అయ్యయ్యో నవదీప్‌..! | F41 category removed from next World Games | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో నవదీప్‌..!

Jun 7 2025 12:56 AM | Updated on Jun 7 2025 12:56 AM

F41 category removed from next World Games

లాస్‌ ఏంజెలిస్‌ పారాలింపిక్స్‌లో అతని కేటగిరీకి కత్తెర 

యోగేశ్‌ ఈవెంట్‌ కూడా...

న్యూఢిల్లీ: నవదీప్‌ సింగ్‌ గుర్తున్నాడా... అదేనండీ మరుగుజ్జు జావెలిన్‌ త్రోయర్, పారిస్‌ పారాలింపిక్స్‌ (2024)లో ఎఫ్‌41 ఈవెంట్‌లో పోటీపడటంతోనే అందరిని ఆకర్షించాడు. పొట్టి కాళ్లతో చిట్టిచిట్టి అంగల్లు వేగంగా వేసుకుంటూ వెళ్లి ఈటెను విసిరిన ప్రదర్శన చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ ప్రదర్శనతోనే నవదీప్‌ బంగారు పతకంతో అందలమెక్కాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటపడి మరీ అతనికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు నవదీప్‌తో సమానంగా ఫొటోలో కనిపించేందుకు కింద కూర్చున్నారు. అతని నెత్తికి టోపీపెట్టి అభినందించారు. 

అలా క్రీడాప్రియులకు పరిచయమైన నవదీప్‌కు లాస్‌ ఏంజెలిస్‌–2028 ఒలింపిక్స్‌ పెద్ద షాక్‌ ఇచ్చింది. అతను స్వర్ణం నిలబెట్టుకునే అవకాశం లేకుండా ‘ఎఫ్‌ 41’ కేటగిరీని తదుపరి విశ్వక్రీడల నుంచి తొలగించింది. రోస్టర్‌లో భాగంగా ఆతిథ్య దేశం కొన్ని క్రీడలు లేదంటే కేటగిరీలను పక్కనబెట్టే అవకాశం ఒలింపిక్‌ చార్టర్‌ కల్పిస్తుంది. ఇందులో భాగంగానే నవదీప్‌ ఈవెంట్‌తో పాటు డిస్కస్‌ త్రోయర్‌ యోగేశ్‌ కథునియా ‘ఎఫ్‌ 56’ కేటగిరీని సైతం లాస్‌ ఏంజెలిస్‌ నిర్వాహకులు తొలగించారు. 

పారిస్‌లో యోగేశ్‌ డిస్కస్‌ త్రో ‘ఎఫ్‌ 56’ కేటగిరీలో రజత పతకం గెలుపొందాడు. అయితే వీరిద్దరి కేటగిరీలు లాస్‌ ఏంజెలిస్‌ పారాలింపిక్స్‌లోని 552 మెడల్‌ ఈవెంట్‌లలో లేవు. ఓవరాల్‌గా 4400 అథ్లెట్ల కోటాలో ఏ మార్పు లేదు. టోక్యో, పారిస్‌ పారాలింపిక్స్‌లో కూడా 4400 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. మిగతా క్రీడా ఈవెంట్లను సర్దుబాటు చేయడం ద్వారా 4400 అథ్లెట్ల కోటా అలాగే కొనసాగుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement