వారికి స్నేహం విలువ గురించి బాగా తెలుసు. కానీ స్నేహితులు లేరు. స్నేహం చేయాలనే బలమైన సంకల్పం ఉంది. కానీ స్నేహితులు లేరు. బుద్ధిమాంద్యం ఉన్న చాలామంది పిల్లలకు స్నేహం దూరం అవుతోంది. దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకుల కోసం ముంబైకి చెందిన మోనీషా, గోపిక అనే మహిళలు ఫ్రెండ్‌షిప్ యాప్ ‘బడ్డీ అప్ నెట్‌వర్క్’ను అభివృద్ధి చేశారు. వారికి కొత్త స్నేహప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు...
ఆటిజమ్‌తో ఉన్న ఇరవై సంవత్సరాల వీర్‌కు స్నేహితులు ఎవరూ లేరు. ఈ విషయం అతడి తల్లి గోపికను బాగా బాధ పెట్టేది. తన కుమారుడు మాత్రమే కాదు ఆటిజమ్‌తో బాధపడుతున్న ఎంతోమంది పిల్లలకు స్నేహితులు లేక΄ోవడాన్ని గమనించింది. వారికి స్నేహం మాత్రమే కాదు ఆటలు కూడా దూరంగానే ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మోనీషతో కలిసి ‘బడ్డీ అప్ నెట్‌వర్క్’ యాప్ డెవలప్ చేసింది గోపిక.
ఆటలతో స్నేహం... స్నేహంతో ఆటలు
‘బడ్డీ ఆఫ్ నెట్ వర్క్’ యూప్ ద్వారా పిల్లలు ఆటల ప్రపంచంలోకి వెళతారు. 45నిమిషాలలో ఆ ఆటల ద్వారా తమలాంటి పిల్లలతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత స్నేహితులవుతారు. వారు ఆట ఆడిన ప్రతిసారీ ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతారు!
‘వారి స్నేహాలు అందరిలాంటివి కాకపోవచ్చు. ఆ వైవిధ్యాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా యాప్‌ను డిజైన్ చేశాం. నా కుమారుడు వీర్ అతని స్నేహితుడు మిహాన్‌లకు భిన్నమైన అభిరుచులు ఉన్నాయి. వీర్ పజిల్స్‌ను ఇష్టపడతాడు. సైక్లింగ్, ఈత, రన్నింగ్ అంటే ఇష్టం.
ఇక మిహాన్ సంగీత అభిమాని. భిన్నమైన అభిరుచులు కలిగిన స్నేహితులకు ఒకే ఉమ్మడి వేదిక దొరకకపోచ్చు. ఆ లోటును తీర్చేలా బడ్డీ ఆఫ్ నెట్‌వర్క్‌ను రూపొందించాం’ అంటుంది గోపిక.
వైకల్యం స్నేహానికి అడ్డుకాదు
స్నేహంలో ఒకరి జోక్‌లకు ఒకరు బిగ్గరగా నవ్వుకోవడం సహజమే. ‘బడ్డీ ఆఫ్ నెట్‌వర్క్’ స్నేహితులు మాత్రం కేవలం నవ్వులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకుంటారు. ఒకరి ప్రతిభను ఒకరు అభినందించుకుంటారు. లెగో బ్లాక్స్‌తో ఎయిర్‌క్రాఫ్ట్, గాలిమర మోడల్స్‌ను వీర్ తయారు చేస్తున్నప్పుడు ‘వావ్’ అంటూ ప్రశంసించడమే కాకుండా వీర్ ప్రతిభ గురించి ఇతర స్నేహితులతో చెబుతాడు మిహాన్. ‘ఎవరి దగ్గరికైనా వెళ్లి నువ్వు నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తావా? అని అడగడం నాకు కష్టంగా ఉంటుంది. నీతో స్నేహం చేస్తాను అని ఎవరైనా అడిగితే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది’ అంటాడు వీర్.
మిహాన్ మాత్రం కొత్త వాళ్ల దగ్గరికి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందీ పడడు. నలుగురిలో కలవడం అంటే అతడికి ఇష్టం. మిహాన్ ఫ్రెండ్స్‌లో ఒకరికి మాటల లోపం ఉంది. సరిగ్గా మాట్లాడలేడు. అయితే వారి స్నేహానికి అదేమీ అడ్డుగోడ కాలేదు. మిహాన్ కబుర్లు చెబుతుంటే ఆ ఫ్రెండ్ ఆసక్తిగా వింటుంది. తను మాట్లాడడానికి మరీ ఇబ్బందిగా అనిపిస్తే కాగితంపై రాసి చూపిస్తుంది. ‘స్నేహానికి వైకల్యం అడ్డు కాదు... అనే భావనతోనే బడ్డీ ఆఫ్ నెట్‌వర్క్‌ను డిజైన్ చేశాం’ అంటుంది గోపిక.
తల్లిదండ్రులు సంతోషించేలా...
తమ బిడ్డల సరికొత్త స్నేహితులను చూసి వారి తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. ‘గతంలో లేని ఉత్సాహం మా అబ్బాయిలో కనిపిస్తోంది’ ‘మేమే తన ప్రపంచం అన్నట్లుగా ఒకప్పుడు మా అబ్బాయి ఉండేవాడు. మేమే కనిపించకపోతే అదోలా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం అలా కాదు. స్నేహితులు తనతో ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటాడు!’ అంటున్న తల్లిదండ్రులు ఎందరో!
‘ప్రతి ఒక్కరికీ ఒక ఫ్రెండ్ ఉండాలి’ అంటున్నాడు మిహాన్. నిజమే కదా! ఆ నిజాన్ని ‘బడ్డీ అప్ నెట్‌వర్క్’ అక్షరాలా నిజం చేసింది.


