లేడీ ఇన్‌ బ్లాక్‌.. చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.. ఇప్పటికి మిస్టరీగానే

Lady in Black Suspense Thriller Story in Sakshi Funday

రెండు విరుద్ధమైన వాదనలెప్పుడూ కథను సుఖాంతం చేయవు. ఏది నిజం? ఏది అబద్ధం? అనే ప్రశ్నలను రగిల్చి, అపరిష్కృతంగా విడిచిపెడతాయి. మిస్టరీలుగా మిగిలిపోతాయి. సరిగ్గా నలభై రెండేళ్ల క్రితం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఐ–74 రోడ్డుపై జరిగిన ఘటన అలాంటిదే. అది 1980 జూన్‌ నెల. కటిక చీకటి, కారుమబ్బులకు హోరుగాలి తోడైంది. రాబర్ట్‌ డేవిడ్‌సన్‌ అనే వ్యక్తి బైక్‌ మీద ఇండియానాపోలిస్‌ లోని తన కూతురు ఇంటికి బయలుదేరాడు.

వర్షం మొదలయ్యేలోపు అక్కడికి చేరుకోవాలని ఆయన ఆత్రం. కానీ అలా జరగలేదు. ఉన్నపళంగా జోరువాన మొదలైంది. నిజానికి కొన్ని గంటల ముందు నుంచే తుఫాను హెచ్చరికలు సాగుతున్నాయి. ఆ క్రమంలో రాబర్ట్‌ ఐ–74 రోడ్డుపైకి వచ్చేసరికి వర్షం పెరగడంతో బైక్‌ బాక్స్‌లోని రెయిన్‌ జాకెట్‌ తీసి వేసుకోవడానికి రోడ్డు పక్కకు బండి ఆపాడు. జాకెట్‌ తీసి, ధరించేలోపు.. ఉరుము ఉరిమి రాబర్ట్‌ను తాకింది.

దారిన పోయేవారికి రాబర్ట్‌ కుప్పకూలడం స్పష్టంగా కనిపించింది ఆ మెరుపులో. చుట్టుపక్కలున్నవారికి అతడి ఆర్తనాదమూ వినిపించింది. పిడుగు దాడిలో 2,00,000 వోల్టుల కరెంటు ఒక్కసారిగా అతనిపై ప్రవహించడంతో రాబర్ట్‌లో ఉలుకూ పలుకూ లేదు. బతికే ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. సమాచారం అందిన కొంతసేపటికే అంబులెన్స్‌ అక్కడికి వచ్చేసింది. హుటాహుటిన అంబులెన్స్‌ ఎక్కించారు.

రాబర్ట్‌ పరిస్థితిని గమనించిన వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్సలోనే అతడు ఇక బతకడని నిర్ధారించారు. అతడిలో ఎలాంటి స్పందనా లేదు. ఏ అవయవం పనిచేయట్లేదు. గాలివాన మరింతగా పెరిగిపోతోంది. ఉన్నట్టుండి అంబులెన్స్‌లోని ఎలక్ట్రిక్‌ పరికరాలన్నీ పని చేయడం మానేశాయి. చుట్టూ ఉన్న వీధి దీపాలు కూడా ఆరిపోయాయి. కరెంట్‌ పోయిందని అనుకున్నారంతా.

మరి అంబులెన్స్‌కి ఏమైంది? రెండు బ్యాకప్‌ బ్యాటరీలు ఉండగా ఇలా ఎందుకు జరిగింది? అనే అయోమయంలో ఉన్నారా సిబ్బంది. ఇంతలో ఓ అలికిడి. పైనుంచి కింద దాకా నల్లటి వస్త్రాలను ధరించిన ఓ స్త్రీ మూర్తి అక్కడికి వచ్చింది. అంత పెద్ద హోరు వానలో.. ఆమె ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. చుట్టూ చూడగా... అక్కడ అంబులెన్స్, ఫైరింజిన్, రాబర్ట్‌ బైక్‌ తప్ప ఇంకేమీ లేవు. ఆమె చాలా చొరవగా రాబర్ట్‌కు దగ్గరగా వచ్చి.. ‘నేనొకసారి ఇతణ్ణి తాకొచ్చా?’ అని అడిగింది. నిర్ఘాంతపోయారు అక్కడున్నవారు. అంబులెన్స్‌ సిబ్బందిలో ఒకరు.. ‘ఏదైనా మంచి జరగబోతుందేమో?’ అనుకుంటూ ఆమెకు అనుమతి ఇచ్చారు. దాంతో ఆమె రాబర్ట్‌ని తాకింది. అతడి తలపై చేయి పెట్టి.. ఏవో మంత్రాలు చదివింది. రాబర్ట్‌నే చూస్తూ... మనసులో ఏదో అనుకుంది. కొంత సమయం గడిచాక.. ఆమె అంబులెన్స్‌ దిగి వెళ్లిపోయింది. ‘మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తుఫాన్‌లో ఎలా వెళ్తారు?’ లాంటి ఎన్నో ప్రశ్నలను సంధించారు అక్కడున్నవారు. కానీ ఆమె స్పందించలేదు.

