
హైదరాబాద్ నగరంలో గృహ అక్వేరియం సంస్కృతి అంతకంతకూ విస్తరిస్తోంది. పాత అలంకరణే అయినా నగరవాసులు తమ ఇళ్లలో అక్వేరియంలను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త ఆహ్లాదకర వాతావరణాన్ని ఇష్టపడుతున్నారు. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను పొందేందుకు కూడా ఉపయోగపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ఇంట్లో గడిపే సమయం పెరిగినప్పుడు అక్వేరియంల పట్ల ఆదరణ రెట్టింపైనట్టు అంచనా. ప్రస్తుతం వేసవి సెలవుల్లోనూ పిల్లలు, పెద్దలు వీటి వద్ద ఎక్కువ సమయం గడుపుతున్నారు.
భాగ్యనగరంలోని గృహ అక్వేరియమ్స్‌లో పలు ఫిష్ వెరైటీలు సందడి చేస్తున్నాయి. వాటిలో గుప్పీ, బెట్టా, నియాన్ టెట్రా, కార్డినల్ టెట్రా, గోల్డ్‌ఫిల్డ్, కాయ్, ఫ్లవర్‌హార్న్ వంటి చేపలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చేపలు అందమైన రంగులు, ఆకారాలతో ఆకట్టుకుంటున్నాయి
పలు చోట్ల అందుబాటులో..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అక్వేరియం స్ట్రీట్ సహా అనేక చోట్ల అక్వేరియం షాపులు, బజార్లు ఉన్నాయి, అదే కాకుండా ఫిషీకార్ట్, బెస్ట్ 4పెట్స్ వంటి ఆన్‌లైన్ స్టోర్లు కూడా భిన్న రకాలైన చేపలు, ట్యాంకులు, ఆక్వాటిక్ ప్లాంట్స్, ఫిష్ ఫుడ్, ఫిల్టర్లు, ఇతర ఉపకరణాలను ఇంటి ముంగిటకే డెలివరీ చేస్తున్నాయి.
ధరలు ఇలా..
అక్వేరియంకు ఉపయోగించేందుకు అవసరమైన చిన్న ట్యాంకులు (5–10 లీటర్లు) ధరలు రూ.1,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. మధ్యస్థ ట్యాంకులు (20–50 లీటర్లు): రూ.2,000 నుంచి రూ.5,000 వరకు, పెద్ద ట్యాంకులు (60 లీటర్లు పైగా): రూ.6,000 నుంచి రూ.15,000 వరకూ అందుబాటులో ఉన్నాయి. ఇక చేపలలో గుప్పీ, టెట్రా వంటి సాధారణ చేపలు రూ.30 నుంచి రూ.100 వరకు ఉన్నాయి. బెట్టా, కాయ్ వంటి ప్రత్యేక చేపలు రూ.100 నుండి రూ.500 వరకూ ధరల్లో లభిస్తున్నాయి. ఫిల్టర్లు, హీటర్లు, వంటి ఉపకరణాలు, లైటింగ్, డెకరేషన్ వస్తువులు రూ.500 నుండి రూ.2,000 వరకు అందుబాటులో ఉన్నాయి.
ఫిష్ వెరైటీలు.. ప్రత్యేకతలు..
గప్పీస్ : ఇవి చిన్నదైన, రంగురంగుల మత్సా్యల్లా వివిధ రంగుల్లో లభిస్తాయి.. సులభంగా సంరక్షించగలగడం వల్ల కొత్తవారికి మంచి ఎంపిక.
మోల్లీస్ : ఇవి శాంతస్వభావ చేపలు. తక్కువ ఖర్చుతో పెంచవచ్చు. స్వీట్ వాటర్‌కి స్వల్ప ఉష్ణోగ్రత మార్పులకు అనువుగా ఉంటాయి.
ప్లాటీస్: చిరు తడిగా సంచరించే ఇవి పిల్లలకు ఎంతో ఇష్టమైనవి. మిశ్రమ ఆహారంతో పెంచవచ్చు. బహుళ రంగుల్లో లభిస్తాయి.
గోల్డ్‌ఫిష్ : శతాబ్దాలుగా ఆదరణ పొందుతున్న ఈ చేపలు కొంచెం ఎక్కువ స్థలంతో కూడిన ట్యాంక్‌లో ఉంచాలి. శుభ్రత సరైన ఆహారానికి వీటికి బాగా అవసరం.
