నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి.. కానీ అక్కడ మాత్రం లాబొరేటరీలో..!

Mini star created in nuclear fusion experiment In UK - Sakshi

నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి కదా, మరి లాబొరేటరీలో నక్షత్రం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే! లాబొరేటరీలోనే ఇటీవల ఒక బుల్లి నక్షత్రాన్ని తయారు చేశారు బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు. ఆక్స్‌ఫర్డ్‌ సమీపంలోని ‘జాయింట్‌ యూరోపియన్‌ టారస్‌’ (జేఈటీ) లాబొరేటరీలో దీనిని తయారు చేసినట్లు యూకే అటామిక్‌ ఎనర్జీ అథారిటీ (యూకేఏఈఏ) వెల్లడించింది. 

ఈ బుల్లి నక్షత్రం ద్వారా కేవలం ఐదు సెకండ్లలోనే ఏకంగా 59 మెగాజౌల్స్‌ శక్తిని ఉత్పత్తి చేసి, 1997 నాటి రికార్డును శాస్త్రవేత్తలు బద్దలు కొట్టారని యూకేఏఈఏ ప్రకటించింది. ఐదు సెకండ్లలో ఈ బుల్లి నక్షత్రం ద్వారా ఉత్పత్తి చేసిన శక్తితో ఐదు సెకండ్ల పాటు 35 వేల ఇళ్ల విద్యుత్‌ అవసరాలను తీర్చవచ్చు. ఇది కేవలం ప్రయోగాత్మకంగా నమూనాలా ఉత్పత్తి చేసిన విద్యుత్తు మాత్రమే! ఐదు సెకన్ల ప్రయోగం కోసం ఇందులో కేవలం 0.1 మిల్లీగ్రాము డీయుటేరియం, ట్రిటియమ్‌ కణాలను ఉపయోగించారు. ఇవి రెండూ హైడ్రోజన్‌కు చెందిన ఐసోటోప్‌లు. 

న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ ద్వారా పనిచేసే ఈ బుల్లి నక్షత్రం పూర్తిస్థాయిలో పనిచేస్తే, ఇది ఏకంగా సూర్యుడికి పదిరెట్ల వేడిమిని ఉత్పత్తి చేయగలదు. దీని ద్వారా కాలుష్యంలేని విద్యుత్తును చిరకాలం సరఫరా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు నిజానికి 1980లలోనే మొదలైంది. ఇది విజయవంతమైతే, 2050 నాటికి ప్రపంచమంతటికీ కాలుష్యంలేని విద్యుత్తును సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
చదవండి: లేడీ ఇన్‌ బ్లాక్‌.. చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.. ఇప్పటికి మిస్టరీగానే

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top