కేసులు నమోదు చేసిన ఏడు మిల్లులపై అమలు | - | Sakshi
Sakshi News home page

కేసులు నమోదు చేసిన ఏడు మిల్లులపై అమలు

Feb 27 2026 4:15 AM | Updated on Feb 27 2026 4:15 AM

కేసుల

కేసులు నమోదు చేసిన ఏడు మిల్లులపై అమలు

అధికారులపై చర్యలు చేపట్టాలి – సోమారపు సత్యనారాయణ

సీఎంఆర్‌ ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వానికి నష్టం చేసేలా సహకరించిన, ఆ సమయంలో సీఎంఆర్‌ రాబట్టడంలో విఫలమైన అధికారులపైనా చర్యలు చేపట్టాలని అడ్వకేట్‌ సోమారపు సత్యనారాయణ రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అప్పటి అధికారులే మిల్లర్లతో కుమ్మకై ్క మామూళ్లు పుచ్చుకొని మిల్లర్ల అక్రమాలకు వంత పాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి మిల్లుల నుంచి సీఎంఆర్‌ వసూలు చేయకుండా విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఆయా మిల్లులపై కఠిన చర్యలు చేపట్టి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రాబట్టాలని కోరారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్న మిల్లులపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆయా మిల్లులు ఉన్న మండలాలకు చెందిన తహసీల్దార్లకు గురువారం సాయంత్రం అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జె.శ్రీనివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయా మిల్లర్లపై ఇప్పటికే జిల్లా పౌరసరఫరాల సంస్థ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత 316 (2), 316(5), 318 (3), ఎషెన్షియల్‌ కమాడిటీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 7 కింద కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా చిట్యాల మండలంలోని వరలక్ష్మి మిల్‌, మనుగోడులోని మరళీ మనోహర్‌ ఆగ్రోఫుడ్స్‌, నల్లగొండలోని సుమాంజలి మిల్లుల యజమానులు కందుకూరి మహేందర్‌, కందుకూరి పద్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

5.89 లక్షల క్వింటాళ్ల

ధాన్యం మింగిన మిల్లర్లు

జిల్లాలోని ఏడు మిల్లుల యజమానులు 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని అమ్ముకొని రూ.191.93 కోట్లు కొట్టేశారు. దీనిపై.. మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యమే లేదని, ఎప్పుడో కాకినాడ పోర్టుకు మళ్లించారంటూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అడ్వకేట్‌ సోమారపు సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అసలు ఆ మిల్లుల్లో ధాన్యం ఉందా? లేదా. తేల్చాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్‌ అప్పట్లో కమిటీ వేసి మిల్లుల్లో విచారణ జరిపారు. ఆయా మిల్లుల్లో ధాన్యం లేదని అధికారుల కమిటీ తేల్చింది. దానిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పోలీస్‌స్టేషన్లలో ఆయా మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. అయితే జరిగిన నష్టాన్ని రాబట్టుకునేందుకు ఆర్‌ఆర్‌ యాక్ట్‌ అమలుకు అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఏ మిల్లు నుంచి ఎంత రావాల్సి ఉందన్న వివరాలను తెలియజేశారు.

ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద ఏం చేస్తారంటే..

● ఆర్‌ఆర్‌ యాక్ట్‌ సెక్షన్‌ 25 ప్రకారం.. కచ్చితమైన గడువులోగా ధాన్యం లేదా దాని విలువైన డబ్బును చెల్లించాలని డిఫాల్టర్‌కు డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తారు. ఆ గడువులో చెల్లించడం విఫలమైతే అటాచ్‌మెంట్‌ ప్రక్రియ వెంటనే చేపడతారు.

● సెక్షన్‌ 5 –27 ప్రకారం.. వారికి సంబంధించిన వాహనాలు, యంత్రాలు, బియ్యం నిల్వలు, స్థిరాస్తుల (భూమి, భవనాలు) అటాచ్‌ చేస్తారు. దాంతో ఆ ఆస్తులపై మిల్లర్లు ఎలాంటి క్రయవిక్రయాలు చేయలేరు. ఇతరులుకు బహుమతి లేదా లీజుకు ఇవ్వలేరు.

● సెక్షన్‌ 36 ప్రకారం.. జరిగిన నష్టాన్ని తిరిగి మిల్లర్లు చెల్లించకపోతే, దాన్ని పొందేందుకు అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయిస్తారు.

● జరిగిన నష్టంపై 25 శాతం జరిమానాను అదనంగా వసూలు చేస్తారు. ఎవరైనా గ్యారెంటీగా ఉంటే వారినుంచైనా వసూలు చేస్తారు. వారిపై ఏకకాలంలో క్రిమినల్‌, ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా చర్యలు ఉంటాయి.

● ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా తరలించినందుకు వారిపై ఎసెన్షియల్‌ కమాడిటీస్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తారు. మిల్లర్లతోపాటు వారి భాగస్వాములపైనా క్రిమినల్‌ చర్యలు ఉంటాయి.

● ఆయా మిల్లులను డిఫాల్ట్‌ మిల్లుగా పేర్కొంటూ శాశ్వతంగా బ్లాక్‌ లిస్టులో పెడతారు. వాటికి ప్రభుత్వ ట్యాగింగ్‌ తొలగిస్తారు.

● ఆయా మిల్లుల బ్యాంకు ఖాతాలనుస్తంభింపజేస్తారు.

ఫ సంబంధిత తహసీల్దార్లకు అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ ఆదేశాలు

ఫ 5,89,533 క్వింటాళ్ల వేలం ధాన్యం మాయం చేసిన ఏడుగురు మిల్లర్లు

ఫ ఆ ధాన్యం విలువ

రూ.191.13 కోట్లు

కేసులు నమోదు చేసిన ఏడు మిల్లులపై అమలు 1
1/1

కేసులు నమోదు చేసిన ఏడు మిల్లులపై అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement