
ఫస్ట్ రన్నర్–అప్ హాసెట్ డెరెజె అడ్మస్సు
(ఇథియోపియా)
హాసెట్ డెరెజె అడ్మస్సు రెండవ స్థానంలో నిలిచి మిస్ వరల్డ్ చరిత్రలో అత్యున్నత ర్యాంకింగ్ సాధించింది. ఇథియోపియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ అందాలభామ, ఫస్ట్ రన్నర్–అప్‌గా , మిస్ వరల్డ్ ఆఫ్రికా టైటిల్‌ను గెలుచుకున్నారు. కెమికల్ ఇంజినీరింగ్ చేస్తున్న పంతొమ్మిదేళ్ల హాసెట్ దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ టీన్ ఇథియోపియా, కిందటేడాది మిస్ వరల్డ్ ఇథియోపియా పోటీలో విజేతగా నిలిచారు.
ఇథియోపియాలోని మహిళల విద్య, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ సమాజాలలో తల్లీబిడ్డల ఆరోగ్యం, బాలికల విద్యపై దృష్టి సారించిన ఆమె ‘‘బ్యూటీ విత్ ఎ పర్పస్’’ ప్రాజెక్ట్ న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నా పనే నా కిరీటం
కిరీటం మరొకరికి వెళ్లచ్చు. కానీ, నా అంతర్గత అందం నేను చేసే పనిపైనే ఉంటుంది. అదే నాకు కిరీటం. స్థానికంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సమానత్వం, లింగ సాధికారత కోసం ఒక గొంతుకగా పనిచేస్తాను. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయ, సాంస్కృతిక పరిమళాన్ని అర్థం చేసుకున్నాను. ఆస్వాదించాను. ఈ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది. ఓ పా గురించి చె ప్పాలంటే తను చాలా హార్డ్ వర్కర్. నేను తనకు చాలా పెద్ద అభిమానిని. తనకు కిరీటం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో భిన్నమైన క్వాలిటీస్ ఉన్నాయి. నిజానికి అందం అంటే అందరూ అనుకుంటున్నట్టు చర్మం, జుట్టు, గోళ్లు, డ్రెస్సింగ్.. ఇవి కావు. మన చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయడమే. మా పేరెంట్స్ నా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారు. నా ఈ విజయానికి నా కుటుంబ మద్దతు ఎంతో ఉంది.
మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం...
ఇథియోపియాలో మానసిక ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాను. మాయా చారిటబుల్ ఆర్గనైజేషన్ కు అంబాసిడర్‌గా ఉంటూ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాను. మిస్ వరల్డ్ అనేది కేవలం అందానికి సంబంధించినది మాత్రమే కాదు. నా దేశం నుంచి ఈ స్థాయికి చేరిన తొలి ఇథియోపియన్ నేనే. మిస్ వరల్డ్ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లులు, వారి పిల్లల జీవితాలలోనూ స్ఫూర్తి నింపేది’’ అని చె ప్పారు.