
మదర్స్ డే ప్రత్యేకం
యుద్ధంలో బిడ్డను కోల్పోయిన దుఃఖం ఒకవైపు. ‘దేశమాత కోసం నా బిడ్డప్రాణత్యాగం చేశాడు’... అనే గర్వం ఒకవైపు... ఎంతోమంది వీరమాతలు... అందరికీ వందనం...యుద్ధ చరిత్రలోకి ఒకసారి...
గర్వంగా అనిపించింది...
కొన్ని సంవత్సరాల క్రితం... ఉగ్రవాదులతో జరిగిన పోరులో నలుగురిని చంపేశాడు లెఫ్టినెంట్ నవదీప్‌సింగ్. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూనే నేలకొరిగాడు 26 సంవత్సరాల ఆ యువకుడు. ‘నేనంటే నవదీప్‌కు ఎంత ఇష్టమో చెప్పడానికి మాటలు చాలవు. ఫ్రెండులా ఎన్నో కబుర్లు చెబుతుండేవాడు. నవదీప్ లేడు అనే వాస్తవం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికీ కలలో ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాడు. అమ్మా...నేను వస్తున్నాను అనే మాట వినబడితే సంతోషంగా అనిపించేది.
లెఫ్టినెంట్ నవదీప్‌సింగ్ తల్లి కౌర్
ఇక ఆ మాట ఎప్పుడూ వినిపించదు. ఉగ్రవాదులను నవదీప్ దీటుగా ఎదుర్కోకపోతే ఎంతో నష్టం జరిగి ఉండేది... అని పై అధికారులు చెప్పినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నవదీప్ నా బిడ్డ. అతడు చనిపోయినప్పుడు నేనే కాదు.. ఎంతోమంది తల్లులు సొంత బిడ్డను కోల్పోయినట్లు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది. దేశం కోసం పోరాడే వీరసైనికుడికి ఒక్కరే అమ్మ ఉండదు. దేశంలోని ప్రతి అమ్మ తన అమ్మే’ అంటుంది పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన నవదీప్‌సింగ్ తల్లి కౌర్.
ఇంటికి ఎప్పుడొస్తావు బిడ్డ?
ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ నియోజక వర్గం కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ పాక్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. ఆ తల్లి దుఃఖ భాషను అర్థం చేసుకోగలమా? కుమారుడు మురళీనాయక్ మరణం గురించి అడిగినప్పుడు ‘ఏమని చెప్పాలి సామీ’ అని ఆ తల్లి భోరున విలపించింది. మురళీనాయక్ పార్థివదేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చారు. వారు తనలాగే ఏడ్చారు. అమ్మా... నీ కొడుకు ఎంత గొప్ప వీరుడో చూశావా! ‘ఆర్మీ జవాన్ మురళీ నాయక్ తల్లి’ అని తనను పరిచయం చేస్తున్న సమయంలో ఆ తల్లి హృదయం గర్వంతో పొంగిపోతుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఆ వీరమాతలందరికీ వందనం.
కవాతు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి!
జమ్మూ కశ్మీర్ దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్ బ్రిజేష్ థాప వీరమరణం పొందాడు. ‘బ్రిజేష్ ఇక లేడు అనే వార్త విని కుప్పకూలిపోయాను. మా అబ్బాయి అని చెప్పడం కాదుగానీ చాలా క్రమశిక్షణ ఉన్న కుర్రాడు. ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే నేను సైన్యంలో చేరుతాను అనేవాడు. సైన్యంలో పనిచేయడం చాలా కష్టం అని చెబుతుండేదాన్ని. ఎంత కష్టమైనా సైన్యంలోకి వెళతాను అనేవాడు. బ్రిజేష్ లేడనే వాస్తవం కష్టంగా ఉన్నా సరే... దేశం కోసం నా కుమారుడుప్రాణాలు అర్పించాడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది’ అంటారు నీలిమ థాప. సైనిక దుస్తుల్లో కుమారుడిని చూసిన తొలి క్షణం నీలిమ భావోద్వేగానికి గురయ్యారు.
ఎప్పటి కల అది!
నాన్న యూనిఫామ్ వేసుకొని చిన్నారి బ్రిజేష్ మార్చ్ చేస్తుండేవాడు (బ్రిజేష్ తండ్రి మిలిటరీలో పనిచేశారు) కుమారుడిని చూసి ‘మేజర్ సాబ్ వచ్చేశారు’ అని నవ్వేది.
ఇప్పుడిక ఆమెకు నవ్వే అవకాశమే లేకపోవచ్చు. కన్నీటి సముద్రంలో దిక్కుతోచకుండా ఉన్నట్లుగానే ఉండవచ్చు. అయితే... కుమారుడి ధైర్యసాహసాల గురించి విన్నప్పుడు ఆ తల్లి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. ‘కెప్టెన్ బ్రిజేష్ థాప’ అని కుమారుడి పేరు విన్నప్పుడల్లా... ఆర్మీ అధికారుల కవాతు శబ్దాలు ఆమెకు వినిపిస్తూనే ఉంటాయి.
ఆ తల్లి ఎలా తట్టుకుందో!
‘పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకం’ అంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన మంజుల. ఇండియా–చైనా యుద్ధంలో ఆమె కుమారుడు కల్నల్ సంతోష్‌బాబు కన్నుమూశాడు. చదువులోనే కాదు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండే కొడుకును చూసి మంజుల గర్వించేది. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంతోష్ మరణం గురించి మంజులకు తెలియజేశారు. ఆ తల్లి గుండె ఎలా తట్టుకుందో తెలియదు.
