
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పోలాండ్ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి చోప్రా ఈ నెల 24న ‘ఎన్‌సీ క్లాసిక్’ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. కానీ భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల పలు విమానాశ్రయాల మూసివేతతో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలనుకున్న ఎన్‌సీ క్లాసిక్ ఈవెంట్ నిరవధికంగా వాయిదా పడింది. ఇపుడు ఇదే సమయంలో పోలాండ్‌లో జరిగే ఈవెంట్‌లో నీరజ్ బరిలోకి దిగుతాడు.
ఈ నెల 23న అక్కడ ‘ఒర్లిన్ జానుస్జ్ కుసొసిన్సికి మెమోరియల్ ఈవెంట్’ జరుగనుంది. ఈ ఈవెంట్‌లో పలువురు అంతర్జాతీయ మేటి జావెలిన్ త్రోయర్లు పాల్గొంటారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జులియన్ వెబెర్ (జర్మనీ), పోలాండ్ జాతీయ రికార్డు నెలకొల్పిన మార్సిన్ క్రుకొవ్‌స్కీ తదితరులు పాల్గొంటారు. ఈ సీజన్‌లో దక్షిణాఫ్రికా ఈవెంట్‌తో ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టిన చోప్రా ఈ నెల 16న దోహా డైమండ్ లీగ్‌లో పాల్గొనాల్సి ఉంది.