ఆమె అలా వెళ్లగానే ఇలా అంబులెన్స్‌లో లైట్లు వెలిగాయి. అప్పుడే రాబర్ట్‌లోనూ స్పందన కనిపించింది. దాంతో అంబులెన్స్‌ ఆసుపత్రివైపు కదిలింది. ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్నప్పుడు కూడా రాబర్ట్‌  స్పృహలో లేడని... దాదాపు చనిపోయినట్లే అని వైద్యులు భావించారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయాడని ప్రకటించారు. రెండు నెలలు గడిచాయి. అతను కోమా నుంచి బయటకు వచ్చాడు. అతడు ఇలా బతికి ఉన్నాడంటే ఆమే కారణం అన్నారు నాటి ప్రత్యక్షసాక్షులు. ఆమె ఎవరు అని అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదు. నిజానికి అంత పెద్ద పిడుగు పాటుకి గురైన వ్యక్తి బతికి బట్టకట్టడం అనేది మిరాకిల్‌. అందుకే చాలామంది ఆ సిబ్బంది మాటలను నమ్మసాగారు.

ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే.. ఆమె ధరించిన దుస్తులు 1980 నాటివి కావని, 1800 కాలం నాటివని నాడు అంబులెన్స్‌లో ఉన్న పారామెడికో సిబ్బందిలో ఒకరు బయటపెట్టారు. ఆ విషయం ఆమెని అడుగుదామనుకుంటే.. ఆమె చాలా గంభీరంగా కనిపించిందని.. అడగటానికి భయమేసిందని అతడు చెప్పుకొచ్చాడు. దాంతో ఆ మహిళ ఎవరు అనేదానిపై చర్చ మొదలైంది. ఆమె అనేది అబద్ధమని.. పారామెడికోలు కట్టుకథ అల్లారనే వాదనలు ఒకవైపు నడుస్తుండగానే.. ఆమె దెయ్యమని కొందరు, కాదు దేవదూత అయ్యి ఉంటుందని మరికొందరు వాదనలకు దిగారు. అందుకు తగ్గ ఆధారాలను ఈ కథకు లింక్‌ చేశారు.

ఆమె వచ్చిన సమయంలో అంబులెన్స్‌తో సహా చుట్టూ లైట్స్‌ ఆరిపోయాయి కాబట్టి.. ఆమె దెయ్యమేనని, పైగా ఆమె ధరించిన దుస్తులు 1800 కాలం నాటివని ప్రత్యక్షసాక్షి చెబుతున్నాడు అందుకని ఆమె కచ్చితంగా దెయ్యమేనని చెప్పుకొచ్చారు చాలామంది. అయితే మరికొందరు మాత్రం ఆమె దేవదూత అనే దానికి ప్రత్యేక కారణం కూడా చెప్పారు. రాబర్ట్‌కి ప్రమాదం జరిగిన రోడ్డు పక్కనే పెద్ద మైదానం ఉందని, అక్కడ 19వ శతాబ్దంలో మతపరమైన ప్రార్థనలు జరిగేవని, వేలమంది ఆ ప్రార్థనల్లో పాల్గొనేవారని, అందువల్ల ఆమె.. దేవదూతేనని వాదించారు. దెయ్యం లేదా దేవదూత లేదా మత ప్రబోధకురాలు కావచ్చు అని కొందరు భావించారు. మొత్తంగా ఆమె ఎవరన్నది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. చావు అంచుల దాకా వెళ్లిన రాబర్ట్‌ని బతకించేంత శక్తి ఆమెకు ఎలా వచ్చింది? అసలు ఆమె ఎవరు? అనేది నేటికీ తేలలేదు. రాబర్ట్‌ పునర్జన్మ మాత్రం మెడికల్లీ మిస్టరీనే.
ఎస్‌.ఎన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top