ్రి నారాయణ రెడ్డి పేరు మీద సొంతూర్లో ఒక ట్రస్ట్‌ పెట్టి.. అవసరంలో ఉన్న వాళ్లకు వైద్యసహాయం అందిస్తున్నారు. అమ్మ సంకల్పబలం వల్లే తాను డాక్టర్‌నయ్యానని చెప్పే ఆయన ఇంటర్వ్యూ మదర్స్‌ డే సందర్భంగా..! 

‘‘మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి. మా నాన్న నారాయణ రెడ్డి. ఆ రోజుల్లో బీఏ హానర్స్‌ చేశారు. అమ్మ అచ్చాయమ్మ.. పెద్దగా చదువుకోలేదు. నాకు రెండున్నరేళ్లున్నప్పుడు మా నాన్న రోడ్‌ యాక్సిడెంట్‌ పాలయ్యారు. మేం మొత్తం ఆరుగురం. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లి.  

అమ్మ మోటివేషన్‌.. 
నేను చిన్నప్పుడు యావరేజ్‌ స్టూడెంట్‌ని. బాగా అల్లరిచేసే వాడిని కూడా! నేను డాక్టర్‌ అవడానికి స్ఫూర్తి మా చిన్నాన్న (కంటి డాక్టర్‌ సత్యనారాయణ రెడ్డి) అయితే మోటివేషన్‌ మాత్రం అమ్మదే! అమ్మ చాలా డిసిప్లిన్డ్‌.. కష్టపడే తత్వం.. చాలా ఫోకస్డ్‌.. డెడికేటెడ్‌. కమాండింగ్‌ నేచర్‌! మమ్మల్ని పొద్దున నాలుగింటికి లేపి చదువుకు కూర్చోబెట్టేది. మాతోపొటే తనూ కూర్చుని.. మేం చదువుకుంటుంటే ఆమె రామకోటి రాసేది. 

అమ్మ ఆశయమల్లా మాలో ఎవరినైనా డాక్టర్‌ చేయాలన్న నాన్న కోరికను నెరవేర్చడమే! ఏమాత్రం చదువును నిర్లక్ష్యం చేసినా.. మా చిన్నాన్నను ఉదాహరణగా చూపిస్తూ చక్కగా చదువుకుంటే అలా గౌరవం పొందుతారని చెప్పేది! మా బద్ధకాన్ని ఏమాత్రం సహించేది కాదు. తండ్రిలేని పిల్లలు కదా.. తనేమాత్రం అశ్రద్ధ చేసినా పాడైపోతారనే భయం అమ్మకు. అందుకే మమ్మల్ని పెంచడంలో ఎక్కడా రాజీ పడలేదు ఆవిడ. గారాబం గారాబమే. స్ట్రిక్ట్‌నెస్‌ స్ట్రిక్ట్‌నెసే! బద్ధకం అనేది ఆమె డిక్షనరీలో లేదు. 

ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి అనేవారు. మా అందరినీ సమర్థులైన ఇండివిడ్యువల్స్‌గా తయారు చేశారు. ఇటు మరుదులు.. అటు తమ్ముళ్లు అందరూ ఆమె మాటను గౌరవించేవారు. నిజానికి మా ఇంట్లో నానమ్మ తర్వాత మా మేనత్త మాణిక్యం. ఆ తర్వాత అమ్మే! నాన్న లేకపోయినా ఆ ఉమ్మడి కుటుంబాన్ని చెదరనివ్వలేదు అమ్మ. అందుకే చిన్నాన్నలకు అమ్మంటే చాలా గౌరవం. 

అలా అమ్మ మోటివేషన్, నాన్న కోరిక, చిన్నాన్న స్ఫూర్తితో నేను డాక్టర్‌ను అయ్యాను. మా మేనమామలకైతే ఆవిడ వాళ్లమ్మతో సమానం. మేమెప్పుడైనా అమ్మను చిన్నగా విసుక్కున్నా మా మేనమామలు మమ్మల్ని కేకలేసేవారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా.. ఇంట్లోకి రావడం రావడమే తిరుగు ప్రయాణానికి టికెట్‌ ఎప్పుడు రిజర్వ్‌ చేస్తావని అడిగేది. ఆ రావడం కూడా ఒంట్లో బాలేక΄ోతేనే వచ్చేది. ఆసుపత్రిలో చూపించుకుని వెంటనే వెళ్లిపోయేవారు. 

ఎంత అడిగినా ఉండేవారు కారు. ఎక్కువగా తన తమ్ముళ్లతో ఉండటానికి ఇష్టపడేవారు. మా అమ్మ విషయంలో నాకున్న ఒకే ఒక అసంతృప్తి.. మా ఇంట్లో ఇప్పుడు దాదాపు 17 మంది దాకా డాక్టర్లున్నారు. అమ్మ మా సక్సెస్‌ చూశారు కానీ.. మా పిల్లల సక్సెస్‌ చూడకుండానే పోయారు. 2016లో చనిపోయారావిడ.

మహాగొప్ప మేనమామలు..
మా నాన్నగారు పోయాక  అమ్మ మానసికంగా కుంగిపోతే.. అమ్మమ్మ వాళ్లు తీసుకెళ్లి కొన్నాళ్లు అక్కడే పెట్టుకున్నారు. అప్పుడు అమ్మను కంటికి రెప్పలా కాచుకుంది మా మేనమామలే! ఆ కష్టకాలంలో మా ఫ్యామిలీ నిలబడ్డానికి ప్రధాన కారణం మా అమ్మమ్మ గారి కుటుంబమే! మా అమ్మాయి డాక్టర్‌. 

అమెరికాలో మాస్టర్స్‌ చేస్తోంది. అబ్బాయేమో ఆస్ట్రేలియాలో సప్లయ్‌ అండ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేస్తున్నారు.  నా భార్య సింధు. హోమ్‌ మేకర్‌. ఆమె కూడా అమ్మలాగే మంచి డిసిప్లిన్డ్‌. ఈ విషయంలో ఆమె మీద అమ్మ ఇన్‌ఫ్లుయెన్స్‌ చాలా ఉంది. గ్రేట్‌ మదర్‌. మా పెద్ద కుటుంబంలో చక్కగా ఇమిడిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే సింధు.. స్వీట్‌ హార్ట్‌ ఆఫ్‌ అవర్‌ ఫ్యామిలీ.’’
– సరస్వతి రమ 

(చదవండి: అమ్మ మనసు తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement