భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే..
నల్లగొండ : భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కేంద్ర సాంస్కతిక శాఖ, పీఎం శ్రీ పాఠశాలల జాయింట్ సెక్రెటరీ, నోడల్ అధికారి కమలేష్ కుమార్‌మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో పీఎంశ్రీ పాఠశాలల ద్వారా అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీఎంశ్రీ పాఠశాలలకు ఇస్తున్న కంప్యూటర్లు, టింకరింగ్ ల్యాబ్స్ వంటి అన్ని సదుపాయాలను విద్యార్థులు ప్రత్యక్షంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు అందరూ కంప్యూటర్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పీఎంశ్రీ పాఠశాలల కింద మంజూరైన నిధులతో అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, వాననీటి నిలువ కట్టడాలు, సైన్స్ ల్యాబ్‌లు, టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. జిల్లాకు 98 పనులు మంజూరు కాగా, ఇప్పటివరకు 20 పూర్తి చేశామని తెలిపారు. అంతకుముందు జాయింట్ సెక్రటరీ కమలేష్ కుమార్ మిశ్రాకు కలెక్టర్ చంద్రశేఖర్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రతినిధి ఉషారాణి, డీఈఓ భిక్షపతి, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
పీఎం శ్రీ పాఠశాలల జాయింట్
సెక్రెటరీ కమలేష్ కుమార్‌మిశ్రా