కల్నల్ సంతోష్ బాబు, తల్లి మంజుల
కుమారుడి బాల్యవిశేషాలు, క్రమశిక్షణ గురించి కళ్లకు కట్టినట్లు చెప్పే మంజుల కుమారుడి మరణం గురించి.. ‘మన దేశం కోసం మా అబ్బాయి వీరమరణం పొందాడు’ అని గర్వంతో చెబుతుంది. ‘ఒక్కడే బాబు నాకు...’ అంటున్న ఆ తల్లి కంఠానికి కన్నీళ్లు అడ్డుపడి మాటలు రావు. ఆమె మనసులో కనిపించని దుఃఖసముద్రాలు ఉండవచ్చుగాక... కానీ ఆమె పదే పదే చెబుతుంది...‘నా బిడ్డ మన దేశం కోసం చనిపోయాడు’.
ఎక్కడ ఉన్నా అమ్మ గురించే
‘కెప్టెన్ సౌరభ్ కాలియ బయట ఎలా ఉంటాడో తెలియదుగానీ ఇంట్లో మాత్రం చిలిపి’ అంటుంది అతడి తల్లి విజయ కాలియ. ‘మేరా పాస్ మా హై’ అని తల్లి గురించి సరదాగానే సినిమా డైలాగు చెబుతుండేవాడుగానీ... నిజంగా తల్లి సౌరభ్ ధైర్యం. సైన్యం. ‘ఒకరోజు సౌరభ్ వంటగదిలోకి వచ్చి సైన్ చేసిన బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఎందుకు? అని అడిగితే ‘నేను ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మనీ విత్‌డ్రా చేసుకోవడానికి’ అన్నాడు. తాను ఎక్కడ ఉన్నా నా గురించే ఆలోచించేవాడు’ అంటుంది విజయ.
ఇప్పుడు ‘కాలియ హోమ్’లో ఆ బ్లాంక్ చెక్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ చెక్‌ను చూసినప్పుడల్లా కుమారుడిని చూసినట్లుగానే ఉంటుంది. ‘డబ్బును డ్రా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ కాగితంపై నా బిడ్డ చేసిన సంతకం ఉంది. అది నాకోసం చేసింది. ఇది ఎప్పటికీ తీయటి జ్ఞాపకంగా ఉండిపోతుంది’ అంటుంది విజయ. చివరిసారిగా తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి ఫోన్ చేశాడు సౌరభ్.
‘నా పుట్టిన రోజుకు తప్పకుండా ఇంటికి వస్తాను అన్నాడు. ఆ రోజు ఇప్పటికీ రాలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతుంది విజయ. 23 ఏళ్లు నిండకుండానే కార్గిల్ యుద్ధంలో సౌరభ్ చనిపోయాడు. హిమాచల్‌ద్రేశ్‌లోని పలంపూర్ ఇంట్లో ఒక గది మొత్తాన్ని సౌరభ్ మ్యూజియంగా మార్చారు. ‘ఈ మ్యూజియంలోకి వస్తే మా అబ్బాయి దగ్గరకి వచ్చినట్లే ఉంటుంది’ అంటుంది విజయ.
నా కుమారుడు... వీరుడు
ఆ అమ్మ పేరు త్రిప్తా థాపర్... ఆమె కళ్లలో ఒకవైపు అంతులేని దుఃఖం, మరోవైపు గర్వం కనిపిస్తాయి. కార్గిల్ యుద్ధంలో థాపర్ తన కుమారుడిని కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో మహు పట్టణంలోని మిలిటరీ కంటోన్మెంట్ మ్యూజియంలో కార్గిల్ యుద్ధ దృశ్యాలను, కుమారుడి ఫోటోను చూస్తున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు.
ఇరవై రెండు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విజయంత్ థాపర్ కార్గిల్ వార్ హీరో. తన దళంతో శత్రువుల బంకర్ ను చుట్టుముట్టే క్రమంలో విజయంత్ థాపర్ మరణించాడు.
వీర్‌చక్ర విజయంత్ థాపర్ ,తల్లి త్రిప్తా థాపర్
‘వీర్‌చక్ర విజయంత్ థాపర్ అమ్మగారు అని నన్ను పరిచయం చేస్తుంటారు. వీర్‌చక్ర అతడి పేరులో శాశ్వతంగా కలిసిపోయింది’ అని విజయంత్ గురించి గర్వంగా చెబుతుంది త్రిప్తా థాపర్. ఆమె దృష్టిలో అది మ్యూజియం కాదు. పవిత్ర స్థలం. ‘ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఫోటో ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దేశం కోసం చిన్న వయసులోనే జీవితాన్ని త్యాగం చేసిన వీరులను పదే పదే తలుచుకునేలా చేస్తుంది’ అంటుంది థాపర్. తన సన్నిహిత మిత్రురాలు పూనమ్ సైనీతో కలిసి తరచు ఈ మ్యూజియమ్‌కు వస్తుంటుంది త్రిప్తా థాపర్.
ఎప్పుడు వచ్చినా కుమారుడి దగ్గరికి వచ్చినట్లే ఉంటుంది ఆ తల్లికి. బ్యాగులు సర్దుకొని ఇల్లు వదిలే ముందు... ‘అమ్మా... ఆరోగ్యం జాగ్రత్త’ అని చెప్పేవాడు. గంభీరంగా కనిపించే అతడి కళ్లలో అమ్మను విడిచి వెళ్లే ముందు సన్నని కన్నీటి పొర కనిపించేది. అయితే అమ్మకు ఆ కన్నీటి ఆనవాలు కనిపించకుండా తన చిరునవ్వు చాటున దాచేవాడు. ‘అమ్మా, కొడుకుల అనుబంధం గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అని కన్నీళ్లు తుడుచుకుంటుంది త్రిప్తా థాపర్ స్నేహితురాలు పూనమ్.