ఆ వివాహం ఇక్కడా చెల్లుతుంది.. | Legal Advice: Marriage certificate obtained in Italy is also valid in India | Sakshi
Sakshi News home page

ఆ వివాహం ఇక్కడా చెల్లుతుంది..

May 21 2025 9:17 AM | Updated on May 21 2025 9:40 AM

Legal Advice: Marriage certificate obtained in Italy is also valid in India

నేను పోలాండ్‌ లో నివసిస్తున్న భారతీయుడిని. ఇటలీలో ఉంటున్న మరొక భారతీయ మహిళను అక్కడే పెళ్లి చేసుకున్నాను. మా మతాలు వేరు. తనకోసం ఇక్కడ వీసా  దరఖాస్తు చేస్తుండగా ఇటలీలో పొందిన మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ భారతదేశంలో కూడా చెల్లుతుంది అని భారతదేశ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా కోర్టు ఆర్డరు ఏవైనా ఉంటే తేవాలి అని సూచించారు. మేము ఇంకా భారతదేశ పౌరులమే కాబట్టి ఈ ధ్రువీకరణ తప్పనిసరి అని చె΄్పారు. మా పెళ్లి భారత దేశంలో చెల్లుతుందా? లేక అక్కడికి వచ్చి ఇంకొకసారి పెళ్లి చేసుకోవాలా? సరైన సలహా ఇవ్వగలరు.
– భరద్వాజ్, పోలాండ్‌ 

విదేశాలలో ఉంటున్న భారతీయులు పెళ్లి చేసుకుంటే (లేదా పెళ్లి చేసుకోబోతున్న వారిలో కనీసం ఒకరు భారతీయులు అయి ఉంటే) ఆ వివాహం భారతదేశంలో కూడా ‘ది ఫారిన్‌ మ్యారేజ్‌ యాక్ట్, 1969 ప్రకారం చట్టబద్ధమే. అయితే మీరు అదే విధమైన పెళ్లి భారతదేశంలో చేసుకుని ఉంటే ఆ పెళ్లికి ‘స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌’ నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. ఉదాహరణకు 

(1) మీకు ఇదివరకే పెళ్లి అయ్యి మీ భార్య/భర్త జీవిస్తూ (విడాకులు లేకుండా) ఉండకూడదు.
(2) మీరు ఉంటున్న దేశంలో కూడా మీ పెళ్లి చట్టబద్ధమైనది అయి ఉండాలి 
(3) మీరు పెళ్లి చేసుకున్న దేశంలోని అధికారులు మీ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అపాస్టిల్‌ చేయాలి. 

ఇటలీ దేశం కూడా భారతదేశంతోపాటు హేగ్‌ కన్వెన్షన్‌ ఒప్పందం లో సంతకం చేసింది కాబట్టి, మీ వీసా దరఖాస్తుకు – భారత దేశంలో ఎవిడెన్స్‌ ఇవ్వడానికి కూడా అపాస్టిల్‌ చేసిన ఆ దేశ వివాహ ధ్రువీకరణ పత్రం చట్టబద్ధమైనదే!

అలాంటి వివాహాలను రిజిస్టర్‌ చేయడానికి మీరు పెళ్లి చేసుకున్న దేశంలో ఉన్న ఇండియన్‌ ఎంబసీ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రతి ఇండియన్‌ ఎంబసీ లో కూడా వివాహాలను రిజిస్టర్‌ చేయడానికి ఒక ఆఫీసర్‌ ఉంటారు. 

ఇటలీలో మీరు పొందిన సర్టిఫికెట్‌ తీసుకొని ఫారిన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం అవసరమైన అప్లికేషన్‌ నింపి దరఖాస్తు చేసుకోండి. మీ దంపతులు – సాక్షులు కూడా వ్యక్తిగతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇండియన్‌ ఎంబసీ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం మీకు సరిపోతుంది. 

 (శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయండి)
 

(చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement