
గాఢ నిద్రలో ఉన్న ప్పుడు కేరింతల శబ్దం... ఆ శబ్దం అమ్మకు ఓ ఆనందం... అన్నం తింటుంటే బుడి బుడి అడుగులతో అల్లరి... అమ్మకు ఇదీ ఆనందం... చిట్టి చేతులు చెంపను తాకుతుంటే... అదో ఆనందం... చిన్నారి నవ్వు... ఓ స్ట్రెస్ బస్టర్. ‘‘కొన్ని త్యాగాలు... ఎన్నో ఆనందాల మధ్య అమ్మ అనే ఈ ప్రయాణం చాలా ఆనందంగా ఉంది’’ అంటున్నారు ప్రణీత. అసలు ‘అమ్మ అంటేనే ఆనందం’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారామె. ఇంకా ‘మదర్స్ డే సందర్భంగా’ ఇద్దరు పిల్లల తల్లిగా తన జీవితం ఎలా ఉందో పంచుకున్నారు హీరోయిన్ ప్రణీత.
పెళ్లి కాకముందు, తల్లి కాక ముందు ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు అదనంగా తల్లిగానూ ఫుల్ బిజీ. అయితే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇటు ఫ్యామిలీని చూసుకుంటూనే అటు కెరీర్‌ని కూడా కొనసాగించవచ్చు. నేనలానే చేస్తున్నాను. కానీ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు సినిమాలు కాస్త తగ్గించుకున్నాను.
అయితే టీవీ షో, యాడ్స్ చేస్తూ కెరీర్‌పరంగానూ బిజీగా ఉంటున్నాను. తల్లవగానే ఇంటికి పరిమితం అయిపోవాలన్నట్లుగా ఇప్పుడు ప్రపంచం లేదు. అమ్మాయిలకు కెరీర్ కూడా ముఖ్యమే. పిల్లలు స్కూల్‌కి వెళ్లేవరకూ కెరీర్‌ని పూర్తిగా మానేసుకోకుండా కాస్త స్లో చేసి, ఆ తర్వాత స్పీడప్ చేసుకోవచ్చు.
మా పాప అర్నాకి ఇప్పుడు మూడేళ్లు... బాబు జైకృష్ణకి ఇంకా ఏడాది కూడా నిండలేదు. పాపని ప్లే స్కూల్‌కి పంపుతున్నాం. మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళితే మధ్నాహ్నం ఒంటి గంటకు వస్తుంది. ఈలోపు బాబు పనులు పూర్తి చేసేసి, పాపకి ఫుడ్ తయారు చేసి, రాగానే తినిపించేస్తాను.
ఆ తర్వాత ఇద్దర్నీ నిద్రపుచ్చుతాను. అప్పుడు నాకు కాస్త తీరిక దొరుకుతుంది. మళ్లీ ఇద్దరూ నిద్ర లేచే సమయానికి ఏదైనా తినిపించడానికి ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత ఆటలు, డిన్నర్ టైమ్, నిద్రపుచ్చడం... ఇలా నా ఆలోచలన్నీ ఏం పెట్టాలి? ఎలా నిద్రపుచ్చాలి... అనేవాటి చుట్టూ తిరుగుతుంటాయి.
సెలబ్రిటీ మదర్ అయినా, కామన్ మదర్ అయినా ఎవరైనా తల్లి తల్లే. పనులు చేసి పెట్టడానికి హెల్పర్స్‌ని పెట్టుకున్నప్పటికీ తల్లిగా పిల్లలకు చేయాల్సిన పనులు ఏ తల్లికైనా ఉంటాయి. ఉదాహరణగా చె΄్పాలంటే... పిల్లల బట్టలు మడతపెట్టడానికి, వంట చేయడానికి మనుషులు ఉన్నప్పటికీ పిల్లలకు మాత్రం నేనే తినిపిస్తాను. ‘అమ్మ తినిపిస్తుంది’ అనేది వాళ్లకు అర్థం అవ్వాలి. తినిపించడం, ఆడించడం అన్నీ అమ్మే చేయాలి. పిల్లలకు అర్థమయ్యేవన్నీ అమ్మే చెయ్యాలి.
ఒక నటిగా ఫిజిక్‌ని పర్ఫెక్ట్‌గా మెయిన్‌టైన్ చేయడం చాలా అవసరం. అయితే తల్లయ్యాక అది సరిగ్గా వీలుపడటం లేదు. ఎందుకంటే ఇంతకు ముందైతే ఓ గంట వర్కవుట్ చేసి, అలసట తీరేంతవరకూ రిలాక్స్ అయ్యేదాన్ని. ఇప్పుడు వర్కవుట్ పూర్తి కాగానే పిల్లల పనులు ఉంటాయి. ఇక, అలసట తీర్చుకునేది ఎప్పుడు? అందుకే ఒక్కోసారి వర్కవుట్స్ మానేస్తున్నాను.
అయితే పిల్లల కోసం చేసేది ఏదైనా హ్యాపీగా ఉంటుంది. ఫిజిక్ గురించిన ఆలోచన పక్కకు వెళ్లి΄ోతుంది (నవ్వుతూ). అలాగే కెరీర్ బ్యాక్‌సీట్‌లోకి వెళ్లి΄ోవడం సహజం. ఈ ప్రపంచంలో ‘మదర్‌హుడ్’ అనేది బెస్ట్ జాబ్ అని నా ఫీలింగ్. ఆ అద్భుతమైన అనుభూతి కోసం చేసే చిన్ని త్యాగాలు ఆనందాన్నే ఇస్తాయి.
పాప పుట్టాక ఏం చేసినా.. పాపకు సౌకర్యంగానే ఉందా? సరిగ్గా చూసుకుంటున్నామా?’ అనిపించేది. బాబు పుట్టాక కూడా అది కంటిన్యూ అవుతోంది. పిల్లలు పెద్దయ్యాక కూడా తల్లికి ఈ డౌట్ ఉంటుందేమో! మొత్తం మీద నాకు అర్థమైందేంటంటే పిల్లలను ఎంత బాగా చూసుకున్నా తల్లికి తృప్తి ఉండదేమో.
మావారు (నితిన్ రాజు) వీలు కుదిరినప్పుడల్లా పిల్లలను చూసుకుంటారు. ఇంటికి రాగానే పిల్లలను ప్లే ఏరియాకి తీసుకెళ్లడం, ఆడించడం చేస్తుంటారు. మా పాపను స్విమ్మింగ్‌లో చేర్పించాం. ఆ క్లాస్‌కి తీసుకెళతారు. ఇలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు.
– డి.జి. భవాని
(చదవండి: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!)