పారాహుషార్‌... ప్రోస్టేట్‌ క్యాన్సర్‌... | Prostate Cancer Awareness Gap Risk Factors | Sakshi
Sakshi News home page

పారాహుషార్‌... ప్రోస్టేట్‌ క్యాన్సర్‌...

Oct 18 2026 9:11 PM | Updated on Oct 18 2026 9:16 PM

Prostate Cancer Awareness Gap Risk Factors
  • ఆందోళనకర స్థాయిలో అవగాహనలోపాలు

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అవగాహనకు సంబంధించి ఢిల్లీకి చెందిన హీల్ ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ సర్వేలో కీలక విషయాలు తెలిశాయి. 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రమాద కారకాన్ని గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు. ఇది దేశవ్యాప్తంగా విస్తృతమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది. 

ఈ సర్వేలో ఢిల్లీ ఎన్సీఆర్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మహారాష్ట్రలో 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు పాల్గొన్నారు. ఈ సర్వేలో 45 ఏళ్లు పైబడిన 68.9% మంది పురుషులు ఒక్క ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోయారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రమాదానికి సంబంధించిన ముఖ్యమైన కారణాల్లో ఒకటైన కుటుంబ చరిత్రను కేవలం 13.2% మంది మాత్రమే గుర్తించారు. ఈ అవగాహన లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  

ఎవరు ప్రమాదంలో ఉన్నారు, ఎప్పుడు పర్యవేక్షణ ప్రారంభించాలి? వైద్యులతో ముందుగానే చర్చించడం ఎందుకు ముఖ్యమైనది? అనే దానిపై మరింత బలమైన ప్రచారం అవసరమని ఈ జాతీయ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ అవగాహన లోపం స్క్రీనింగ్‌ బిహేవియర్లో కూడా ప్రతిబింబిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రతి ఆరు గురిలో ఒకరు మాత్రమే తాము ఎప్పుడైనా స్క్రీనింగ్‌ చేయించుకున్నట్టు చెప్పగా 60.8% మందికి తమ స్క్రీనింగ్‌ స్టేటస్‌ గురించి తెలియదు. 

పిఎస్‌ఎ రక్త పరీక్షపై కూడా అవగాహన పరిమితమే.  కేవలం 31% మంది మాత్రమే దీని గురించి విన్నామన్నారు. కేవలం 14% మంది మాత్రమే ప్రత్యేకంగా పరీక్షను అభ్యర్థించారు. దాదాపు మూడింట రెండు వంతుల మంది పురుషులు  సాధారణ వార్షిక ఆరోగ్య పరీక్ష చేయించుకుంటామని చెప్పినా అందులో తప్పనిసరిగా ప్రోస్టేట్‌–నిర్దిష్ట స్క్రీనింగ్‌ సంబంధించిన ప్రత్యేక స్క్రీనింగ్‌ లేదని ఈ ఫలితాలు తేల్చాయి.

వ్యాధి లక్షణాలపై అవగాహన కూడా తక్కువే.. 
ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కూడా తక్కువగానే ఉంది. తరచుగా మూత్రవిసర్జన వంటి మూత్ర సంబంధిత లక్షణాలు, సుమారు 54% మందిలో ఉన్నట్టు గుర్తించగా బలహీనమైన లేదా మధ్యలో ఆగిపోయే మూత్ర ప్రవాహం అనే సమస్యకు గురవుతున్నట్టు సుమారు 44% మందిని గుర్తించారు. జాతీయ స్థాయిలో, 34% మంది స్క్రీనింగ్‌ అవసరం లేదని భావిస్తున్నామన్నారు.  సుమారు 28% మంది తమకు ఎటువంటి లక్షణాలు లేవకపోవడమే దీనికి కారణంగా చెప్పారు.

సుమారు 22% మంది తమకు వైద్యుడు ఈ పరీక్షలు సిఫారసు చేయలేదన్నారు. వైద్యులను సంప్రదించడం కూడా ప్రాధాన్యతకు నోచుకోవడం లేదు. జాతీయ స్థాయిలో 59.5% మంది పురుషులు ప్రోస్టేట్‌ స్క్రీనింగ్‌ లేదా చికిత్స గురించి వైద్యుడితో మాట్లాడటానికి అసౌకర్యంగా ఉందని చెప్పగా.. 18% మంది మాత్రమే సంభాషిస్తామని చెప్పారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు యూరాలజిస్టును  నిపుణుడిగా కేవలం 36% మంది మాత్రమే గుర్తించారు.  

కేవలం 13% మంది పురుషులు మాత్రమే కుటుంబ చరిత్రను ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రమాద కారకంగా గుర్తించారు. ఈ అవగాహన లోపాలు  65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులలో  మరింత స్పష్టంగా కనిపించాయి. ‘దాదాపు 10 మందిలో ఏడు గురు  ఒక్క ప్రమాద కారకం పేరు కూడా చెప్పలేకపోవడం ఆందోళనకరం. వ్యాధి చికిత్సలో ఈ ప్రమాద– కారకాలపై అవగాహన తప్పనిసరి. లక్షణాలు కనిపించిన తర్వాత మాత్రమే వైద్యుడిని సంప్రదించాలి అనుకోవడం సరైంది కాదు’ అని  హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌  కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజీ డాక్టర్‌ వి వెంకట సంపత్‌ అన్నారు.  

‘ముందస్తు వైద్య సేవలు అందుకోవడానికి మాత్రమే కాకుండా, క్యాన్సర్‌ నిర్ధారణ అయినప్పుడు వ్యాధి ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అవగాహన ముఖ్యమైనది. అధునాతన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్న తగిన రోగులకు రేడియోలిగాండ్‌ థెరపీతో సహా పలు చికిత్సలు అభివృద్ధి చెందుతున్నందున, తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి  తెలుసుకోవాలి. బలమైన అవగాహన ఏర్పడటం ద్వారా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ పై చర్యలు ముందుగానే ప్రారంభమై చికిత్సా ప్రక్రియ అంతటా కొనసాగేందుకు సహాయపడుతుంది’ అని ఏఐజీ హాస్పిటల్స్‌ మెడికల్‌ ఆంకాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం వంశీ కృష్ణ  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement