
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు బుధవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వస్తుండడంతో ప్రభుత్వం, టూరిజం శాఖ అధికారులు ఆ బృందానికి స్వాగతం పలుకుతూ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇటీవల మిస్ ఇండియా నందిని గుప్తా రామప్ప ఆలయాన్ని సందర్శించి ఫొటో షూట్ చేశారు. ఆమె ఆలయం చుట్టూ తిరుగుతూ శిల్పాకళా సంపదను తనివితీరా చూస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. నిమిషం నిడివి ఉన్న ఒక వీడియో, 38 సెకన్లు ఉన్న మరో వీడియోను రూపొందించి విడుదల చేశారు.
ఆలయ శిల్ప కళా సంపద, చరిత్రను వివరిస్తూ ప్రపంచ సుందరీమణులకు స్వాగతం పలుకుతూ చేసిన ఈ ఆహ్వాన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా, హైదరాబాద్‌నుంచి సుందరీమణులు మన బ్రాండ్ ప్రపంచమంతా తెలిసేలా ‘తెలంగాణ జరూర్ ఆనా’ పేరుతో ఉన్న ఏసీ బస్సులో రానున్నారు.
3డీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై –రెజల్యూషన్ ప్రొజెక్టర్లు
ప్రపంచ సుందరీమణులు రాక సందర్భంగా ఖిలావరంగల్ కోటలోని కట్టడాలు, శిల్ప కళా సంపద విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. కట్టడాలు మరింత ఆకర్శణీయంగా కనిపించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ 3డీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై –రెజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి అధునాతన సాంకేతికతను వినియోగించారు. బంగారు, తెలుపు వర్ణం కాంతుల్లో శిల్పాలు మెరిసిపోతున్నాయి. దీనికితోడు ఫ్లడ్‌లైట్లు, ఎల్‌ఈడీ(వామ్) లైట్ల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.