Mothers Day: అమ్మలుగా.. అధికారులుగా | Sakshi
Sakshi News home page

Mothers Day: అమ్మలుగా.. అధికారులుగా

Published Sun, May 14 2023 4:36 AM

- - Sakshi

నల్గొండ: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్‌ పమేలా సత్పతి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె తన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటున్న తీరు ఆదర్శనీయం. తన కుమారుడిని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. ఆ తర్వాత ప్రాథమిక విద్య కోసం స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో దగ్గరుండి చేర్పించారు.

కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఇతర అంశాలపై పట్టు దొరికే విధంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. పలుచోట్లకు తనతో పాటు తీసుకెళ్లి తల్లి మమకారాన్ని పంచుతున్నారు. మొత్తంగా కలెక్టర్‌గా బిజీగా ఉంటూనే తన బిడ్డ బాగోగులను ఎప్పటి కప్పుడు చూసుకుంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న సమ యంలోనూ పమేలా సత్పతి తన చిన్న బాబుతోనే వార్డుల్లో పరిశీలనకు వెళ్లేవారు.

బాలికలకు ‘రక్ష స్నేహిత’
సమాజంలో మహిళలు, బాలికలు నిత్యం ఏదో ఓ చోట హింసకు గురవుతూనే ఉన్నారు. భద్రతపై వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కలెక్టర్‌ పమేలా సత్పతి ‘రక్ష స్నేహిత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అధికారులను, ప్రజాప్రతినిధులను, వైద్యారోగ్య సిబ్బందిని భాగస్వాములను చేస్తున్నారు. విద్యార్థినులు వేధింపులకు గురైన సమయంలో ఎలా స్పందించాలి.. గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ కాన్సెప్ట్‌తో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తల్లే.. మార్గదర్శకురాలు
కలెక్టర్‌ పమేలా సత్పతికి తన తల్లి మార్గదర్శకురాలు. చిన్నపటి నుంచే చనువు ఎక్కువ. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆమె.. ప్రతి చిన్న అంశాన్ని కూడా తల్లితో పంచుకునేవారు. బిడ్డ చెప్పిన ప్రతి అంశాన్ని తల్లి తన మనసులో పెట్టుకుని మంచి చేసే అంశాలను తెలియజేసేవారు. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రుల స్ఫూర్తి, ప్రోత్సాహంతోనే ఐఏఎస్‌ సాధించానంటున్నారు పమేలా సత్పతి. 

శాంతిభద్రతలు కాపాడడంలో తనదైన ముద్ర వేస్తూనే.. ఏడాదిలోపు వయసున్న తన ఇద్దరు (కవలలు) పిల్లల పెంపకంలో తల్లిగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు నల్లగొండ ఎస్పీ అపూర్వరావు. విధుల్లో భాగంగా పిల్లలకు దూరంగా ఉండాల్సిన సమయంలో తన తల్లి లేదా అత్తను వారి వద్ద ఉంచి పిల్లల బాగోగులు చూసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఖాళీ సమయంలో పిల్లలతోనే ఎక్కువగా గడుపుతారు.

జిల్లాలో గంజాయిని అదుపు చేయడంలో, అంతరాష్ట్ర ముఠా దొంగల ఆటకట్టించడంలో ఎస్పీగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు.   సమస్య ఉందని గ్రీవెన్స్‌డేలో తన వద్దకు వచ్చే వారికి భరోసా కల్పిస్తున్నారు. షీటీంను పటిష్టం చేసి ఆకతాయిల ఆగడాలను కట్టడి చేశారు. సామాజిక మాద్యమాల ద్వారా మోస పోకుండా ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. విధుల్లో భాగంగా ఎంత బిజీగా ఉన్న ముందుగానే ప్రణాళికలు వేసుకుని.. తన పిల్లలతో గడిపేందుకు కూడా సమయం ఇస్తున్నారు.

పిల్లలతో గడపడం ఇష్టం
అమ్మ తోడుంటే జీవితం బంగారుమయంగా మరుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ప్రతిఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర కీరోల్‌గా ఉంటుంది. క్రమశిక్షణ, చదువు, భవిష్యత్‌కు తల్లే మార్గదర్శిగా నిలుస్తుంది. తల్లిగా నేను ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసూ్తనే విధులు నిర్వహిస్తున్నాను. నాకు పిల్లలు దూరంగా ఉన్నప్పుడు వీలైనంత తొందరగా.. వారి దగ్గరకు చేరేలా ప్లాన్‌ చేసుకుంటా. అమ్మ ఆర్థిక స్వావలంబన సాధిస్తేనే.. పిల్లలకు మంచి భవిష్యత్‌ ఇవ్వగలుగుతుంది.
– అపూర్వరావు, ఎస్పీ 

Advertisement
Advertisement