టెట్రాస్ (Tetras) : ఇవి గుంపులుగా తిరిగే చేపలు. నియాన్ టెట్రాస్ వంటి జాతులు ఎంతో ప్రసిద్ధి. వీటికి సాఫ్ట్ వాటర్, మితమైన ఉష్ణోగ్రత అవసరం.
ఏంజెల్ ఫిష్ : విలక్షణమైన ఆకారంతో ఇవి గుంపులుగా స్వేచ్ఛగా తిరుగుతాయి. సాఫ్ట్ వాటర్ సరైన ట్యాంక్ స్నేహస్వభావం కలిగిన చేపలతో పెంచితే మంచిది.
బెట్టా ఫిష్.. గృహ అక్వేరియానికి ప్రత్యేక ఆకర్షణ..
అందమైన రెక్కలు, ప్రకాశవంతమైన రంగులు, చురుకైన స్వభావం.. ఇవన్నీ బెట్టా చేపలకు గుర్తింపు తెచి్చన లక్షణాలు. ‘సియామ్ ఫైటింగ్ ఫిష్’గా కూడా ప్రసిద్ధిగాంచిన ఈ చేపలు నగర గృహాల్లోని అక్వేరియంలలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. బెట్టా చేపలు తాయ్‌లాండ్, కంబోడియా వంటి ఆసియన్ దేశాలకు చెందినవి.
మగ బెట్టాలు తమ ప్రదేశాన్ని రక్షించేందుకు ఇతర మగ చేపలపై దాడికి కూడా వెళతాయి. అందువల్ల ఒక ట్యాంక్‌లో ఒక్క మగ బెట్టా చేపను మాత్రమే ఉంచడం సురక్షితం. దీనిని పెంచడానికి కనీసం 5 లీటర్ల నీటి సామర్థ్యం ఉండే ట్యాంక్ అవసరం. చిన్న గాజు గిన్నెల్లో కాకుండా గాలి పంపు, హీటర్ కలిగిన ట్యాంక్ మంచిది.
ఈ బెట్టా చేపలు 24డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలో జీవిస్తాయి. వీటికి ప్రత్యేకమైన బెట్టా పెలెట్స్, అకేషనల్ బ్లడ్ వారŠమ్స్, లేదా బ్రెయిన్ ష్రింప్స్ వంటివి రోజుకు రెండు సార్లు ఆహారంగా ఇవ్వాలి. ఇవి బ్లూ, రెడ్, వైట్, పర్పుల్, మెటాలిక్ షేడ్స్‌లో లభ్యమవుతాయి. హాఫ్ మూన్, క్రౌన్ టెయిల్, ప్లాకాట్ వంటి రెక్కల ఆకారాల్లోనూ ఉన్నాయి.
ఈ సూచనలు పాటించాలి..
ప్రతి చేపకు తనదైన ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాటిపై అవగాహన, ఆహారం, నీటి శుభ్రత, పీహెచ్ స్థాయి వంటి అంశాల్లో శ్రద్ధ అవసరం. మొదటిసారిగా చేపలు పెంచే వారు గప్పీస్ లేదా ప్లాటీస్‌తో ప్రారంభించడం మంచిది. ఆన్‌లైన్ ఆర్డర్ చేయడానికి ముందు, స్టోర్ గురించిన రివ్యూలు, రేటింగ్స్ పరిశీలించాలి.
చేపల ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు, స్టోర్ నుంచి ఆరోగ్య సర్టిఫికెట్లు లేదా గ్యారంటీల వంటివి ఉన్నాయేమో చూడాలి. అక్వేరియం నిర్వహణకు సంబంధించిన సూచనలు మార్గదర్శకాలను స్టోర్ నుంచి పొందగలిగితే బెటర్. ప్రస్తుతం ట్యాంకులు శుభ్రపరిచేందుకు హానికరమైన వ్యర్థాలను తినేందుకు ప్రత్యేకంగా పలు వెరైటీల ఫిష్‌లు అందుబాటులోకి వచ్చాయి వాటిని పరిశీలించాలి.
(చదవండి: ఇంటి 'గుట్టు' వంటింటికి చేటు..!)